వివేక వాణి

Submitted by arun on Tue, 02/06/2018 - 12:58
Viveka Vani

సన్యాసులు భిక్షకు వెళ్లడం సంప్రదాయం. అలా నలుగురు శిష్యులతో కలకత్తాలో ఒక వీధిలో వివేకానందుడు భిక్షకు బయలుదేరాడు. మరీ పెద్ద చప్పుడు కాకుండా ఒక మోస్తరు ధ్వనితో గంట కొడుతూ -భవతి భిక్షామ్ దేహి - అని అడుగుతున్నారు. ఒక ఇంట్లో నుండి - చేయి ఖాళీ లేదు పొమ్మని సమాధానం వచ్చింది. ఒకామె సగం  పాడయిపోయిన అరటిపండు వేసింది. ఒకామె ఒంటికాలిమీద లేచి తిట్టింది . శాపనార్థాలు పెట్టింది. ఊగిపోయింది. ఒకరిద్దరు భిక్షాపాత్రల్లో బియ్యం పోశారు. 

పాడయిపోయిన అరటిపండు భాగాన్ని తొలిగించి - బాగున్నంతవరకు దారిలో కనపడిన ఆవుకు పెట్టి మఠం చేరుకున్నారు. వారివారి పనుల్లో మునిగిపోయారు. 

మధ్యాహ్నం భోజనానంతరం ఒక శిష్యుడు చాలా దిగాలుగా గుమ్మానికి ఆనుకుని కుమిలిపోతుండడాన్ని వివేకానందుడు గమనించాడు. నెమ్మదిగా అతడిదగ్గరికి వెళ్లి కారణం కోసం ఆరా తీశాడు. పొద్దున్న భిక్షకు వెళ్ళినప్పుడు ఆమె తిట్టిన తిట్లు, శాపనార్థాలు, ప్రదర్శించిన కోపం చాలా బాధపెడుతోంది . వికారంగా ఉంది. తట్టుకోలేకపోతున్నాను - అన్నాడు. 

వివేకానందుడు సమాధానం అతడిచేతే చెప్పించి ఓదార్చాడు.  


ప్రశ్న - సమాధానం 


ప్ర : మనకు భిక్షలో ఈ రోజు ఏమేమి వచ్చాయి ?


స : సగం పాడయిపోయిన అరటి పండు , కొద్దిగా బియ్యం .


ప్ర : మనం మఠానికి ఏమి తెచ్చుకున్నాం ?


స : కొంచెం అరటిపండు అవుకు పెట్టేసి , బియ్యాన్ని మాత్రం తెచ్చుకున్నాం .


ప్ర : మరి తెచ్చుకున్నవాటిలో తిట్లే లేనప్పుడు, అవి నీవి కావు . నీతో రాలేదు . మనం తీసుకున్నది అరటిపండు , బియ్యమే కానీ , తిట్లను  తీసుకోలేదు - ఇక్కడికి మోసుకురాలేదు . రానిదానికి - లేనిదానికి అకారణంగా బాధపడుతున్నావు . 


స : నిజమే స్వామీ !

మనమూ అంతే. తలుచుకుని తలుచుకుని ఆనందించాల్సిన , పొంగిపోవాల్సిన ఎన్నింటినో వదిలేసి ఎవెరెవరివో - ఎప్పటెప్పటివో - అన్నవారికే గుర్తుకూడా ఉండని తిట్లను , కోపాలను , అవమానాలను తలుచుకుని తలుచుకుని బాధపడుతూ ఉంటాం . 


ఏ వివేక వాణి వచ్చి చెప్పాలి - మనది అకారణ బాధ అని ?

English Title
Viveka Vani

MORE FROM AUTHOR

RELATED ARTICLES