Bharat Jodo Nyay Yatra: నేడు ముంబైలో భారత్ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సభ

Rahul Gandhi Bharat Jodo Nyay Yatra Ends In Mumbai
x

Bharat Jodo Nyay Yatra: నేడు ముంబైలో భారత్ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సభ

Highlights

Bharat Jodo Nyay Yatra: హాజరుకానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపయి సోరెన్

Bharat Jodo Nyay Yatra: సార్వత్రిక ఎన్నికల సమరానికి విపక్ష ఇండియా కూటమి సిద్ధమైంది. నేడు ముంబయిలో జరిగే రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖరావం పూరించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో విపక్ష ఇండియా కూటమి సమరానికి సిద్ధమైంది. దేశంలో అధికార మార్పే ప్రధాన ఎన్నికల నినాదంగా నేడు ముంబయిలో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఐక్యంగా పనిచేయాలని సంకల్పించింది.

విపక్ష కూటమి బలాన్ని చాటేందుకు రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు సభనే వేదికగా చేసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ భావించింది. ఇక కూటమి పార్టీలు కూడా కాంగ్రెస్​అభిప్రాయానికి జై కొట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు భారత్‌ జోడో న్యాయ్ యాత్ర ముంబయిలో ముగుస్తుండగా.. ముగింపు సభతో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు ప్రాంతీయ పార్టీల దిగ్గజ నేతలను ఆహ్వానించింది. 6,700 కిలోమీటర్లపాటు సాగిన రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముంబయిలో ముగియనున్న వేళ దానినే ఎన్నికల శంఖారావ సభకు వినియోగించుకోవాలని విపక్ష ఇండియా కూటమి నేతలు భావించారు.

ఇవాళ ముంబయిలో భారీ ఎన్నికల ప్రదర్శన నిర్వహించి తమ బలాన్ని చాటిచెప్పాలని ప్రతిపక్ష ఇండియా భావిస్తోంది. హాత్‌ బద్లేగా హాలత్‌ నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. హస్తం గుర్తు ఈ దేశంలో మార్పు తీసుకొస్తుందన్న నినాదంతో జన క్షేత్రంలోకి వెళ్లనుంది. ఇండియా కూటమిలో కీలక నేతలు శరద్ పవార్‌, ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, డీఎంకే నేత స్టాలిన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, దీపాంకర్, సీపీఐ నేత భట్టాచార్య, నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రముఖులు కాంగ్రెస్‌ పార్టీ ముంబయిలో నిర్వహిస్తున్న భారీ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఈ న్యాయ్ యాత్ర ముగింపు సభలో ప్రతిపక్షం తన బలాన్ని దేశానికి చాటి చెప్తుందని ఏఐసీసీ మహారాష్ట్ర ఇన్‌ఛార్జ్ సెక్రటరీ ఆశిష్ దువా వెల్లడించారు.

సామాజిక న్యాయమే ప్రధాన ఎన్నికల నినాదంగా కాంగ్రెస్ రాజకీయ రణక్షేత్రంలో దిగనుంది. రాహుల్‌గాంధీ తన యాత్ర ద్వారా వాగ్దానం చేసిన అన్ని హామీలను తమ పార్టీ నెరవేరుస్తుందని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రతిపక్ష పార్టీలన్నీ తాము ఐక్యంగా ఉన్నామని చాటి చెప్పేందుకు ఇవాళ జరగనున్న కాంగ్రెస్‌ సభను వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. ఈ సభ ద్వారా తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని అన్ని పార్టీలు ప్రజలకు చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాతో పాటు క్షేత్రస్థాయిలో ప్రచారంతో దేశంలో మార్పు ఎందుకు అవసరమో ప్రజలకు బలంగా చెప్పాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. యువత, మహిళలు, రైతులకు సామాజిక న్యాయం అందిచడం, ప్రజల ఆకాంక్షలను తీర్చడమే కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ కీలక నేతలు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories