ఇద్దరికి ఉరి.. ఒకరికి యావజ్జీవం

Submitted by arun on Tue, 09/11/2018 - 09:34

హైదరాబాద్ జంటపేలుళ్ల కేసులో సంచలన తీర్పు వెలువడింది. ఇద్దరు దోషులకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరొకరిని దోషిగా తేల్చిన కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. ముష్కరులకు ఉరిశిక్ష సంగతేమో కానీ పేలుళ్ళ ఘటన జరిగిన 11 ఏళ్ళయినా తమకు న్యాయం జరగలేదని బాధిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. 

44 మందిని బలిగొన్న మారణహోమానికి కారణమైన ఇద్దరికి ఉరిశిక్ష పడింది. గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఏ-1 అనీక్ షరీఫ్, ఏ-2 అక్బర్ ఇస్మాయిల్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక్కొక్కరికీ చెరో 10వేలు చొప్పున జరిమానా కూడా విధించింది. పేలుళ్ల తర్వాత నిందితులకు ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన తారీఖ్‌ అంజుమ్ హసన్‌‌కు యావజ్జీవ ఖైదు విధించింది. పేలుళ్ళ కుట్రల్లో తమకెలాంటి భాగస్వామ్యం లేదంటూ దోషులు న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించారు. పోలీసులు తమను అక్రమంగా కేసులో ఇరికించారని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం దగ్గర ఆరోపించారు. కానీ, పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించడంతో ఇద్దరికి ఉరి శిక్ష పడగా ఒకరికి యావజ్జీవ ఖైదు పడింది.
 
2007లో ఆగస్టు 25న గోకుల్‌చాట్, లుంబినీ పార్క్‌లో జరిగిన పేలుళ్లు జరగ్గా 11 ఏళ్ళ తర్వాత తీర్పు వెలువడింది. గోకుల్ చాఠ్ దగ్గర జరిగే పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా లుంబినీ పార్క్ లో జరిగిన బ్లాస్ట్ లో 32 మంది చనిపోయారు. రెండు ఘటనల్లో 68 మంది గాయపడ్డారు. మొత్తం 8 మంది నిందితుల్లో ముగ్గురిని మాత్రమే దోషులుగా తేల్చిన కోర్టు మరో ఇద్దరు నిందితులు ఫరూఖ్‌ షఫ్రుద్దీన్‌ టార్కస్‌, మహ్మద్‌ సాదిక్‌ ఇస్రార్‌ అహ్మద్‌ షేక్‌‌ను నిర్దోషులుగా ప్రకటించింది. పేలుళ్ళ కుట్రలో కీలక సూత్రధారులై న రియాజ్‌ భత్కల్‌, ఇక్బాల్‌ భత్కల్‌, అమీర్‌ రజా ఖాన్‌ పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు.

మరోవైపు జంట పేలుళ్ళ కేసులో ఇద్దరికి ఉరిశిక్ష పడిన సంగతేమోకానీ తమ బాధలు ఎవరు తీరుస్తారని పేలుళ్ళలో గాయపడి మంచానికే పరిమితమైన సదా శివరెడ్డి తల్లి వసంత కన్నీరుమున్నీరయ్యారు. ఏ ప్రభుత్వమూ పేలుళ్ళ బాధితులను ఆదుకోలేదన్న ఆమె త్వరలో గవర్నర్ ని కలిసి సమస్యలు విన్న విస్తామని చెప్పారు. అప్పటికీ న్యాయం జరగకపోతే నిరాహారదీక్ష చేస్తానని తెలిపారు. దోషులకు పడిన ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్పి ఉంటుందని న్యాయవాదులు అంటున్నారు. దోషులు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని కాబట్టి శిక్ష అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెప్పారు. 

English Title
Hyderabad twin bomb blast case: Two convicts awarded death sentence

MORE FROM AUTHOR

RELATED ARTICLES