ప్రధాని మోడీ కనుసన్నల్లోనే అంతా జరుగుతోంది : టీడీపీ

Submitted by arun on Fri, 09/07/2018 - 09:29
babu

తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఏంటి..? అసెంబ్లీ రద్దు మ్యాచ్ ఫిక్సింగ్ అని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారా..? ప్రధాని మోడీ కనుసన్నల్లోనే అంతా జరుగుతోందని భావిస్తున్నారా..? తెలంగాణలో పొత్తులపై టీడీపీ ఏమనుకుంటోంది..? 
 
తెలంగాణ అసెంబ్లీ రద్దు ప్రకటన వెలువడిన కొద్దిసేపటికి టీడీపీ అధినేత చంద్రబాబు మంత్రులు, ముఖ్య నేతలతో అమరావతిలో భేటీ అయ్యారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డితోపాటు పలువురు తెలుగుదేశం నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. కారణాలు చెప్పకుండా అసెంబ్లీని రద్దు చేయడం సరికాదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అసెంబ్లీ రద్దు.., ఆ వెంటనే గవర్నర్ ఆమోదం..ఆపధర్మ సీఎంగా కేసీఆర్‌ను ప్రకటించడం చూస్తే..ప్రధాని మోడీ కనుసన్నల్లోనే అంతా జరుగుతున్నట్లుగా ఉందని టీడీపీ నాయకులు అన్నారు. పైగా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు ఎన్నికల సంఘం ప్రకటన ఉంటుందనే అంశాలపై కేసీఆర్ ప్రకటన చూస్తే ఆయనకు బీజేపీ హైకమాండ్ మద్దతు ఉందనే విషయం స్పష్టమవుతోందని సమావేశం అభిప్రాయపడింది. 

కేసీఆర్-మోడీ స్నేహాన్ని ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబుతో జరిగిన సమావేశంలో కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. జోనల్ వ్యవస్ధకు ఆమోదం, రద్దు తదనంతర పరిణామాలు గమనిస్తే ప్రీ-ఫిక్స్డ్ ప్రోగ్రాంగానే ఉందని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు కేసీఆర్‌ అభ్యర్ధులను ప్రకటించకపోవడాన్ని ఓ రాయలసీమ నేత ప్రస్తావించినట్లు సమాచారం. ఇక తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న అంశంపైనా టీడీపీ నేతలు చర్చించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవాలని నిర్ణయించారు. టీటీడీపీ నేతల అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. 

చంద్రబాబుతో సమావేశం తర్వాత టీటీడీపీ నేత పెద్దిరెడ్డి తమకు కొన్ని పార్టీల నుంచి పొత్తు ప్రతిపాదనలు వచ్చాయని అంగీకరించారు. కోదండరామ్, లెఫ్ట్‌ పార్టీల నుంచి ఐక్య కూటమితో వెళ్దామనే ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు హైదరాబాద్ వస్తున్నారు. తెలంగాణలో తాజా పరిణామాణాలపై టీడీపీ సీనియర్ నేతలతో ఆయన చర్చిస్తారు. అయితే చంద్రబాబుతో చర్చించిన తర్వాతే తెలంగాణలో పొత్తులపై స్పష్టత వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

English Title
TDP chief Chandrababu Naidu to meet Telangana party leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES