FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేత అర్జెంటీనా

Argentina Won FIFA World Cup2022
x

FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ 2022 విజేత అర్జెంటీనా

Highlights

FIFA World Cup: హోరాహోరీ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై విజయం

FIFA World Cup: మెస్సీ కల నెరవేరింది. ఫిఫా వరల్డ్ కప్ 2022 విజేతగా అర్జెంటీనా నిలిచింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య.. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌పై 4-2 తేడాతో గెలిచిన అర్జెంటీనా విజేతగా నిలిచింది. మెస్సీ వర్సెస్ ఎంబాపెగా సాగిన పోరులో ఎంబాపె హ్యాట్రిక్ సాధించినప్పటికీ వరల్డ్ కప్ మాత్రం మెస్సీకి దక్కింది.

వరల్డ్ కప్‌లో అర్జెంటీనా విజయాల్లో కీలక పాత్ర పోషించిన మెస్సీ ఫైనల్లోనూ మెరిశాడు. ప్రథమార్ధంలో మెస్సీ గోల్‌ చేయడంతో ఖాతా తెరిచిన అర్జెంటీనా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికే 36వ నిమిషంలో ఏంజెల్ డి మారియా మరో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా ఆధిక్యం 2-0కు చేరింది. ఫస్ట్ హాఫ్‌లో రెండు గోల్స్ చేసి ఆధిపత్యం చెలాయించిన అర్జెంటీనా.. ఫ్రాన్స్‌కు గోల్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఇవ్వలేదు.

ఆట ద్వితీయార్ధంలోనూ ఫ్రాన్స్ చాలా సేపటి వరకూ గోల్ చేయడం కుదర్లేదు. దీంతో ఫైనల్ మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందేమో అనిపించింది. కానీ ఆట 80వ నిమిషంలో ఎంబాపె అద్భుతం చేశాడు. పెనాల్టీని గోల్‌గా మలవడంతో ఫ్రాన్స్ ఖాతా తెరిచింది. రెండు నిమిషాల్లోపే ఎంబాపె మరో గోల్ చేయడంతో ఇరు జట్ల స్కోర్లు 2-2తో సమం అయ్యాయి. ద్వితీయార్ధం ముగిసే సమయానికి ఇరు జట్లు 2-2తో సమ ఉజ్జీలుగా నిలవడంతో అదనపు సమయాన్ని కేటాయించారు.

ఎక్స్‌ట్రా టైం సెకండ్ హాఫ్‌లో 108వ నిమిషంలో మెస్సీ గోల్ చేయడంతో అర్జెంటీనా 3-2 ఆధిక్యంలో దూసుకెళ్లింది. 118వ నిమిషంలో కైలియన్ ఎంబాపె పెనాల్టీని గోల్‌గా మలవడంతో ఇరు జట్ల స్కో్ర్లు 3-3తో సమం అయ్యాయి. వరల్డ్ కప్ ఫైనల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన రెండో ఆటగాడి ఎంబాపె నిలిచాడు.

30 నిమిషాల అదనపు సమయంలోనూ ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో విజయం సాధించిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది.

అర్జెంటీనా వరల్డ్ కప్ గెలవడం ఇది మూడోసారి కావడం విశేషం. చివరిసారిగా 1986లో వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా 1978లో తొలి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. మరో మూడుసార్లు ఫైనల్లో ఆ జట్టు ఓడింది. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఆడిన అర్జెంటీనా డిపెండింగ్ ఛాంపియన్‌‌ను ఫ్రాన్స్‌ను మట్టి కరిపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories