ఇవాల్టి నుంచి టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార భేరి...హుస్నాబాద్ నుంచి ప్రచార నగారా మోగిస్తున్న కేసీఆర్

Submitted by arun on Fri, 09/07/2018 - 09:15

తెలంగాణలో ఎన్నికల ప్రచార నగారా షురూ అవుతోంది. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికల శంఖారావం పూరించిన గులాబీ బాస్ కేసీఆర్..ఇవాళ ప్రచార భేరి మోగించబోతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ వేదికగా తొలి ఎన్నికల బహిరంగ నిర్వహిస్తారు. కేసీఆర్ సెంటిమెంట్‌ ప్రకారమే హుస్నాబాద్‌లో సభ పెట్టారు. 

ఇవాళ మధ్యాహ్నం హుస్నాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాదం పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణలో వంద నియోజకవర్గాల్లో ప్రజల ఆశీర్వాద సభలు నిర్వహించే క్రమంలో భాగంగా ముందుగా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రారంభ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. హుస్నాబాద్ సభ కోసం 70 వేల జనసమీకరణ చేసేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటల సమయంలో హెలీకాప్టర్ ద్వారా సభాప్రాంగణానికి చేరుకుంటారు. ప్రగతి నివేదన సభపై విపక్షాలు చేసిన విమర్శలకు హుస్నాబాద్ సభ నుంచి జవాబిస్తారు. అలాగే శాసన సభ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో వివరిస్తారు. తెలంగాణ ప్రగతి చక్రం ఆగకూడదనే ఉద్దేశంతోనే అసెంబ్లీ రద్దు నిర్ణయం తీసుకున్నామని సభా వేదికగా చెబుతారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజల కోసం పనిచేసిందని, అందుకే మళ్లీ ఆశీర్వదించి అధికారం అప్పగించాలని కోరతారు. కేసీఆర్ గత ఎన్నికలకు ముందు హుస్నాబాద్ నుంచే ఎన్నికల బహిరంగ సభను ప్రారంభించారని, ఈసారి కూడా అదే సెంటిమెంట్‌తో సభను నిర్వహిస్తున్నట్లు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 

హుస్నాబాద్ బహిరంగసభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఇద్దరు ఎస్పీలు , ముగ్గురు ఏసీపీలు , 10 మంది డీఎస్‌పీలు, ఏసీపీలు , 30 మంది సీఐలు , 80, మంది ఎస్‌ఐల నేతృత్వంలో డాగ్‌స్కాడ్స్‌లు, బీడీ టీమ్‌లు, రోప్‌పార్టీలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్నాబాద్ సభ తర్వాత వరుసగా 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేలా టీఆర్ఎస్ ప్రణాళికలు రూపొందించింది. రోజుకు రెండు నియోజకవర్గాల్లో కేసీఆర్ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 
 

English Title
Huge Arrangements Praja Ashirwada Sabha

MORE FROM AUTHOR

RELATED ARTICLES