బాలాపూర్ లడ్డూకు 42 ఏళ్ల చరిత్ర.. 1994 నుంచి కొనసాగుతున్న వేలం ప్రక్రియ

Balapur Laddu has a ‌‌‌‌‌History of 42 years
x

Balapur laddu: బాలాపూర్ లడ్డూకు 42 ఏళ్ల చరిత్ర 

Highlights

Balapur laddu: 1994 నుంచి కొనసాగుతున్న వేలం ప్రక్రియ

Balapur laddu: ఆ లడ్డు మధురామృతం. దాన్ని అందుకోవడం అదృష్టం. మరి తింటే.. నిజంగా సౌభాగ్యం. కోరిన వారికి కొంగు బంగారంగా వెలుగొందుతున్న బాలాపూర్ వినాయకుడి చేతి లడ్డూ గురించి చెప్పాలంటే.. అదో చరిత్ర. కోట్లాది మందికి సెంటిమెంట్‌గా ఉన్న లడ్డూను దక్కించుకునేందుకు ఏటికాయేడు పోటీ పెరుగుతూనే ఉంది. సరికొత్త ధరలతో రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. అసలు ఆ లడ్డూకు ఎందుకంత క్రేజ్..? లడ్డూ వెనకున్న విశ్వాసాలేంటి..? ఇప్పటివరకు దక్కించుకున్న వారికి కలిగిన లాభాలేంటి..? వాచ్ ఇట్..

ఆది దంపతుల అపురూప పుత్రుడు వినాయకుడంటే అందరికీ ఇష్టమే. ఆయన ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రమే. అలాంటి లంబోధరుడి చేతిలో లడ్డూను తింటే.. ఆ వినాయకుడికి కరుణా కటాక్షాలు లభిస్తాయని ప్రగాఢ నమ్మకం. ఇంటిల్లి పాదీ సుఖసంతోషాలతో ఉంటారని విశ్వాసం. అందుకే వినాయక నవరాత్రులు ముగిశాక.. ఆయన చేతిలోని లడ్డూను దక్కించుకునేందుకు భక్తుల పోటీ మామూలుగా ఉండదు. లక్షలు పెట్టి దాన్ని దక్కించుకునేందుకు పోటీ పడతారు. అయితే లడ్డూ వేలం పాట అంటే.. అందరికీ గుర్తుకొచ్చేది.. బాలాపూర్ లడ్డు గురించే. ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ లడ్డూ వేలంపై యావత్ తెలుగు ప్రజల ఫోకస్ ఉంటుంది. అంతేనా.. లడ్డూ వేలం గురించి చర్చలు జరగని తెలుగిళ్లు లేవంటే అతిశయోక్తి కాదు.

వాయిస్ : బాలాపూర్ వినాయకుడికి 42 ఏళ్ల చరిత్ర ఉన్నా.. లడ్డూ వేలం మాత్రం 1994 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఆ ఏడాది బాలాపూర్ కు చెందిన కొలను మోహన్‌రెడ్డి కేవలం 450 రూపాయలకు వేలం పాట ద్వారా లడ్డూను దక్కించుకున్నారు. ఆ తర్వాత 1995లో 4 వేల 500 లకు మళ్లీ ఆయనే అందుకున్నారు. ఆ తర్వాత కొలను కృష్ణారెడ్డి 1996 లో 18 వేలకు, 1997 లో 28 వేలకు లడ్డూను వేలంలో దక్కించుకున్నారు. 1998 లో మళ్లీ కొలను మోహన్‌రెడ్డి 51 వేలకు వేలం పాట పాడారు. 1999లో కల్లెం ప్రతాప్‌రెడ్డి 65 వేలకు దక్కించుకున్నారు. 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు వేలం పాట జరగగా.. 2002లో తొలిసారి వేలం పాట లక్ష దాటింది. కందాడ మాధవరెడ్డి లక్షా 5 వేలకు లడ్డూను అందుకున్నారు.

2003లో చిగురంత తిరుపతిరెడ్డి లక్షా 55 వేలకు, 2004లో మరోసారి కొలను మోహన్ రెడ్డి 2 లక్షల ఒక వేయికి లడ్డూను అందుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2 లక్షల 8 వేలకు, 2006లో చిగురంత తిరుపతి రెడ్డి 3 లక్షలకు, 2007లో జి.రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు, 2008లో కొలను మోహన్ రెడ్డి 5 లక్షల 7 వేలకు, 2009లో సరిత 5 లక్షల 10 వేలకు లడ్డును వేలంపాటలో దక్కించుకొన్నారు. 2010లో కొడాలి శ్రీధర్ బాబు 5 లక్షల 35 వేలకు, 2011లో కొలను బ్రదర్స్ 5 లక్షల 45 వేలకు లడ్డును సొంతం చేసుకున్నారు. 2012లో పన్నాల గోవర్థన్ ఏడున్నర లక్షలకు దక్కించుకోగా.. 2013లో మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి 9 లక్షల 26 వేలకు, 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి తొమ్మిదిన్నర లక్షలకు లడ్డును దక్కించుకొన్నారు. 2015లో లడ్డూ ధర తొలిసారి 10 లక్షల దాటింది. కళ్లెం మదన్ మోహాన్ రెడ్డి 10 లక్షల 32 వేలకు వేలంలో లడ్డూపు సొంతం చేసుకున్నారు. 2016లో స్కైలాబ్ రెడ్డి 14 లక్షల 65 వేలకు, 2017లో నాగం తిరుపతి రెడ్డి వేలంలో 15 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2018లో శ్రీనివాస్‌ గుప్తా 16 లక్షల 60 వేలకు దక్కించుకున్నారు. 2019లో కొలను రాంరెడ్డి 17 లక్షల 60 వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

కరోనా కారణంగా.. 2020 లో బాలాపూర్ లడ్డూకు వేలం పాట నిర్వహించలేదు. 2021 నాదర్‌గుల్‌కు చెందిన మర్రి శశాంక్‌ రెడ్డి, ఏపీ ప్రొద్దుటూరుకు చెందిన‌ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌లు కలిసి.. 18 లక్షల 90 వేలకు ల‌డ్డూను దక్కించుకున్నారు. అయితే ఈ సారి వేలంలో 20 లక్షలు దాటే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లడ్డూ చరిత్రలో కొలను కుటుంబం వారే.. 9 సార్లు దక్కించుకున్నారు.

అయితే ఇన్ని లక్షలు పెట్టి లడ్డూను దక్కించుకున్న వారికి రకరకాల ప్రయోజనాలు కలుగుతాయనే నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. బాలాపూర్ లడ్డూ చుట్టు ఎన్నో సెంటిమెంట్లు అల్లుకుని ఉన్నాయి. లడ్డూను తమ ఇంట్లోకి తీసుకొస్తే.. ఆ ఏడాదంతా ఇళ్లంతా సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుందని, అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుందని నమ్మకంగా చెబుతారు. ఆ ప్రసాదాన్ని తమ పొలాల్లో చల్లితే.. ఎలాంటి కష్టాలు లేకుండా పంట బంగారమవుతుందన్న నమ్మకం ఉంది. బాలాపూర్ లడ్డూ కారణంగా.. తమ బాధలు తొలిగిపోయాయని కొందరు.. దాన్ని పొలంలో చల్లడం వల్ల అధిక దిగుబడులు వస్తాయని మరికొందరు.. బావిలో వేస్తే నీళ్లు ఎండిపోకుండా ఉంటాయని ఇంకొందరు.. ఇలా రకరకాలుగా వారికి కలిగిన అదృష్టాలను ఏకరువు పెడతారు.

మొదట భక్తిగా.. తర్వాత సెంటిమెంట్‌గా.. ఆ తర్వాత ప్రెస్టీజ్ ఇష్యూగా మారిపోయింది.. బాలాపూర్ లడ్డూ వేలం వ్యవహారం. రాష్ట్రవ్యాప్తంగా గణేష్ లడ్డూలకి ఎక్కడా లేని వాల్యూ తీసుకొచ్చింది.. బాలాపూర్ లడ్డూ వేలం పాటే. ఈ లడ్డూను సొంతం చేసుకున్నవారి పాప్యులారిటీ.. అమాంతం పెరిగిపోతుంది. వేలంలో పాల్గొనడం ఓ స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. అందుకే.. బాలాపూర్ లడ్డూను దక్కించుకునేందుకు ఇష్టపడతారు. బాలాపూర్‌కే ప్రతిష్ట తెచ్చిన లడ్డూని దక్కించుకోవడం కోసం చిన్నపాటి శ్రీమంతుల నుంచి కోటీశ్వరుల వరకు అందరూ పోటీ పడుతుంటారు. అందుకే వేలంలో కాంపిటీషన్ భారీగా ఉంటుంది.

ఏటా నిమజ్జనం రోజున ఉదయం 9 గంటలకు వేలం ప్రక్రియ ప్రారంభమవుతుంది. బాలాపూర్ గ్రామస్థులే కాదు.. ఇతర ప్రాంతాల వారూ వేలంలో పాల్గొనేందుకు బాలాపూర్‌ వస్తారు. వేలంలో లడ్డును సొంతం చేసుకున్న వారు స్థానికులైతే.. ఆ మొత్తాన్ని మరుసటి ఏడాది చెల్లించాల్సిన వెసులుబాటు ఉండగా.. ఇతరులైతే మాత్రం.. గణేశ్‌ ఉత్సవ కమిటీకి.. అక్కడికక్కడే ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories