Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజే బంగారం కొనాలని ఎందుకు చెబుతారు? ఈ సంప్రదాయం ప్రత్యేకత ఏంటి?

Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజే బంగారం కొనాలని ఎందుకు చెబుతారు? ఈ సంప్రదాయం ప్రత్యేకత ఏంటి?
x
Highlights

అక్షయ తృతీయ.. ఈ పేరు చెప్పగానే చాలా మంది బంగారం గుర్తుకు వస్తుంది. ఈ పర్వదినాన చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కొనుగోళ్లు మాత్రమే కాదు.

Akshaya Tritiya: అక్షయ తృతీయ.. ఈ పేరు చెప్పగానే చాలా మంది బంగారం గుర్తుకు వస్తుంది. ఈ పర్వదినాన చాలా మంది బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కొనుగోళ్లు మాత్రమే కాదు.కొత్త కంపెనీలు పెట్టడం, కొత్త ఇన్వెస్టిమెంట్లు చేయడానికి కూడా మంచి రోజుగా అక్షయ తృతీయను భావిస్తారు. ఇంతకీ అక్షయ తృతీయ అంటే ఏమిటి, ఈ రోజున చాలా మంది బంగారం కొనుగోళ్లు లేదా డబ్బుకు సంబంధించిన పనులను మొదలుపెట్టాలని ఎందుకు భావిస్తారు?

అక్షయ తృతీయ అంటే ఏమిటి?

వైశాఖ మాస శుక్లపక్షం మూడో రోజున జరుపుకునే పండుగ ఇదీ. ప్రస్తుత ఏడాదిలో ఇది మే 10 తారీఖున పడింది. అక్షయము అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. తృతీయ అంటే మూడో రోజు. హిందూ సంప్రదాయాల ప్రకారం, ఈ రోజు తలపెట్టే కొత్త పనులు మనకు సంపద, సుఖశాంతులను తెచ్చిపెడతాయని భావిస్తారు.

విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు ఈ రోజునే జన్మించాడని కూడా చెబుతారు. త్రేతా యుగం కూడా ఈ రోజేనే మొదలైందని కూడా కొందరు విశ్వసిస్తారు.

ఎన్నో కథలు ప్రచారంలో..

పాండవులు వనవాసంలో ఉండేటప్పుడు సరిగ్గా ఇదే రోజున ద్రౌపదికి కృష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చారని కూడా కథలు ప్రచారంలో ఉన్నాయి. అక్షయ పాత్ర నుంచి వచ్చే ఆహార పదార్థాలు ఎప్పటికీ తరిగిపోవట.

మరోవైపు ఇదే రోజున వేద వ్యాసుడు మహాభారతాన్ని రాయడం కూడా మొదలుపెట్టారని చెబుతారు.

అంతేకాదు తన చిన్ననాటి మిత్రుడైన శ్రీకృష్ణుడిని ద్వారకలో ఇదే రోజున సుదాముడు కలిశాడని, ఆ తర్వాత సుదాముడి జీవితంలో తరిగిపోని సంపద, సంతోషం వచ్చాయని కూడా చెబుతారు.

ఎలా జరుపుకుంటారు?

అక్షయ తృతీయ రోజున విష్ణు మూర్తి, లక్ష్మీ దేవికి భక్తులు పూజలు చేస్తారు.

కొంతమంది సూర్యభగవానుడికి ఆర్ఘ్యం అర్పిస్తారు. అంటే చేతుల్లో నీటిని తీసుకొని సూర్యుడికి వందనం చేస్తారు. మరికొంతమంది ధ్యానం కూడా చేస్తారు.

జ్యోతిష శాస్త్రంలోనూ అక్షయ తృతీయకు ప్రాముఖ్యముంది. ఈ సమయంలో సూర్యుడు, చంద్రుడు శక్తిమంతమైన స్థానాల్లో ఉంటారని చెబుతారు.

వారి శక్తి ఎక్కువగా ఉండటంతో ఈ రోజు చేసే మంచి పనులకు, తీసుకొనే నిర్ణయాలకు మంచి ఫలితాలు వచ్చేలా వారు చూస్తారని అంటారు.

మరోవైపు ఈ రోజున చాలా మంది పెళ్లి కూడా చేసుకుంటారు. అంతేకాదు, చాలా మంది ఈ రోజున పేదలకు ఆహారం, బట్టలు, డబ్బు లాంటివి దానం చేస్తారు.

ఏం చేయకూడదు?

చేయాల్సిన పనుల జాబితా ఉన్నట్లే.. అక్షయ తృతీయ రోజు చేయకూడని పనుల జాబితా కూడా ఉంది.

ముఖ్యంగా ఈ రోజున అప్పులు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఆ అప్పు నానాటికీ పెరుగుతూనే ఉంటుందని చెబుతారు.

అంతేకాదు, విలావంతమైన వస్తువుల కోసం అనవసర ఖర్చులు కూడా ఈ రోజు చేయకూడదని ఇంట్లోని పెద్దవారు సూచిస్తారు.

సాధారణంగా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర గృహోపకణాలను ఈ రోజు చాలా మంది కొనేందుకు ఇష్టపడరు.

నిజంగానే కలిసొస్తుందా?

2014 నుంచి నేటి వరకు అక్షయ తృతీయనాడు కొన్న బంగారం ఆ మరుసటి ఏడాదికి ధరలో వ్యత్యాసం ఎలా ఉందనే అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక కథనం ప్రచురించారు.

2015 (12%), 2017 (3%) మాత్రమే ధరోలో తగ్గుదల కనిపించింది. మిగతా అన్ని ఏడాదిల్లోనూ రేటు పెరుగుతూనే వెళ్లింది. ముఖ్యంగా 2020లో రికార్డు స్థాయిలో (32%) పెరుగుదల కనిపించింది.

ప్రస్తుత ఏడాదిలోనూ రెండంకెల స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది.

ప్రస్తుతం ధరలు పెరగడానికి బులియన్ మార్కెట్‌లో అస్థిరత, భౌగోళిక-రాజకీయ-ఉద్రిక్తతలే కారణమని, కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ సంస్థ ఎంవోఎఫ్ఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవనీత్ దమాణీ టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు.

అయితే, బంగారం ఇలానే ధరలు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తాయని తాము ఆశించడంలేదని, కొంత సమయం వరకూ ధరలు స్థిరంగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

డిజిటల్ గోల్డ్ సంగతేంటి?

ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌పైనా మీడియాలో చాలా చర్చ జరుగుతోంది. డిజిటల్ గోల్డ్ అంటే మార్కెట్‌కు వెళ్లి బంగారం కొనకుండా గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఎఫ్‌వోఎఫ్‌లలో పెట్టుబడులు పెట్టడమే. దీన్ని కొనుగోలు చేయడం తేలిక. బంగారు ఆభరణాల కంటే కాస్త తక్కువ ధరకే ఇవి అందుబాటులోకి వస్తాయి.

‘‘బంగారాన్ని దాచిపెట్టుకోవడానికి లాకర్లను ఆశ్రయించడం లేదా ఎవరైనా వీటిని దొంగతనం చేస్తారని భయం ఉండేటప్పుడు డిజిటల్ గోల్డ్ ఎంచుకోవడం మేలు’’ అని బిజినెస్ టుడేతో మార్కెట్ నిపుణుడు డాక్టర్ రవీ సింగ్ చెప్పారు.

అయితే, ఏళ్లపాటు ధగధగ మెరిసే బంగారు ఆభరణాల ముందు డిజిటల్ గోల్డ్ పేపర్లు తేలిపోతాయని రజినీ జ్యూవెలర్స్ సీఈవో శివం బాత్రా అభిప్రాయపడ్డారు.

‘‘భారత్‌లో బంగారం అంటే కేవలం పెట్టుబడి మాత్రమే కాదు. ఇదొక వారసత్వ సంపద. ఒక తరం నుంచి మరొక తరానికి ఇది వస్తుంటుంది’’ అని ఇండియా టుడేతో పీపీ జ్యువెలర్స్ డైరెక్టర్ ప్రియూష్ గుప్తా చెప్పారు.

అయితే, బంగారమా లేదా గోల్డ్ బాండ్స్ వీటిలో ఏది ఎంచుకోవాలి అనేది సదరు వ్యక్తి అవసరాలు, తన దగ్గరున్న డబ్బు, ఇతర ముప్పులు లాంటి అంశాలను బేరీజు వేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories