Republic Day: ఢిల్లీలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు

Republic Day Celebrations in Delhi
x

Republic Day: ఢిల్లీలో అంబరాన్నంటిన గణతంత్ర వేడుకలు 

Highlights

Republic Day: జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి

Republic Day: త్రివర్ణం రెపరెపలాడింది. దేశభక్తి ఉప్పొంగింది. సమైక్యతా భావం వెల్లువిరిసింది. దేశవ్యాప్తంగా జెండా వందనం కన్నుల విందుగా సాగింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు త్రివర్ణశోభితం అయింది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్యపథ్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల పరేడ్‌, శకటాల ప్రదర్శన, సాంస్కృతి కార్యక్రమాలు, సైనిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

నారీశక్తి పేరుతో త్రివిధ దళాలు చేపట్టిన కవాతు చూపుతిప్పుకోకుండా చేశాయి. ఈసారి గణతంత్ర వేడుకలకు.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌ ముఖ్య అతిథిగా పాల్గొనడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. జనం కూడా భారీగా తరలివచ్చారు.

ప్రధాని మోదీ ఉదయం జాతీయ వార్‌ మెమోరియల్‌ను సందర్శించడంతో వేడుకలు మొదలయ్యాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌..రాష్ట్రపతి భవన్‌ను నుంచి సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు. బగ్గీలో కర్తవ్యపథ్‌ కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముతో పాటు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు ఘన స్వాగతం పలికారు ప్రధాని మోదీ. అనంతరం రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి.. గౌరవ వందనం చేశారు.

ఫ్లాగ్ హోస్టింగ్ అనంతరం త్రివిధ దళాల నుంచి రాష్ట్రపతి ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు గౌవర వందనాన్ని స్వీకరించారు. సైనిక, వాయు, నేవి దళాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా ఈసారి పరేడ్‌ను నిర్వహించారు. చరిత్రలో తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన నారీమణులు.. మన సైనిక అమేయ శక్తిని చాటిచెప్పారు. 260 మంది సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ మహిళా సైనికులు ‘నారీ శక్తి’ పేరుతో విన్యాసాలు చేశారు.

చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. ఇందులో అగ్నివీర్‌లు కూడా ఉన్నారు. ఆత్మనిర్భరత, నారీశక్తి థీమ్‌తో నౌకాదళ శకటం ఆకట్టుకుంది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌తో పాటు, శివాళిక్‌, కలవరి క్లాస్‌ సబ్‌మెరైన్లను ప్రదర్శించారు. ఈసారి పరేడ్‌లో 90 మంది సభ్యుల ఫ్రాన్స్‌ దళం కూడా పాల్గొంది. ఫ్రెంచ్‌ దళం ప్రదర్శన సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు గగనతలంలో విన్యాసాలు చేశాయి.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ఆకట్టుకున్నాయి. వివిధ థీమ్‌లతో మొత్తం 16శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితోపాటు సామాజిక-ఆర్థిక కార్యకలాపాలు, శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలు ప్రదర్శించిన 10 శకటాలు ఆకట్టుకున్నాయి.

పరేడ్‌లో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమాలు అలరించాయి. 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సంప్రదాయ బ్యాండ్‌కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారాతో ప్రదర్శన చేశారు.

నాలుగు ఎంఐ-17వి హెలికాప్టర్లు ధ్వజ్‌ ఆకృతిలో విన్యాసాలు ప్రదర్శించాయి.ఎయిర్‌ఫోర్స్‌ మార్చ్‌కు స్క్వాడ్రన్‌ లీడర్లు రష్మీ ఠాకుర్‌, సుమితా యాదవ్‌, ప్రతిథి అహ్లువాలియా, ఫ్లైట్ లెఫ్టినెంట్‌ కిరిట్‌ రొహైల్‌ నేతృత్వం వహించారు. వేడుకల అనంతరం ప్రధాని మోడీ అక్కడికి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories