రేటింగ్స్‌ టాంపరింగ్‌ కేసులో రిపబ్లిక్‌ టీవీ సీఈవో అరెస్ట్!

రేటింగ్స్‌ టాంపరింగ్‌ కేసులో రిపబ్లిక్‌ టీవీ సీఈవో అరెస్ట్!
x
Highlights

న్యూస్‌ టెలివిజన్ల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. రేటింగ్స్‌ టాంపరింగ్‌ కేసులో రిపబ్లిక్‌ టీవీ సీఈవో అరెస్టయ్యారు. టాంపరింగ్‌ వ్యవహారం ప్రసాద మాధ్యమాల్లో తీవ్ర సంచలనానికి దారి తీసింది.

న్యూస్‌ టెలివిజన్ల వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. రేటింగ్స్‌ టాంపరింగ్‌ కేసులో రిపబ్లిక్‌ టీవీ సీఈవో అరెస్టయ్యారు. టాంపరింగ్‌ వ్యవహారం ప్రసాద మాధ్యమాల్లో తీవ్ర సంచలనానికి దారి తీసింది. రెవిన్యూ పెంచుకోవడానికి అడ్డ దారులు తొక్కుతున్నారని ముంబై పోలీసులు ముంబైకి చెందిన మూడు ఛానెళ్లపై కేసులు పెట్టారు.

ప్రపంచంలోని వార్తలన్నీ జనానికి చేరవేసే న్యూస్‌ టెలివిజన్‌ ఛానెళ్ళు కూడా వార్తలుగా మారుతున్నాయి. ఛానెళ్ళ మధ్య పెరిగిన పోటీ కారణంగా రెవిన్యూ పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారంటూ కొన్నేళ్ళుగా ప్రచారం సాగుతోంది. గతంలో కూడా అనేక సార్లు కొన్ని ఛానెళ్ళ రేటింగ్‌లను సంబంధిత సంస్థలు నిలిపివేశాయి. ఈ రేటింగ్‌ల ఆధారంగానే ప్రకటనల రేట్లు నిర్ధారిస్తారు. దీంతో రేటింగ్‌ను టాంపరింగ్‌ చేసి..రేటింగ్‌లు పెంచుకుంటున్నారన్న ప్రచారం కూడా ఉంది. రెండు నెలలుగా ముంబై కేంద్రంగా రేటింగ్‌ టాంపరింగ్‌ వ్యవహారం ముదిరి..ఇప్పటివరకు ముంబై పోలీసులు 13 మందిని అరెస్ట్‌ చేశారు.

ఇదే కేసులో రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ ఆర్నాబ్‌ గోస్వామిని అరెస్ట్‌ చేసి...తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. తాజాగా ఆదివారం ఉదయం రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ వికాస్‌ ఖాన్‌చందానీని ముంబయి పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రిపబ్లిక్‌ టీవీతో సహా మూడు ఛానెళ్ళు డబ్బులిచ్చి రేటింగ్‌ పాయింట్లు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని అక్టోబర్‌ మాసంలో ముంబై పోలీసులు ఆరోపించారు. అప్పుడే ఆర్నాబ్‌గోస్వామిని అరెస్ట్‌ చేశారు. నవంబర్‌ 24న దీనికి సంబంధించి తొలి ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. త్వరలోనే రెండో ఛార్జ్‌షీట్‌ వేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 140 మంది సాక్షులను విచారించడం ద్వారా మూడు ఛానెళ్ళ పాత్ర ఉన్నట్లు గుర్తించినట్లు ముంబై కమీషనర్‌ పరమ‌వీర్‌ సింగ్‌ వెల్లడించారు.

కేసు రిజిస్టర్‌ చేసినపుడే పోలీసుల ఆరోపణలను రిపబ్లిక్‌ టీవీ యాజమాన్యం ఖండించింది. సుశాంత్‌ రాజ్‌పుత్‌ కేసులు ప్రశ్నలు సంధించినందుకే తమ ఛానెల్‌ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆర్నాబ్‌ గోస్వామి విమర్శించారు. ఛానెల్స్‌ రేటింగ్‌లు వెల్లడించే బార్క్‌ సంస్థ ఒక్కసారి కూడా తమ ఛానెల్‌ పేరు ప్రస్తావించలేదని...పోలీసుల ఛార్జ్‌షీట్‌లో కూడా తమ పేరు లేదని తెలియచేశారు. సీఈవో అరెస్ట్‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. ఖాన్‌ చందానీని అరెస్ట్‌ చేసే అవకాశం ఉందని తెలియడంతో..ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ విచారణకు వస్తుందనే ఒక్క రోజు ముందుగా అరెస్ట్ చేశారని గోస్వామి తెలిపారు.

రిపబ్లిక్‌ టీవీ సీఈవో ఖాన్‌ చందానీ అరెస్ట్‌ను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ముంబై పోలీసులను అరెస్ట్‌పై నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రేటింగ్‌ ట్యాంపరింగ్‌ వ్యవహారంలో రిపబ్లిక్‌ టీవీ పాత్ర లేదంటూ బార్క్‌ తమకు పంపిన లేఖను..బహిరంగంగా ఎందుకు ప్రకటించదని ఆర్నాబ్‌ గోస్వామి ప్రశ్నించారు. తమ తప్పేమీ లేదని ప్రయివేటు మెయిల్స్‌ పంపిన బార్క్‌ ఇదే విషయాన్ని పబ్లిక్‌గా ప్రకటించాలని ట్విటర్‌ ద్వారా గోస్వామి డిమాండ్‌ చేశారు.

రేటింగ్స్‌ విషయంలో ఛానెళ్ళ మధ్య యుద్ధం ఈనాటిది కాదు. టెలివిజన్‌ ఛానెళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆధిపత్య పోరు కూడా పెరుగుతోంది. దీంతో రెవిన్యూ పెంచుకోవడానికి కొన్ని ఛానెళ్ళు అడ్డదారులు తొక్కుతున్నాయి. రేటింగ్‌లో ముందున్నామని చెప్పుకోవడానికే ఇటువంటి తప్పుడు మార్గాల్లోకి వెళుతున్నాయి. నాలుగేళ్ళ క్రితం ఇదే అంశంపై రెండు తెలుగు ఛానెళ్ళ రేటింగ్‌ను బార్క్‌ కొద్దికాలం పాటు నిలిపివేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories