కాంగ్రెస్‌లో 'పీసీసీ' రేసు... నేతలంతా ఢిల్లీలోనే...

కాంగ్రెస్‌లో పీసీసీ రేసు... నేతలంతా ఢిల్లీలోనే...
x
Highlights

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికోసం పోటీపడుతున్న నేతలంతా హస్తిన బాటపట్టారు. భారత్ బచావో ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు పనిలో పనిగా...

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికోసం పోటీపడుతున్న నేతలంతా హస్తిన బాటపట్టారు. భారత్ బచావో ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలు పనిలో పనిగా హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఢిల్లీలోనే మకాం వేసి ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

దేశవ్యాప్తంగా ఏఐసీసీ పిలుపు మేరకు భారత్ బచావో కార్యక్రమాన్ని చేపట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి నేతలు తరలివెళ్లారు. పార్టీ ఇచ్చిన టార్గెట్ మేరకు నేతలు, కార్యకర్తలను ఢిల్లీ తీసుకెళ్లిన నేతలు అధిష్టానం పెద్దలకు పరిచయం చేస్తూ హడావిడి చేశారు.

అయితే, తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ పదవి మార్పు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తాను పీసీసీ చీఫ్ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఏఐసీసీకి మొరపెట్టుకున్నారు. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా పార్టీ నేతలు పీసీసీ రేసులో తాము ముందున్నామని ప్రచారం చేసుకుంటున్నారు.

టీ.పీసీసీ చీఫ్ రేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనర్సింహ, భట్టివిక్రమార్క ఢిల్లీలో మకాం వేసి మరీ హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తాను పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్టు పదే పదే చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

తమకు పీసీసీ చీఫ్ పదవిని కట్టబెడితే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే కాకుండా అధికారంలోకి తీసుకొస్తామని నేతలు హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆ పదవిలో ఎవరిని నియమించాలన్నదానిపై తర్జనభర్జన పడుతుంది కాంగ్రెస్ హై కమాండ్. మరి తెలంగాణ పీసీసీ పీఠం వారిలో ఎవరిని వరిస్తుందన్నది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories