Nizamabad: వింత ఆచారం.. పిడిగుద్దులాట

Hunsa Village People Celebrates Holi With Fist Fighting
x

Nizamabad: వింత ఆచారం.. పిడిగుద్దులాట

Highlights

Nizamabad: హున్సాలో హోళీ సందర్భంగా పిడిగుద్దులాట

Nizamabad: తెలంగాణ - మహారాష్ట్ర సరిహద్దులోని హున్సా గ్రామం పిడిగుద్దులాటతో ప్రత్యేక గుర్తింపు పొందింది. దేశంలో ఎక్కడాలేని విధంగా హోలీ పండుగ రోజున ఇక్కడ పిడిగుద్దులాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామం సుభిక్షంగా ఉండాలని కోరుతూ కులమత, వయోబేధం లేకుండా దశాబ్దాలుగా ఐక్యతతో పిడిగుద్దులాట నిర్వహిస్తున్నారు. పోలీసు శాఖ అభ్యంతరం తెలుపుతున్నా... తమ గ్రామ శ్రేయస్సు కోసం పిడిగుద్దులు తప్పవని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఒకవేళ హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట లేకుంటే... ఆ సంవత్సరం గ్రామంలో ఏదైనా కీడు జరిగితే... పిడిగుద్దులాట ఆడకపోవటమే కారణమని వారంతా బాధపడతారు.

నిజామాబాద్ జిల్లాలో సాలురా మండలం హున్సా గ్రామంలో ఐకమత్యంతో పూర్వీకుల కాలం నుంచి పిడిగుద్దులాట ఆడుతున్నారు. గ్రామ శ్రేయస్సు కోసం యువత, పెద్దలు రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటారు. రక్తం వచ్చిన చోట కాముని బూడిదతో తుడుచుకుంటారు. ఉదయం నుంచి హోలీ సంబురాలు జరుపుకొంటారు. మధ్యాహ్నం వరకు రంగులాట ముగించి.... గ్రామ శివారులో పెద్దఎత్తున కుస్తీపోటీలు నిర్వహిస్తారు. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన మల్ల యోధులు, తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి యువకులు తరలివస్తారు. గ్రామంలో నిర్వహించే ఈ ఆట విషయమై పోలీసులకు సమాచారం అందిస్తారు.

హున్సా గ్రామంలోని హనుమాన్‌ ఆలయం ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశం పిడిగుద్దులాటకు వేదిక అవుతుంది. గ్రామ శివారులో కుస్తీ పోటీలు ముగియగానే డప్పు చప్పుళ్ల మధ్య గ్రామస్తులు, యువకులు కేరింతలు కొడుతూ... గ్రామ పెద్దల ఇళ్లకు వెళ్లి వారిని పిడిగుద్దులాట వేదిక వద్దకు తీసుకొస్తారు. పెద్దల సూచనతో రెండు గ్రూపులుగా విడిపోయి పిడి గుద్దులాట కోసం ఏర్పాటు చేసిన తాడుకు ఇరువైపుల మోహరిస్తారు. గ్రామపెద్దల సంకేతంతో పిడిగుద్దులాటను ప్రారంభించి ఎడమ చేయితో తాడును పట్టుకుని కుడిచేయి పిడికిలితో ఒకరినొకరు బాదుకుంటారు. ఈ వేడుక సుమారు 20 నిమిషాలపాటు కొనసాగుతుంది. అనంతరం గ్రామస్తులు అంతా అన్నీ మరిచిపోయి ఎప్పటిలాగే ఒకరినొకరు ఆలింగనం చేసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకొంటారు. ఈ సందర‌్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున జాతర కొనసాగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories