ఆనంద నిలయం... వేంకటేశుడి వైభోగం

ఆనంద నిలయం... వేంకటేశుడి వైభోగం
x
Highlights

చుట్టూ పచ్చని చెట్లు... చల్లని గాలి... దూరంగా కొండల వరస. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడుని చూడాలన్న ఆరాటం. మేఘాలను ముద్దాడుతూ ఆకాశ మార్గానికి దగ్గరగా...

చుట్టూ పచ్చని చెట్లు... చల్లని గాలి... దూరంగా కొండల వరస. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడుని చూడాలన్న ఆరాటం. మేఘాలను ముద్దాడుతూ ఆకాశ మార్గానికి దగ్గరగా చేసే కొండబాటలో నడవడం చెప్పలేని అనుభూతి. ఏడుకొండల వాడా... గోవిందా... గోవిందా... అనగానే లేని శక్తి వస్తుంది. భక్తిభావంతో ముక్తిమార్గం వైపు నడవాలనిపిస్తుంది. ఆధ్యాత్మిక ఆనందం వైపు అడుగులు వేయాలని అనిపిస్తుంది. వక్షస్థలమున శ్రీ మహాలక్ష్మి నివసించడం వల్ల శ్రీనివాసుడయ్యాడు. తిరుమలకొండల్లో కొలువై ఉండటం వల్ల తరుమలేశుడయ్యాడు. శివరూపమని శైవులు భావించడం వల్ల వెంకటేశ్వరుడయ్యాడు. శాక్తేయులు బాలా త్రిపుర సుందరిగా భావించడం వల్ల బాలాజీగా మారాడు. ఆపదల నుంచి అవలీలగా బయట పడేస్తాడు కాబట్టి ఆపదమొక్కులవాడుగా అవతరించాడు. మొత్తంగా ఏడుకొండలవాడిగా ఎనలేని భక్తిభావాన్ని నింపాడు. ఆ భావనలో ఓలలాడిస్తున్నాడు.

అనంతమైన ప్రకృతి మాత అందాలను ఆస్వాదిస్తూ... దివ్య తీర్థ మహిమను దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తూ... తపోధనులకు నిలయమైన వైకుంఠధామ వైభవాన్ని నెమరేసుకుంటూ సాగే తిరుమల యాత్ర ముక్తిని ప్రసాదించే జ్ఞానక్షేత్రం, పుణ్య నిలయం. అందుకే తిరుమలను తీర్థాద్రి అని కూడా పిలుస్తారు. తిరుమల యాత్ర వల్ల ప్రకృతితో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆయురారోగ్యాలు పెరుగుతాయి. జ్ఞానసిద్ధి కలుగుతుంది. ముక్తిభావం ముందుంటుంది. మానవ జీవిత పరమార్ధానికి దేవదేవుడు మనకిచ్చిన అందాల లోగిలి తిరుమల. ఏడుకొండలవాడి యాత్ర ఎన్నెన్నో జన్మల సర్వ పాపహరణం. మానవజాతి పరమార్ధానికి అదొక ముక్తిమార్గం.

బ్రహ్మాండ నాయకుడి దర్శనభాగ్యం అనంతకోటి పుణ్యఫలం వల్ల సిద్ధిస్తుంది. ఏడుకొండలు ఎక్కి వచ్చినా... సప్తగిరీశుని దర్శనం కాకుండా అసంతృప్తితో వెనుదిరిగిన భక్తులు ఎంతోమంది. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్పా... లక్ష్మీవల్లభుని దర్శనం కలగదు. అంతటి మహత్యమున్న ఏడుకొండలు... ఈ సప్తిగిరులు... ఈ తిరుమల క్షేత్రం... ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ఇంతటి మహత్తు కలిగిన దేవదేవుడు... కలియుగ వరదుడు... శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడు భూమండలంలో ఉండదు. అందుకే నారాయణుడి నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనమ్ అంటుంది భాగవతం. కలియుగంలో శ్రీహరి సంకీర్తనతో సర్వ పాపాలు నశించిపోతాయి. అందుకే కలౌ సంకీర్త్య కేశవమ్ అని అన్నారు. యజ్ఞయాగాది క్రతువులకు కలియుగంలో ప్రాధాన్యం లేదు... నిర్మలమైన హృదయంతో ఆ సప్తగిరీశుడిని నోరార కీర్తించగలిగితే చాలు. అందుకే పద కవితా పితామహుడు, వాగ్గేయకారుడు... వేంకటేశ్వరుని వేలమార్లు జపించాడు. వేనోళ్ల కీర్తించాడు. అన్ని మంత్రముల సారం ఏడుకొండల్లోనే ఉందని చాటి చెప్పాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories