ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు వరాలు

Submitted by arun on Sat, 06/30/2018 - 10:55

ఆశా వర్కర్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు వరాల వర్షం కురిపించారు. కనీస వేతనం 3 వేల రూపాయలుగా నిర్ణయించడంతో పాటుగా పనితీరును బట్టి 8 వేల రూపాయల వరకూ వేతనం పొందే వీలు కల్పించారు. స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు. సీఎం ప్రకటించిన వరాలపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎన్నో ఏళ్ళుగా అరకొర వేతనాలతో జీవనం గడుపుతున్న ఆశా వర్కర్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కరుణించారు. ఆశాలకు బాసట పేరిట ఆయన ఆశావర్కర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆశావర్కర్లకు వరాలు ప్రకటించారు. నెలకు 3 వేల రూపాయల కనీస వేతనాన్ని స్థిరీకరిస్తున్నట్లు ప్రకటించారు. పని తీరును బట్టి 6 వేల రూపాయల నుంచి  8 వేల రూపాయల దాకా పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. వేతనాలు పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా 156 కోట్ల రూపాయల మేరకు భారం పడుతున్నా, భరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మొత్తం 312 కోట్ల రూపాయలు ఆశా వర్కర్క కోసం వెచ్చిస్తున్నట్లు తెలిపారు.  సీఎం చంద్రబాబు నాయుడు కురిపించిన వరాలపై ఆశావర్కర్లు హర్షం వ్యక్తం చేశారు. తమ కష్టాలు తొలగిపోగలవన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2006 నుంచి వెయ్యి రూపాయల కంటే తక్కువ వేతనాన్నే పొందామని, తమ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ తీసుకోవడం హర్షణీయమని అన్నారు. 

వేతనాల రూపంలోనే గాకుండా మరెన్నో రకాలుగా కూడా సీఎం చంద్రబాబు ఆశా వర్కర్లకు వరాలు కురిపించారు. ఏఎన్ ఎం పోస్టల భర్తీలో ఆశా వర్కర్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు ఇస్తామని తెలిపారు. ప్రజల్లో పౌష్టికాహారం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు నిత్యం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలని సూచించారు. గతంలో తమకు 500 రూపాయల నుంచి 1000 రూపాయల లోపుగానే వేతనాలు వచ్చేవని, ఇప్పుడు మాత్రం సీఎం హామీ తమకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని ఆశా వర్కర్లు అన్నారు. తమ కష్టాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించిందని హర్షం వ్యక్తం చేశారు. తమకు తగిన ప్రతిఫలం ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

ప్రతీ నెలా ఐదో తేదీ లోపుగా వేతనాలు అందుతాయని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నెలల తరబడి వేతనాలు రాని దుస్థితిని వారు గుర్తు చేశారు. ఇకపై వేతనాలు సకాలంలో రాగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అరవై ఏళ్ళ వారికి రిటైర్ మెంట్ ఇస్తూ పింఛను సదుపాయం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. 

English Title
Asha workers to get fixed salary of Rs 3000: Chandra Babu Naidu

MORE FROM AUTHOR

RELATED ARTICLES