RR VS DC: జైపూర్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం

Rajasthan Won The IPL Match In Jaipur
x

RR VS DC: జైపూర్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం

Highlights

RR VS DC: 20 ఓవర్లలో 5 వికెట్లుకోల్పోయి 185 పరుగులుచేసిన రాజస్థాన్

RR VS DC: జైపూర్‌ వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ లక్ష్యఛేదనలో చతికిల పడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం కైవసం చేసుకుంది. వ్యక్తిగతంగా 84 పరుగుల అత్యధిక స్కోరుతో రాజస్థాన్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రియాన్ పరాగ్‌ కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.

టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇన్నింగ్స్‌ మందకొడిగా ఆరంభమైంది. 9 పరుగులకే తొలివికెట్ గా ‍యశస్వీ జైస్వాల్ పెవీలియన్ బాట పట్టాడు. కాసేపటికే 30 పరుగుల వద్ద రెండో వికెట్‌గా రాజస్థాన్ కెప్టన్ సంజూ శాంసన్ వెనుదిరిగాడు. జట్టుస్కోరు 36 పరుగుల వద్ద మూడో వికెట్‌గా జోస్ బట్లర్ వెనుదిరగడంతో రాజస్థాన్ పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. క్రీజులో ఉన్న రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్ జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. బౌండరీలు, సిక్సర్లతో అశ్విన్ విరుచుకుపడటంతో, రియాన్ పరాగ్ రియాక్షన్ విశ్వరూపాన్ని ఆవిష్కరించింది. భారీస్కోర్ సాధించేందుకు మార్గం సుగమమైంది.

19 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు అందించిన అశ్విన్ వెనుదిరగడంతో జూరెల్ సహకారంతో రియాన్ పరాగ్ రెచ్చిపోయాడు. బౌండరీల మోత, సిక్సర్ల హోరుతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. 12 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు అందించిన జూరెల్ ఔటయ్యాడు. ఆతర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మియర్, రియాన్ పరాగ్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. హెట్మియర్ 7 బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్ కొట్టి 14 పరుగులు అందించాడు. 45 బంతులు ఎదుర్కొన్న రియాన్ పరాగ్ 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టులో పరాగ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లు ఐదుగురూ ఒక్కో వికెట్ చేజిక్కించుకున్నారు.

లక్ష్య చేధనలో సత్తా చాటాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్లు చెలరేగి పోయారు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఎడాపెడా బ్యాటును ఝుళిపించారు. పటిష్టమైన ఆటతీరుతో పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. 12 బంతుల్లో 5 బౌండరీలు బాదిన మిచెల్ మార్ష్ 23 పరుగులతో వెనుదిరిగాడు. ఆతర్వాత రిక్కీ బుయ్ గోల్డెన్ డెక్ గా పెవీలియన్ బాట పట్టాడు. క్రీజులో ఉన్న డేవిడ్ వార్నర్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టన్ రిషబ్ పంత్ తో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులతో డేవిడ్ వార్నర్ వెనుదిరిగాడు. ఈ క్రమంలో 26 బంతులు ఆడిన పంత్ రెండు ఫోర్లు ఒక సిక్సర్‌తో 28 పరుగులు నమోదు చేశాడు. ఆతర్వాత వచ్చిన త్రిస్టన్ స్టబ్స్ 23 బంతుల్లో రెండు ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు అందించాడు. అక్షర్ పటేల్ 15 పరుగులు, అభిషేక్ పోరెల్ 9 పరుగులతో నిలిచారు. 20 ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ జట్టు 173 పరుగులతో సరిపెట్టుకుంది. లక్ష్యాన్ని చేదించే విధంగా కన్పించిన ఢిల్లీ జట్టును కట్టడి చేయడంలో రాజస్థాన్ బౌలర్లు సఫలమయ్యారు. దీంతో 12 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ విజయం సాధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories