మున్సిపల్ ఎన్నికల రూపంలో ఉత్తమ్‌కు మరో అగ్ని పరీక్ష.. పీసీసీ అధ్యక్షుడి మార్పు?

మున్సిపల్ ఎన్నికల రూపంలో ఉత్తమ్‌కు మరో అగ్ని పరీక్ష.. పీసీసీ అధ్యక్షుడి మార్పు?
x
ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
Highlights

2018, 2019 ఆ నాయకుడికి ఏమాత్రం కలిసిరాలేదు. చాలా దెబ్బలు తిన్నారు ఆ లీడర్. కనీసం కొత్తేడాది అయినా, కాస్త రిలీఫ్ ఇస్తుందని అనుకుంటే, అది కూడా పంచ్‌లు...

2018, 2019 ఆ నాయకుడికి ఏమాత్రం కలిసిరాలేదు. చాలా దెబ్బలు తిన్నారు ఆ లీడర్. కనీసం కొత్తేడాది అయినా, కాస్త రిలీఫ్ ఇస్తుందని అనుకుంటే, అది కూడా పంచ్‌లు విసిరేందుకు సిద్దమైందన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇంతకీ ఎవరా నాయకుడు? ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లో, ఎలాంటి టఫ్‌ ఫైట్‌ ఎదురుకాబోతోంది?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి, 2019 సంవత్సరం, కొంచెం కష్టం, మరింత నష్టం మిగిల్చినా, 2020 మాత్రం, ఆయనకు మరిన్ని సవాళ్లు విసరబోతోంది.

2018 చివర్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం, 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ తాను గెలిచినా, పార్టీ మాత్రం దారుణంగా దెబ్బతినడం, బీజేపీ పుంజుకోవడం, ఉత్తమ్‌ నాయకత్వాన్ని మసకబార్చింది. చివరికి తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌ నగర్‌లో, తన భార్యను నిలబెట్టినా, గెలిపించుకోలేకపోయారని, ఉత్తమ్‌పై ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. టీఆర్ఎస్‌పై దూకుడుగా పార్టీని నడిపించడంలో ఉత్తమ్‌ విఫలమవుతున్నారని, గాంధీభవన్‌లో నేతలు బాహాటంగా మాట్లాడుతున్నారు. ఇలా ఉత్తమ్‌కు, 2019 అనేక చేదు జ్ణాపకాలు మిగిల్చిపోయింది. అయితే, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి 2020 అంతకంటే పెద్ద సవాళ్లతో రెడీగా వుంది.

2020 సంవత్సరం, ఉత్తమ్‌కు పీసీసీ పీఠాన్ని దూరం చెయ్యడం ఖాయమన్న చర్చ జరుగుతోంది. కొత్త ఏడాదిలో పీసీసీ మార్పు తథ్యమని, అదే సరైన టైం అని అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే పీసీసీకి రాజీనామా చెయ్యడానికి ఉత్తమ్‌ సిద్దపడ్డారని సమాచారం. అయితే ఉత్తమ్ ప్లేస్‌లో ఎవరిని నియమించాలన్నదానిపై హైకమాండ్ తర్జనభర్జనపడుతోంది. ఎవరిని నియమిస్తే, ఏమవుతుందోనని మథనపడుతోంది. అయితే, మున్సిపల్‌ ఎన్నికల తర్వాతే పీసీసీ అధ్యక్షుడిని మార్చాలని రాష్ట్ర నేతలతో పాటు అధిష్టానం కూడా ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఈ ఫలితాలు కూడా వచ్చేస్తే, పార్టీ నిర్మాణం కొత్తగా మొదలుపెట్టొచ్చని భావిస్తోందట హైకమాండ్. అంటే, మున్సిపల్‌ ఎన్నికల తర్వాత, ఉత్తమ్‌కు పీసీసీ పీఠం దూరం కావొచ్చని తెలుస్తోంది. పీసీసీ అధ్యక్ష పీఠం నుంచి బయటపడ్డాక, జాతీయ రాజకీయాలపైనే ఉత్తమ్‌ ఎక్కువగా దృష్టిసారించే అవకాశముందని తెలుస్తోంది.

ఉత్తమ్‌కు కొత్త ఏడాది వస్తూవస్తూనే మున్సిపల్‌ ఎన్నికల రూపంలో అగ్ని పరీక్ష పెడుతోంది. ఇప్పటివరకూ లెక్కలేనన్ని అపజయాలను మూటగట్టుకున్న ఉత్తమ్‌, ఈ ఎన్నికల్లోనైనా పార్టీని పరుగులు పెడతారనుకుంటే, ఇప్పటి వరకూ ఎలక్షన్స్‌కు పార్టీ శ్రేణులను సమాయత్తం చెయ్యలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎలాగూ పీసీసీ అధ్యక్షుడిగా ఇవే తనకు చివరి ఎన్నికలని భావిస్తున్న ఉత్తమ్‌, పెద్దగా దృష్టిసారించడం లేదన్న వాదన వినిపిస్తోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు, పీసీసీ పీఠం రూపంలో ఉత్తమ్‌కు రెండు గట్టి సవాళ్లు విసురుతోంది 2020 సంవత్సరం. చూడాలి, ఈ సవాళ్లను ఉత్తమ్‌ ఎలా ఎదుర్కొంటారో.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories