CM KCR: రైతులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్.. త్వరలో రూ.లక్ష వరకు రుణమాఫీ

CM KCR New Year Gift to Farmers Loan Waiver up to Rs Lakh  Soon
x

CM KCR: రైతులకు సీఎం కేసీఆర్ న్యూ ఇయర్ గిఫ్ట్.. త్వరలో రూ.లక్ష వరకు రుణమాఫీ

Highlights

CM KCR: కొత్త ఏడాది మొదటి నెలలోనే రుణమాఫీ చేసేందుకు కసరత్తు

CM KCR: రైతు బంధు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలో రుణమాఫీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకోబోతుంది. నూతన సంవత్సరం మొదటి నెలలోనే రుణమాఫీని కూడా క్లియర్ చేసేందుకు సీఎం కేసీఆర్ యోచిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రైతుల విషయంలో స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది BRS ప్రభుత్వం.

తెలంగాణ రాష్ట్ర రైతులకు మరో శుభవార్త ప్రకటించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. రైతులకు 10వ దఫా రైతు బంధును ప్రారంభించిన ప్రభుత్వం రుణమాఫీని కూడా క్లియర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు.. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న లక్ష రూపాయల వరకు రుణ మాఫీని వచ్చే నెలలో అమలు చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా 2020లో మొదటి దశలో 25వేల రూపాయలు, 2021లో రెండో దశలో భాగంగా 50వేల రూపాయల వరకు రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. ఇక వచ్చే ఏడాది జనవరి నుంచి రెండు దశల్లో 75 వేల రూపాయలు, లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయాలని సీఎం నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పనులను పూర్తిచేస్తూ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా 36.8 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రతిపాదనలను రూపొందించారు అధికారులు. ఇందుకోసం 25వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అప్పట్లో అధికారులు అంచనా వేశారు. ఒకేసారి మొత్తం మంజూరు చేయడం కష్టమని గుర్తించిన సీఎం కేసీఆర్.. నాలుగు దశల్లో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. 2.96 లక్షల మంది రైతులకు 25 వేల వరకు పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం 408 కోట్లు ఖర్చు చేసింది. రెండో దశలో 50 వేల వరకు రుణం తీసుకున్న దాదాపు 6.06 లక్షల మంది రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం 4వేల 900 కోట్లు చెల్లించింది. ఇక మిగిలిన 75వేలు, లక్ష రూపాయల రుణమాఫీని మార్చిలోపే క్లియర్ చేసేందుకు సర్కార్ సమయాత్తమవుతుంది.

రుణమాఫీలో అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంది. ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది వ్యక్తులకు లబ్ధి చేకూరకుండా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆధార్ లింకు, పట్టాదార్ పాసు పుస్తకాలు, రేషన్ కార్డులతో క్రాస్ చెకింగ్‌ ద్వారా ఒకే కుటుంబంలో రిపీట్ రుణాలు పొందిన వారికి కట్ చేస్తోంది. బోగస్ హక్కుదారులను తొలగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గింది. ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఆధార్ అనుసంధానంతో 'ఒక కుటుంబం - ఒక లబ్ధిదారుడు' అనే విధంగా రుణమాఫీ జరుగుతుంది.

పంట రుణమాఫీ పథకం ప్రకారం లబ్ధిదారుల జాబితా నుంచి సుమారు 10లక్షల మంది బోగస్ లబ్ధిదారులు పలువురిని తొలగించారు. దీని వల్ల మొదటి రెండు దశల్లో రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 4వేల కోట్లు ఆదా అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు 10వ దఫాను అమలు చేస్తూనే.. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మూడు, నాలుగో దశ రైతు పంట రుణాలను మాఫీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories