‘సావిత్రి పెళ్లి చేసుకుని తప్పుచేశారు’

Submitted by arun on Thu, 05/24/2018 - 17:33
Rajesh

దిగ్గజ నటి సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ ఇటు తెలుగులో, ‘నడిగయర్‌ తిలకం’ పేరుతో అటు తమిళ్‌లో సూపర్‌ హిట్‌ టాక్‌తో ప్రదర్శితమౌతోంది. అయితే సావిత్రి ఎదుగుదల.. పతనాన్ని కూలంకశంగా చూపించిన ఈ చిత్రంపై పలువురు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. తన తండ్రిని చిత్రంలో తప్పుడుగా చూపించారంటూ కమల సెల్వరాజ్‌(జెమినీ మొదటి భార్య అలమేలు కుమార్తె) మహానటిపై పెదవి విరిచారు. ఇప్పుడు ఈ చిత్రంపై జెమినీ గణేషన్‌ సన్నిహితుడు, సీనియర్‌ నటుడు రాజేష్‌ కూడా స్పందించారు. జెమిని గణేశన్‌ను సావిత్రి పెళ్లి చేసుకోవడం ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయమని అంటున్నారు గణేశన్‌ సన్నిహితుడు రాజేశ్‌. సావిత్రి, జెమిని గణేశన్‌ గురించి రాజేశ్‌ ఓ వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘జెమిని గణేశన్‌కు పెళ్లైందని తెలిసి సావిత్రి ఆయన్ను ఇష్టపడ్డారు. వివాహం గురించి తెలిసినప్పుడు ఆయన్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. గణేశన్‌తో పెళ్లి అనేది జీవితంలో ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం. జెమినికి జీవితంలో ఉన్న నియమాలు వేరు. కాబట్టి ఆయన్ని పెళ్లిచేసుకుని సావిత్రి తప్పు చేశారు. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను నేనేమీ మాట్లాడదలచుకోలేదు. ఎంజీఆర్‌కు సావిత్రి అంటే ఇష్టమని ఆమెతో ఎవరన్నా అసభ్యంగా ప్రవర్తిస్తే ఆయన వారిని బెదిరించేవారని నాకు తెలిసింది. దాంతో ఎంజీఆర్‌పై అందరిలో చెడు అభిప్రాయం కలిగింది. కానీ, ఇదంతా తాను సావిత్రి కోసం చేస్తున్నట్లు ఎవ్వరితోనూ చెప్పలేదట. మరో విషయమేంటంటే.. సావిత్రికి ఎంజీఆర్‌తో కలిసి నటించడం ఇష్టం లేదు.’ ‘సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమిని గణేశనే అని సినిమాలో చూపించారు. నా ఉద్దేశం ప్రకారం..ఎవరైనా పేరున్న వారు నాకు డ్రింక్‌ ఇస్తే నేను తీసుకుంటాను. అదే విధంగా జెమిని సావిత్రికి ఒకసారి తాగమని చెప్పారు. కానీ, ఆమె దానికి అలవాటుపడిపోయారు. తాగుడు అలవాటు చేసుకోవడం సావిత్రి తప్పే’ అని చెప్పుకొచ్చారు రాజేశ్‌.

English Title
savitri wrong decisions spoils her life says gemini associate

MORE FROM AUTHOR

RELATED ARTICLES