Corona Virus: హడలెత్తిస్తోన్న JN.1 వేరియంట్.. దేశవ్యాప్తంగా 2,300 యాక్టివ్‌ కేసులు

New coronavirus variant JN.1 Spreading Fast In India
x

Corona Virus: హడలెత్తిస్తోన్న JN.1 వేరియంట్.. దేశవ్యాప్తంగా 2,300 యాక్టివ్‌ కేసులు

Highlights

Corona Virus: నిన్న ఒక్క‌రోజే 519 కేసులు న‌మోదు

Corona Virus: వామ్మో. కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇక వైరస్ పీడ పూర్తిగా విరగడ అయ్యింది అనుకుంటే కొత్తగా రూపాంతరం చెంది మళ్లీ పగడ విప్పింది. తాజాగా JN.1 వేరియంట్ హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్ ఉపకులానికి చెందిన ఈ మహమ్మారి ప్రాణాంతకంగా మారి ప్రాణాలను హరిస్తోంది. జనాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వైరస్.. చాపకింద నీరులా మొత్తం విస్తరిస్తోంది. JN.1 వేరియంట్ కేసులు మెల్లమెల్లగా దేశంలో పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 2,300 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయ‌న్నాని వైద్యాధికారులు తెలిపారు. నిన్న ఒక్క‌రోజే 519 కేసులు న‌మోదైన‌ట్లు పేర్కొన్నారు.

తొలుత కేరళలో కేసులు వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ వల్ల నలుగురు చనిపోయరు. దేశవ్యాప్తంగా ఆరుగురు మృతి చెందారు. ఇప్పుడు తెలంగాణను కూడా టచ్ చేసింది కరోనా మహమ్మారి. రాష్ట్రంలో ఇప్పటికే 9కేసులు నమోదు అయినట్టు తెలుస్తోంది. ఈ వేరియంట్‌లో జ్వరం, ముక్కు కారడం, గొంతునొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయి. కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నట్లు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ వేరియంట్ వల్ల మరణాలు కూడా సంభవిస్తుండడంతో ప్రజల్లో మళ్లీ ఒకనాటి భయాలు, ఆందోళనలు నెలకొంటున్నాయి.

కరోనా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్స్‌..ప్రపంచ వ్యాప్తంగా జనాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. లక్షల మందిని బలి తీసుకుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో మరణాల శాతం దక్కింది. జనాల్లో హార్డ్ ఇమ్యూనిటీ పెరగడంతో అంతగా ప్రభావం చూపలేదు. ఇక కరోనాతో సహజీవనం చెయక తప్పదని, ఇది కూడా సాధారణ ఫ్లూ లాగే వచ్చి పొతుందని వైద్య నిపుణులు చెప్పడంతో అంతా లైట్ తీసుకున్నారు. ప్రతి శీతాకాలంలో వైరల్ ఫీవర్స్ రావడం కామన్. ఈ సారి కూడా అలానే ఫ్లూ ప్రభావం అనుకున్నారు.

కానీ JN.1గా రూపాంతరం చెందిన ఈ కరోనా మాత్రం ప్రాణాంతకంగా మారింది. ఒకరి నుంచి ఒకరికి వైరస్ వేగంగా వ్యాప్తి చెందడంతో పాటు మరణాలు కూడా సంభవిస్తుండటంతో జనాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. JN.1 వేరియంట్ కేసులు తెలంగాణలోనూ నమోదు కావడంతో..ప్రజలు హడలిపోతున్నారు. ఈ కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగా ఉండబోతుందా..? ఎలాంటి విపత్కర పరిస్థితులు సృష్టించబోతోంది. ఫస్ట్ వేవ్, సెకండ్ లాగే తీవ్రంగా ప్రభావితం చేస్తుందా అని ప్రజలు కంగారు చెందుతున్నారు.

క‌రోనా స‌బ్ వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ మ‌న్సూఖ్ మాండ‌వీయ నేతృత్వంలో క‌రోనా ప్ర‌భావిత రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కరోనా టెస్టులను వేగవంతం చేయాలని, చికిత్స కోసం వైద్య సదుపాయాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. అన్ని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ప్ర‌తిరోజు మాక్ డ్రిల్స్ నిర్వ‌హించాలన్నారు.

ఇటు కరోనా కొత్త వేరియంట్‌ కేసులతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా చికిత్సలకు నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై.. కొవిడ్ కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. ప్రత్యేకంగా కరోనా వార్డ్‌లో బెడ్స్‌ను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఐసీయూ సహా అన్ని రకాల సౌకర్యాలతో కోవిడ్ కోసం ప్రత్యేక పడకలను సిద్ధం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా, ఆర్ టీపీసీఆర్ కిట్లు, అవసరమైన మందులు ఉండేలా చూస్తున్నామన్నారు. మాస్కులు ధరించటం సహా అన్ని రకాల కొవిడ్ నిబంధనలు పాటించాలని సిబ్బంది ఆదేశించినట్టు స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో వరంగల్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. కొత్త వేరియంట్​ జేఎన్​ 1 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. 50 పడకలతో కొవిడ్ వార్డును ఏర్పాటు చేశామని ఎంజీఎం ఆర్ఎంఓ మురళి స్పష్టం చేశారు. మొత్తం 50 పడకలలో 10 పడకలలో వెంటిలేటర్లను మరో 20 పడకలకు ఆక్సిజన్ ఏర్పాటు చేశామని వైద్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories