మాటలతో 500 మంది అమ్మాయిలకు వల...వంశీకృష్ణ వలలో మంత్రులు, ఎంపీల పిల్లలు

Submitted by arun on Wed, 09/05/2018 - 11:47
Man Cheats

మాటలతో మాయచేయడంతో అతనిని మించినోడు లేడు. చాటింగ్ పేరుతో ఇతగాడి చేసిన చీటింగులు అన్నీ, ఇన్నీ కాదు.  ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో హాయ్‌ అంటాడు. అమ్మాయిల కోసం  ఓ అందమైన యువకుడి ఫొటోను తన ప్రొఫైల్ పిక్ గా ఉంచుతాడు. ప్రముఖుల పిల్లలను టార్గెట్ చేసుకుంటాడు. కల్లబొల్లి మాటలు చెప్పి పరిచయం పెంచుకుంటాడు. అనంతరం ఉద్యోగాలిప్పిస్తానని..ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకుంటున్నానని నమ్మబలుకుతాడు. మాటలతో మభ్యపెట్టి, తన అకౌంట్ లో డబ్బులు వేయించుకోవడంతో మొదలుపెట్టి.. బంగారంతో సహా విలువైన వస్తువులన్నీ ఊడ్చేస్తాడు. 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కంబాలచెరువుకు చెందిన జోగాడ వంశీకృష్ణ ఓ సంపన్న కుటుంబంలో పుట్టినా ఆర్థిక సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. బీటెక్ ను మధ్యలోనే ఆపేసి 2014లో హైదరాబాద్‌ వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేశాడు. వ్యసనాలకు బానిసై ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. ఉద్యోగం మానేసి ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లే వేదికగా హైదరాబాద్‌లో ప్రైవేటు సంస్థల్లో పనిచేసే యువతులకు గాలం వేశాడు. యానాం ప్రాంతానికి చెందిన ఓ యువకుడి ఫోటోను తన ప్రొఫైల్‌ పిక్ గా వాడుకున్నాడు. ఎదో కొద్దిమందిని తప్ప నేరుగా ఎప్పుడూ కలిసేవాడు కాదు. వీడియోకాల్‌ చేయమన్నా చేసేవాడు కాదు అయినా ఇతని మాటల వలలో ఐదు వందల మంది వరకూ అమ్మాయిలు, మహిళలు పడిపోయారు.

ఈ కేటుగాడి వలలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ మనవరాలు, పలువురి నేతల కుమార్తెలు, ఏపీకి చెందిన పలువురు ఎంపీలు, మంత్రుల కుమార్తెలు, మేనకోడళ్లు, వైద్య విద్యార్థినులు, పలువురి సినీప్రముఖుల పిల్లలు చిక్కారు. కేవలం రెండేళ్ల వ్యవధిలో కోటిన్నర సొత్తుని కాజేశాడు. ఈ డబ్బును గుర్రపు రేసులు, క్రికెట్‌ బెట్టింగుల్లో పెట్టాడు. కాకినాడకు చెందిన ఓ ప్రముఖ వైద్యుడు, అతడి భార్యని తన తల్లిదండ్రులుగా చెప్పేవాడు. వంశీకృష్ణపై హైదరాబాద్‌ గచ్చిబౌలి సైబర్‌ పోలీస్‌స్టేషన్‌లో, ఖమ్మం, నిజామాబాద్‌, భీమవరం ఇలా మొత్తం 15కి పైగా కేసులున్నాయి.

ఒకసారి జైలుకెళ్లొచ్చినా. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థినికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె దగ్గర నుంచి 70వేల డబ్బును, ఐదున్నర కాసుల బంగారాన్ని తీసుకొని ఉడాయించాడు. మార్చిలో ఆమె కాకినాడ టూటౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 2017లో అరెస్టయి జైలుకి వెళ్లినా.. వంశీకృష్ణ తీరులో ఎటువంటి మార్పు రాలేదు. పోలీసులు ఈ కంత్రీ కృష్ణ కోసం హైదరాబాద్‌లో సుమారు 20 రోజులపాటు తిరిగి చివరికి అతన్ని పట్టుకున్నారు. 

Tags
English Title
Man Cheats 500 Women In The Name Of Job and Marriage Proposals

MORE FROM AUTHOR

RELATED ARTICLES