121 ఏళ్ళ ఒలింపిక్స్‌ చరిత్ర ఉన్న భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలెన్నో తెలుసా?

How Many Medals has India Won in Olympics?
x

121 ఏళ్ళ ఒలింపిక్స్‌ చరిత్ర ఉన్న భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలెన్నో తెలుసా?

Highlights

Olympics: అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌ ఎక్కడుంది..? జనాభాలో రెండోస్థానంలో ఉన్న మనం ఆటల్లో ఎన్నో ప్లేస్‌లో ఉన్నాం..?

Olympics: అంతర్జాతీయ క్రీడల్లో భారత్‌ ఎక్కడుంది..? జనాభాలో రెండోస్థానంలో ఉన్న మనం ఆటల్లో ఎన్నో ప్లేస్‌లో ఉన్నాం..? ఆప్రికాలోని పేద దేశాలు మనకంటే ముందుకు ఎళా వెళుతున్నాయి..? 121 ఏళ్ళ ఒలింపిక్స్‌ చరిత్ర ఉన్న భారత్‌ ఇప్పటివరకు సాధించిన పతకాలెన్ని..? టోక్యోలో మన ఆటగాళ్ళు మెరుగైన ఫలితాలు సాధించగలుగుతారా..?

130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో క్రీడాకారులను తయారు చేయడం కంటే క్రీడా రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఒలింపిక్స్ ‌నుంచి క్రికెట్‌ అసోసియషన్స్‌ వరకు రాజకీయ నాయకుల జోక్యంతో భ్రష్టుపట్టి పోతున్నాయని క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విశ్వ క్రీడల్లో మనం ఎక్కడున్నామో తెలియని పరిస్తితి కొనసాగుతోంది. 1900వ సంవత్సరం నుంచి ఇండియా ఒలింపిక్స్‌లో పాల్గొంటోంది. ఇప్పటివరకు మన క్రీడాకారులు సాధించిన పతకాలు కేవలం 28. అంతర్జాతీయ క్రీడల్లో మన దేశం స్థానం 67. మనకంటే చిన్న దేశాలు, పేద ఆఫ్రికన్‌ దేశాలు కూడా భారత్‌ కంటే మెరుగైన స్థానంలోనే ఉన్నాయి. నాలుగేళ్ళకోసారి జరిగే ఒలింపిక్స్‌లో ప్రతి సారీ లెక్కిస్తే సగటున ఒక్కటి కూడా భారత్‌ సాధించలేకపోయింది. 121 ఏళ్ళ ఒలింపిక్స్‌ ఇండియా చరిత్రలో కేవలం 9 బంగారు పతకాలు సాధించాం. అది కూడా పురుషుల హాకీలోనే. 1980లో మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో హాకీ క్రీడాకారులు సాధించిన బంగారు పతకమే మనం చూసిన ఆ‌ఖరు బంగారం. భారత జాతీయ క్రీడ హాకీ కూడా ఆ తర్వాత ఇంతవరకు ఎలాంటి పతకమూ సాధించలేకపోయింది.

ప్రపంచంలోని పెద్ద దేశాలతో పోలిస్తే క్రీడలకు భారత్‌ కేటాయించే బడ్జెట్‌ చాలా తక్కువ. పైగా వర్తమాన ఆర్థిక సంవత్సరంలో గత ఏడాది కంటే 230 కోట్లు తగ్గించింది భారత ప్రభుత్వం. 2020లో 2826 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది కేవలం 2596 కోట్లు మాత్రమే ఇచ్చింది. ఈ బడ్జెట్‌లో కూడా సింహభాగం నిర్వహణ ఖర్చులకే పోతుంది. క్రీడాకారులకు పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. దీంతో మన క్రీడాకారులు ప్రతి సారి ఒలింపిక్స్‌లో తెల్ల ముఖాలు వేసుకుని తిరిగివస్తున్నారు. జాతీయ క్రీడ హాకీ 1980 తర్వాత ఒలింపిక్స్‌లో ఎలాంటి ప్రతిభ చూపలేకపోవడానికి మన ప్రభుత్వాల ఘనతే కారణంగా చెప్పవచ్చు. 2016లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన ఒలింపిక్స్‌కి ఎంతో ఆశగా 15 అంశాల్లో పాల్గొనేందుకు 117 మంది క్రీడాకారులు వెళ్ళారు. ఒక వెండి, ఒక కంచు పతకంతో సరిపెట్టుకుని తిరిగివచ్చారు. దానికే మన ప్రభుత్వాలు సంబరపడిపోయాయి. బ్యాడ్‌మింటన్‌ క్రీడాకారణి పీవి సింధు రజతం సాధించగా రెజ్లింగ్‌లో సాక్షిమాలిక్‌ కాంస్యం సాధించి విశ్వ క్రీడల్లో భారత్‌ పరువు కాపాడారు.

జపాన్‌లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 228 క్రీడాకారులు తరలివెళ్ళారు. వీరు 18 అంశాల్లో పాల్గొంటారు. గత ఐదారేళ్ళుగా మన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో బాగా రాణిస్తున్నందున ఈసారి రెండంకెల పతకాలు సాధిస్తారనే అశాలు రేకెత్తిస్తున్నారు. వివిధ దేశాల్లో జరుగుతున్న ట్రోఫీల్లో, ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గొప్ప గొప్ప క్రీడాకారులపై విజయం సాధిస్తుండటంతో టోక్యో ఒలింపిక్స్‌పై మనవాళ్ళ మీద ఆశలు పెట్టుకున్నారు క్రీడాభిమానులు. ముఖ్యంగా ఆర్చరీ, షూటింగ్‌, బ్యాడ్‌మింటన్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ వంటి అంశాల్లో కచ్ఛితంగా పతకాలు సాధించగలుగుతారని భావిస్తున్నారు. ఒలింపిక్స్‌ జరిగిన ప్రతిసారీ మన క్రీడాకారులు పతకాల పంట పండిస్తారని ఆశించడం అంతిమంగా నీరుగారిపోవడం మామూలుగానే జరుగుతోంది. 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించినవారు 2016లో రెండు పతకాలకే పరిమితమయ్యారు. ఈ రెండు పతకాలు కూడా పూర్తిగా కొత్త తరమే సాధించి తెచ్చింది.

క్రీడాభిమానులు, నిపుణుల అంచనాలకు అనుగుణంగా మన క్రీడాకారులు టోక్యోలో భారత్‌ పతాకాన్ని వినువీధుల్లో గర్వంగా ఎగురవేస్తారని పతకాల పంట పండిస్తారని ఆశిద్దాం. ఇక 2032లో జరిగే ఒలింపిక్స్‌‌ను ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌ నగరంలో నిర్వహించనున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ ప్రకటించింది. 2000 సంవత్సరంలో సిడ్నీలో నిర్వహించిన ఆస్ట్రేలియా తిరిగి 32 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం జరగబోతున్న టోక్యో ఒలింపిక్స్‌ తర్వాత 2024లో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో జరుగుతాయి. 2028లో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్‌ నగరంలో నిర్వహిస్తారు. మరి భారతదేశం ఒలింపిక్స్‌ నిర్వహించే స్థాయికి ఎప్పుడు ఎదుగుతుందో...?

Show Full Article
Print Article
Next Story
More Stories