సెన్సేషనల్ కామెంట్లతో వేడి పెంచిన జగన్

Submitted by arun on Tue, 08/07/2018 - 14:24

వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా  ఎక్కువ రోజులు గోదావరి జిల్లాలోనే పాదయాత్ర సాగించిన జగన్ సంచలన వ్యాఖ్యలు చేసి ఏపీ పాలిటిక్స్ లో ఒక్కసారిగా హీట్ పెంచేశారు. నెరవేర్చగలిగిన వాగ్దానాలనే ఇస్తూ, తన విశ్వసనీయతను మరోసారి నిలబెట్టుకునే దిశగా వైసిపి అధినేత అడుగులు వేస్తున్నారా? పార్టీని అధికారంలోకి తెచ్చే జిల్లాలో జగన్ టూర్ వాడి, వేడిగా సాగింది. బుధవారం ముగియనున్న జగన్ తూర్పు గోదావరి పర్యటనపై ఓ రౌండ్ అప్..

ప్రజా సంకల్పయాత్ర 2019లో గెలుపే ధ్యేయంగా వైసిపి రచించిన పాదయాత్ర వ్యూహం దాదాపు ఆరునెలల పాటూ ఒక అధినేత ఇంత సుదీర్ఘ పాదయాత్రలో ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో ఇదే తొలిసారి. జగన్ సంకల్ప యాత్ర దారి పొడవునా వేలాది మంది అభిమానులను పోగు చేసుకుంది యువనేత వేగంగా నడుస్తూ దారిలో ఎదురు పడిన వారిని పరామర్శిస్తూ, పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరో రెండు రోజుల్లో జగన్ తూర్పు గోదావరి జిల్లా ప్రజాసంకల్ప యాత్ర ముగియనుంది ఆ తర్వాత యాత్ర ఉత్తరాంధ్రలోకి అడుగు పెడుతుంది. అయితే వైసిపి అధినేత యాత్ర మొత్తానికి తూర్పు గోదావరి జిల్లాలో యాత్రనే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్న పార్టీ ముందు ఈ జిల్లా ప్రజల మనసు గెలుచు కోగలగాలి ఇక్కడ గెలిస్తేనే రాష్ట్రంలో అధికారం దక్కుతుందన్న అభిప్రాయం ఉంది అందుకే తూర్పు గోదావరి జిల్లాకు అంత ప్రాధాన్యత అసలు జిల్లాలోకి జగన్ ఎంట్రీయే చాలా వైవిధ్యంగా, చాలా హృద్యంగా సాగింది. కొవ్వూరునుంచి రాజమండ్రి రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిపై వైసిపి సేనలు కదం తొక్కిన తీరు అత్యద్భుతంగా సాగింది.

గతంలో వైఎస్ ఈ జిల్లాలోకి అడుగు పెట్టినప్పుడు అంత హడావుడి కనపడింది. ఇప్పుడు జగన్ కు అంతకన్నా ఎక్కువగా ఆదరణ లభించింది. ప్రజా సమస్యలపై స్పందిస్తూ అడుగులేస్తున్న జగన్ దారి పొడవునా అభిమానులతో కరచాలనం చేస్తూ, సెల్ఫీలు దిగుతూ మహిళలు, యువత, పిల్లలు, వృద్ధులను పలకరిస్తూ అడుగులేస్తున్నారు. ఈ జిల్లాలోనే జగన్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. కాపు రిజర్వేషన్లపైనా, పవన్ కల్యాణ్ పైనా జగన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పవన్ కల్యాణ్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న జిల్లాలో పవర్ స్టార్ పై జగన్ ఒక్క సారిగా ఫైరయ్యారు. ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ పవన్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. పవన్ పెళ్లిళ్లపైనా, ఆయన రాజకీయ వ్యవహార శైలిపైనా ఎద్దేవా చేశారు. జగన్ చేసిన ఈ కామెంట్లు రచ్చగా మారాయి. పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తిరగబడటంతో సోషల్ మీడియాలో వీరి అభిమానుల మధ్య యుద్ధమే రేగింది. ఈ కామెంట్లపై పవన్ సంయమనంతో స్పందించారు. అభిమానులెవరూ స్పందించొద్దంటూ సూచించారు. ఈ గొడవ సద్దుమణగక ముందే మరో రోజు జగన్ వివాదాస్పద కాపు రిజర్వేషన్ల అంశాన్ని కదిపారు కాపురిజర్వేషన్ల అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలోదనీ తాము చేయలేమనీ తేల్చేశారు. చేయలేని వాగ్దానాలివ్వడం తనవల్ల కాదని, చేయగలిగిన వాగ్దానాలనే ఇస్తాననీ అన్నారు..

దీనిపై కూడా ఇతర పార్టీలు, కాపులు తిరగబడ్డారు. దాంతో జగన్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాపుల మనోభావాలు దెబ్బ తీయడం తన ఉద్దేశం కాదని, వారి కోరిక న్యాయబద్ధమైనదేనని కానీ బీసీలను నొప్పించకుండా ఇవ్వగలగాలనీ వివరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యపడుతుందా అన్న సంకేతాలను పంపారు. తన కామెంట్ల ద్వారా  పరోక్షంగా ఈ వాగ్దానాలిస్తున్న పార్టీలు ప్రజలకు జవాబుదారీగా నిలబడాలన్న సవాల్ విసిరారు. వైసిపి అధినేత ప్రకటనపై ముందు కాపు సామాజిక వర్గం సెగలు కక్కినా ఆ తర్వాత నిజాయితీతో కూడిన ప్రకటన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జగన్ ఒక వ్యూహంతోనే ఈ ప్రకటన చేశారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు జగన్ బిజెపి తొత్తని అందుకే రిజర్వేషన్లు అసాధ్యమని తేల్చారనీ టిడిపి నేతలు విమర్శించారు. తన నిజాయితీని మరోసారి ప్రజలకు వివరించడం ఒక ఎత్తయితే లేని పోని హామీలతో మభ్యపెడుతున్న ఇతర పార్టీలను ప్రజల ముందు జవాబుదారీగా నిలబెట్టేలా ఒత్తిడిపెంచడం ఈ వ్యూహంలో భాగమన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఏదేమైనా బుధవారం జగన్ యాత్ర తూర్పు గోదావరిలో ముగుస్తుంది. ఆ మరుసటి రోజే ఆయన ఉత్తరాంధ్రలో అడుగు పెట్టబోతున్నారు. ప్రతీ ప్రాంతం పట్ల ఒక స్పష్టమైన ఎజెండాతో, అవగాహనతో పాదయాత్ర చేస్తున్న జగన్ ఉత్తరాంధ్ర టూర్ లో మరెన్ని సంచలనాలు చేస్తారో చూడాలి.

English Title
Round Up on YS Jagan Padayatra in East Godavari

MORE FROM AUTHOR

RELATED ARTICLES