ఆల్‌టైమ్ రికార్డు డీజిల్ ధర

Submitted by arun on Sat, 04/21/2018 - 12:43
petrol

దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోలియం ధరలు హైదరాబాదీలకు మంట పుట్టిస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర 80కి చేరుతుండటంపై నగరవాసులు నిప్పులు కురిపిస్తున్నారు. డీజిల్ ధర 55 నెలల్లోనే అత్యధిక స్థాయికి చేరింది. ఈ ధరలు మరింత పెరుగుతాయనే వార్తలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎక్సైజ్ పన్ను, వ్యాట్ తగ్గించాలన్న డిమాండ్ పెరుగుతోంది.

పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు ఆగ‌డం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో 55 నెలల గరిష్ట స్థాయికి పెరిగాయి. త్వరలోనే లీటర్ పెట్రోల్ ధర 80కి చేరనుంది. ముఖ్యంగా డీజిల్ ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి దూసుకెళ్లడంతో వినియోగదారుల చేతి చమురు వదులుతోంది. ఒక‌వైపు ప్రభుత్వ ప‌న్నులు త‌గ్గించ‌క‌పోవ‌డం, మ‌రో వైపు అంత‌ర్జాతీయ కార‌ణాల‌తో పైపైకే పోతున్నాయి. 

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. 2013 సెప్టెంబర్ తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. గ్లోబల్ సరఫరాలో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో 2014 చివరి నుంచి చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్ ప్రస్తుతం 73.78 డాలర్ల దగ్గర స్థిరంగా ఉంది. 

ఆదివారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 78.50 పలకనుంది. లీటర్ డీజిల్‌ను 71.04కి అమ్మనున్నారు. శుక్రవారం నాడు మరోసారి పెట్రోలు ధర 1 పైస, డీజిల్ ధర 4 పైసలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్‌ లీటరు 74.08, కోల్కతాలో 76.78, ముంబైలో 81.93, చెన్నైలో 76,85కి చేరింది. డీజిల్ ధరకూడా రికార్డు స్థాయిని తాకింది. ఢిల్లీలో 65.31, కోలకతాలో 68.01, ముంబైలో 69.54 , చెన్నైలో 68.90గా ఉంది.

ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఇంధన ధరలు మండిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చమురుపై అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తుండటమే దీనికి కారణం. తెలంగాణ సర్కార్ పెట్రోల్‌పై 35.2 శాతం, డీజిల్ పై 27 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ తగ్గించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ మాత్రమే వ్యాట్ తగ్గించాయి. మిగతా రాష్ట్రాలు కేంద్ర మాటను లక్ష్యపెట్టలేదు.

నడ్డి విరుస్తున్న పెట్రోల్, డీజిల్‌ ధరలపై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలన్న డిమాండ్లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. దక్షిణాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. ఈ ధరల్లో పన్నులే సగం వరకు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. పెట్రోల్, డీజిల్‌‌లను కూడ జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. 

English Title
Petrol, Diesel prices hike, State Govt. gets more income

MORE FROM AUTHOR

RELATED ARTICLES