ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం కేసులో హైకోర్టు సీరియస్

Submitted by arun on Tue, 04/03/2018 - 16:13
ks

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసన సభ్యత్వం రద్దుపై జరిగిన విచారణలో తెలంగాణ సర్కార్ కౌంటర్ దాఖలు చేయకపోవడాన్ని హై కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన కోర్టు విచారణను ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. శాసనసభలో క్రమశిక్షణ ఉల్లంఘించారనే కారణంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ శాసన సభ్యత్వం రద్దు చేసిన కేసు కొలిక్కి రావడం లేదు. ఈ ఘటనపై జరిగిన విచారణలో కౌంటర్ దాఖలు చేయాల్సిన తెలంగాణ ప్రభుత్వం మరోసారి పిటిషన్ దాఖలు చేయకపోవడంతో కేసు మళ్లీ వాయిదా పడింది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కేసులో ఒరిజినల్ వీడియో ఫుటేజీ మొత్తాన్ని సమర్పించాలని, దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని, అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. ఒరిజినల్ ఫుటేజీని ఇవ్వడానికి గడువు అడిగిన తెలంగాణ ప్రభుత్వం ఫుటేజీని ఇవ్వకపోవడంతోపాటు కౌంటర్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు. దీంతో హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం రోజు కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన  హైకోర్టు తదుపరి విచారణ ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో సోమవారం నుంచి వాదనలు వింటామన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయలేకపోతే ఈ కేసులో ఇక కౌంటర్ ఉండదని భావించాల్సి ఉంటుందని పేర్కొంది. 

English Title
High Court serious on Komatireddy Venkat Reddy & Sampath Kumar case

MORE FROM AUTHOR

RELATED ARTICLES