Visakhapatnam: విశాఖలో డెంగ్యూ డేంజర్ బెల్స్

Dengue Fever Danger Bells in Visakhapatnam
x

విశాఖపట్నం లో డెంగ్యూ డేంజర్ బెల్స్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Visakhapatnam: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రెట్టింపు కేసులు * ప్రైవేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్న బాధితులు

Visakhapatnam: ఓ పక్క కరోనా మరోపక్క డెంగ్యూ జ్వరాలు విశాఖను కకలావికలం చేస్తున్నాయి. గత ఏడాదితో పోల్చితే.. అధిక సంఖ్యలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. గతంలో వార్డు ప్రాతిపదికగా పారిశుద్ద్య కార్మికులు రోడ్లు ఊడ్చడం, ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం, కాలువల్లో పూడికలు తీయడం చేసేవారు. కానీ కొద్దిరోజుల కిందట దీనిని మార్పుచేసి వార్డు సచివాలయాలను ప్రాతిపదికగా చేసుకుని పారిశుద్ధ్య కార్మికులను కేటాయిస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో ముగ్గురు చొప్పున రోడ్లు ఊడ్చడం, చెత్తసేకరణ, కాలువల్లో పూడిక తీయడం వంటి పనులు చేస్తున్నారు. పనిభారం పెరగడంతో చెత్త సేకరణ పూర్తిస్థాయిలో చేయలేకపోతున్నారు. దీంతో చెత్త కుప్పలు రోజుల తరబడి వీధుల్లోనే ఉండిపోతున్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలు దోమల వృద్ధికి అవకాశం కల్పిస్తున్నాయి.

గత ఏడాది జూన్‌లో కేవలం రెండు డెంగ్యూ కేసులు మాత్రమే నమోదైతే ఈ ఏడాది జూన్‌లో పది కేసులు రికార్డయ్యాయి. గత ఏడాది జులైలో ఒక్క కేసు కూడా నమోదు కానప్పటికీ.. ఈ ఏడాది జూలైలో ఏకంగా 47 కేసులు వెలుగుచూశాయి. గత ఏడాది ఆగస్టులో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. కానీ ఈ నెల ఐదో తేదీ నాటికే ఏడు కేసులు నమోదవడం నగరంలో డెంగ్యూ విజృంభణకు అద్దంపడుతోంది. డెంగ్యూ బాధితుల కోసం కేజీహెచ్‌ రాజేంద్రప్రసాద్‌ బ్లాక్‌లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దోమ కుట్టిన తరువాత మూడు నుంచి 15 రోజుల్లో లక్షణాలు బయటపడతాయని, సకాలంలో వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండకుండా ప్రజలు.. ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories