కోమటిరెడ్డి, సంపత్‌ ఇష్యూలో కేసీఆర్‌‌ నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి?

Submitted by arun on Tue, 04/24/2018 - 14:17
TRS Vs Congress

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్ శాసన సభ్యత్వాల రద్దు చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్‌ ఏం చేయబోతున్నారు? శాసన సభ్యత్వాల పునరుద్ధరణకు చర్యలు చేపడతారా? లేక కోర్టు తీర్పును అధిగమించేందుకు ప్రయత్నిస్తారా? ఇంతకీ ఎమ్మెల్యేల బహిష్కరణ అంశాన్ని కేసీఆర్‌ ఎలా డీల్‌ చేయబోతున్నారు?

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్ శాసన సభ్యత్వాల రద్దు చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడంతో ఆత్మరక్షణలో పడ్డ కేసీఆర్‌ ప్రభుత్వం దాన్ని అధిగమించేందుకు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ముఖ్యంగా కోమటిరెడ్డి, సంపత్‌ శాసన సభ్యత్వాలను పునరుద్ధరించేందుకు సుముఖంగా లేని ప్రభుత్వం కోర్టు తీర్పును అమలుపర్చకుండా ఉండేందుకున్న అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. కోర్టు ధిక్కారం లేకుండా న్యాయపరంగా ప్రభుత్వం ముందున్న దారులను వెదుకుతోంది. ఇప్పటికే తన ఎమ్మెల్యేలతో హైకోర్టులో కౌంటర్‌ పిటిషన్‌ వేయించిన కేసీఆర్‌‌ దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు బహిష్కరణకు గురైన సందర్భాల్లో ఎలాంటి ప్రొసీజర్స్‌ ఫాలో అయ్యారన్న దానిపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. అయితే ప్రతి సందర్భంలోనూ కమిటీల ద్వారా వివరణ తీసుకున్న తర్వాతే వేటేసినట్లు రిపోర్ట్‌ రావడంతో కేసీఆర్‌ మరో ఆలోచన చేస్తున్నారు. 

చట్ట సభల గౌరవానికి భంగం కలిగించే రీతిలో వ్యవహరించినందుకే కోమటిరెడ్డి, సంపత్‌లపై సభ బహిష్కరణ వేటేసిందనే వాదనను బలంగా వినిపించేందుకు ఒక్కరోజు అసెంబ్లీని సమావేశపర్చాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. కోమటిరెడ్డి, సంపత్‌ చర్యలను మరోసారి ఖండించడమే కాకుండా మళ్లీ తీర్మానం చేయాలని భావిస్తున్నారు. అలాగే చట్ట సభల నిర్ణయాల్లో కోర్టుల జోక్యం తగదని, అందుకు సంబంధించిన శాసనసభ నిబంధనలను గుర్తుచేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్‌, జుడీషరీ సమాంతరమైన వ్యవస‌్థలైనందున ఒక దాంట్లో మరొకటి జోక్యం చేసుకోరాదన్న రాజ్యాంగ నిబంధనల్ని మరోసారి లేవనెత్తి సభలో తీర్మానం చేయనున్నారు. ఈవిధంగా కోర్టు తీర్పును అమలు చేయకుండా దాటవేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను గవర్నర్‌ ఇంకా ప్రోరోగ్‌ చేయకపోవడంతో మే ఫస్ట్‌ వీక్‌లో సభను సమావేశపర్చేందుకు సిద్ధమవుతున్నారు.

English Title
TRS Vs Congress

MORE FROM AUTHOR

RELATED ARTICLES