మరిది వరసయ్యే వ్యక్తితో బైక్‌పై భార్యను చూసి....

Submitted by arun on Fri, 06/08/2018 - 11:56
lorry

వేరొకరి బైక్‌పై తన భార్య కనిపించడాన్ని జీర్ణించుకోలేకపోయిన భర్త.. తాను డ్రైవ్ చేస్తున్న లారీతోనే ఆమెను ఢీకొట్టి చంపేశాడు. విజయనగరం జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని గరివిడి మండలం కాపుశంభాం గ్రామానికి చెందిన రమణమ్మ-తవిటయ్య భార్యాభర్తలు. తవిటయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పదిహేను రోజులకోసారి ఇంటి వస్తూ వెళ్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా, కుమార్తె ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గురువారం ఉదయం తవిటయ్య తెలంగాణ రాష్ట్రం ఇస్లామాబాద్‌ నుంచి లారీలో వస్తూ భార్యకు ఫోన్‌ చేశాడు. ఖర్చుకు డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు. అవసరమని ఆమె చెప్పడంతో తాను హైవే మీదుగా ఒడిశా రాష్ట్రం గుణుపూరు వెళ్తున్నానని, శ్రీకాకుళం జిల్లా సుభద్రాపురం జంక్షన్‌కు వస్తే డబ్బులు ఇచ్చేసి వెళ్తానని చెప్పాడు. అందుకు అంగీకరించిన ఆమె కొద్దిసేపటి తర్వాత తనకు మరిది వరసైన రేగాన రామకృష్ణతో ద్విచక్ర వాహనంపై బయలుదేరింది. ఆ తర్వాత భర్త మరోసారి ఇంటికి ఫోన్‌ చేశాడు. అప్పుడు కుమార్తె ఫోన్‌ లిఫ్ట్‌చేసి అమ్మ ఇప్పటికే బయలుదేరిందని బదులిచ్చింది.
 
సుభద్రాపురం జంక్షన్‌లో భార్య కనిపించకపోవడంతో తవిటయ్య లారీని స్వగ్రామం వైపు వెళ్లేందుకు తిప్పాడు. చీపురుపల్లి సమీపానికి వచ్చేసరికి రామకృష్ణతో రమణమ్మ బైక్‌పై వస్తుండడం చూశాడు. అప్పటికే అనుమానంతో ఉన్న ఆయన వారిద్దరినీ చూసి తట్టుకోలేకపోయాడు. లారీని సరాసరి వారి మీదకు తీసుకెళ్లాడు. ఈ  ఘటనలో రమణమ్మ అక్కడికక్కడే చనిపోగా రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రామకృష్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

English Title
husband kills wife suspecting infedility

MORE FROM AUTHOR

RELATED ARTICLES