Uttarakhand: కుంభమేళాలో కరోనా కలకలం

Uttarakhand: Hundreds test positive for Covid at Kumbh Mela
x

Uttarakhand: కుంభమేళాలో కరోనా కలకలం

Highlights

Uttarakhand: ఓ పక్క దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరో పక్క భక్తి పేరుతో లక్షల మంది ఒకే చోట గుమికూడుతున్నారు.

Uttarakhand: ఓ పక్క దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మరో పక్క భక్తి పేరుతో లక్షల మంది ఒకే చోట గుమికూడుతున్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. వారిని అరికట్టడంలో ప్రభుత్వమూ విఫలమైంది. ఇప్పటికే దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పుడు వీరు వైరస్‌ క్యారియర్లుగా మారితే పరిస్థితి ఏంటనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌ హరిద్వార్‌లోని కుంభమేళాకు నిత్యం లక్షల మంది భక్తులు, సాధువులు తరలివస్తున్నారు. 'షాహీ స్నాన్' సందర్భంగా పవిత్ర గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఘాట్ల వద్దకు పోటెత్తారు. వీరిలో చాలామందికి మాస్కులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నిబంధనలు పాటించకుండా లక్షలాది మంది ఒక్కచోటే గుమికూడుతున్న దృశ్యాలు ఈ మేళాలో దర్శనమిస్తున్నాయి. దీంతో కరోనా మార్గదర్శకాల అమలు కష్టసాధ్యంగా మారింది.

కుంభమేళాలో రెండు రోజుల్లో వెయ్యి మంది భక్తులు కరోనా బారిన పడ్డారు. సోమవారం 28 లక్షల మంది మేళాకు హాజరవగా 408 మందికి కరోనా సోకింది. ఇక మంగళవారం మరో 594 మందికి కొవిడ్‌ సోకింది. ఇంకోపక్క మేళాకు రోజూ లక్షల మంది భక్తులు తరలివస్తుండగా కొంత మందికి మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొంత మంది కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు.

భారత్‌లో కొవిడ్ ఉదృతి కొనసాగుతున్నప్పటికీ ఇక్కడి అధికారులు సరైన ఏర్పాట్లు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి. దేశంలో కరోనా కేసులు లక్షల్లో పెరుగుతున్నాయని, అలాంటప్పుడు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే కుంభమేళాలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులకు తెలియదా అనే ప్రశ్నలు వినబడుతున్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో ఫెయిల్ అయ్యిందంటూ మండిపడుతున్నారు భక్తులు.

హరిద్వార్ రైల్వేస్టేషన్‌కి, ఘాట్లకు మధ్య కనీసం థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయలేదని, మాస్కు లేకుండా వస్తున్న వారికి జరిమానా కూడా విధించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అలాగే కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ ఆ రిపోర్టు లేనివారిని కూడా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఆదివారం రాత్రి 11 గంటల నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18 వేల 169 మందికి మాత్రమే కరోనా టెస్టులు నిర్వహించారని తెలిపారు. ఇది ఇలా ఉంటే ఇప్పుడు కుంభమేళాకు వచ్చి, తిరిగి వెళ్లేవారు ఇంకెంత మందికి కరోనాను స్ప్రెడ్‌ చేస్తారో అనే భయాందోళనలు ప్రజల్లో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories