పట్టణ ప్రాంతాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువ.. 350 జిల్లాల్లో జీరో కరోనా కేసులు..

పట్టణ ప్రాంతాల్లోనే కరోనా ప్రభావం ఎక్కువ.. 350 జిల్లాల్లో జీరో కరోనా కేసులు..
x
Highlights

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నప్పటికీ దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా...

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్నప్పటికీ దీని ప్రభావం గ్రామీణ ప్రాంతాల కంటే జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 734 జిల్లాలకు గాను ఇంతవరకు 350 జిల్లాల్లో మహమ్మారి జాడ కనిపించకపోవడం అధికారులకు ఊరట కలిగించే అంశం. 70కి పైగా జిల్లాల్లో కేవలం ఒకే ఒక్క కేసు నమోదైంది. 148 జిల్లాల పరిధిలో 10కి మించి పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అనేక పెద్ద నగరాల్లోనూ కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉంది. సిక్కిం, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలిలలో ఒక్క కేసూ నమోదు కాలేదు. కోల్‌కతా, బెంగళూరుల్లో మాత్రం కరోనా వ్యాప్తి పరిమితంగా ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో అత్యధిక కేసులు ఆగ్రా, ఢిల్లీకి ఆనుకొని ఉండే గౌతమ్‌బుద్ధనగర్‌, మేరఠ్‌ జిల్లాల్లోనే బయటపడ్డాయి. 75 జిల్లాలకు గాను 43 చోట్ల మాత్రమే మహమ్మారి ఆనవాళ్లు ఉన్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో సగం కేసులు రాష్ట్ర రాజధాని జైపుర్‌ పరిధిలోనే ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్‌, వడోదరల్లోనే 74% కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఇక్కడి కేసుల్లో 83% కేవలం ముంబయి, పుణె, ఠానే నగరాల్లోనే నమోదయ్యాయి.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఇండోర్‌, భోపాల్‌లు మాత్రమే హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయి. దేశంలో అత్యధిక వెనుకబడిన రాష్ట్రంగా పేరొందిన బిహార్‌లోని 38 జిల్లాలకు గాను 11 జిల్లాల్లోనే కరోనా వ్యాప్తి చెందింది. ఒక్క సివాన్‌ జిల్లాలో మాత్రమే అత్యధికంగా 29 కేసులు నమోదయ్యాయి. ఒడిశా రాష్ట్రంలో 30 జిల్లాలకు గాను 9 జిల్లాల్లోనే కరోనా ఉంది. అత్యధిక కేసులు ఖుర్దా జిల్లాలోనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన వాటికంటే కర్ణాటకలో కొంత పరిస్థితి మెరుగ్గా ఉంది. జన సాంద్రత ఎక్కువగా ఉన్న బెంగళూరు, మైసూరు, బెళగావి, కలబుర్గి, బీదర్‌, దక్షిణ కన్నడ జిల్లాల్లో మాత్రమే రెండంకెల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. మహమ్మారి 19 జిల్లాలకే పరిమితమైంది. దేశంలోని మిగతా మహా నగరాలతో పోలిస్తే బెంగళూరులో కరోనా వ్యాప్తి పరిమితంగానే ఉంది. ఇప్పటివరకూ ఇక్కడ రెండంకెల స్థాయిలోనే కేసులున్నాయి.

ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలకు 6 జిల్లాల్లోనే కేసులు నమోదయ్యాయి. ఇందులో సగం రాష్ట్ర రాజధాని అయిన దేహ్రాదూన్‌కే పరిమితం అయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో 28 జిల్లాలకు ఇప్పటివరకూ కేవలం 5 జిల్లాలకే మహమ్మారి పరిమితమైంది. కోర్బా జిల్లాలోనే అత్యధికంగా 74% కేసులు ఉన్నాయి. రాజధాని రాయ్‌పూర్‌లో 5 కేసులు నమోదయ్యాయి.ఝార్ఖండ్ లో కరోనా మహమ్మారి చాలా ఆలస్యంగా ప్రవేశించింది. 24 జిల్లాలకు ఇంతవరకు ఇది 5 జిల్లాల్లో మాత్రమే విస్తరించింది. రాజధాని రాంచీ, ఉక్కు నగరం బొకారోల్లోనే 83% కేసులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్ అత్యధిక జనసాంద్రత ఉన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఊరట కలిగించే అంశం ఏమిటంటే 8 జిల్లాలకే కరోనా వ్యాప్తి పరిమితం కావడం. ఇందులో కూడా నాలుగు జిల్లాల్లో కేవలం ఒకే కేసు ఉండగా, మూడు జిల్లాల్లో 3-5 కేసులు కనిపిస్తున్నాయి. దేశంలో అత్యధిక జనాభా ఉన్న నగరాల్లో ఒక్కటైన కోల్‌కతాలో ఇప్పటివరకూ కరోనా కేసులు కేవలం 11కే పరిమితం కావడం ఊరటే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories