PM Modi: ప్రజాదరణలో విభిన్నం మోడీ..

Narendra Modi Most Popular Leader
x

PM Modi: ప్రజాదరణలో విభిన్నం మోడీ..

Highlights

PM Modi: ప్రపంచ నేతలందరిలోనూ మోడీపై ప్రత్యేక భావనలు

PM Modi: ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోడీ విభిన్నమైన వ్యక్తని అంతర్జాతీయ పత్రిక ‘ఎకనామిస్ట్‌’ అభిప్రాయపడింది. సాధారణంగా సామాన్య జనబాహుళ్యంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్యా, సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుందని, కానీ మోడీకి వారిలోనూ బహుళ ప్రజామోదం లభిస్తోందని ఆ పత్రిక పేర్కొంది. ‘వై ఇండియాస్‌ ఎలైట్స్‌ బ్యాక్‌ మోడీ’ అనే పేరుతో ఎకనామిస్ట్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ‘హుందాతనంతో కూడిన రాజకీయాలు అంటే క్లాస్‌ పొలిటిక్స్‌, ఎకనామిక్స్‌, ఉన్నత వర్గాల మెప్పు పొందడం వంటి 3 అంశాలు మోడీకి ఈ వర్గాల్లో ఆదరణ కలిగి ఉండటానికి సహకరిస్తున్నాయి. ఒక రకంగా దీనిని మోడీ విభిన్న శైలిగా పిలవొచ్చు. డొనాల్డ్‌ ట్రంప్‌లాంటి మాస్‌ నేతల గాటన కట్టినా మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోడీ అసాధారణ బలవంతుడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన మాస్‌ అప్పీల్‌ ఉన్న ఇలాంటి నేతలను ఉన్నతస్థాయి వర్గం వ్యతిరేకిస్తుంటుంది. అమెరికాలో ట్రంప్‌నకు, బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు’ అని ఆ పత్రిక అభిప్రాయపడింది.-

‘అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో 26శాతం మందే ట్రంప్‌నకు మద్దతు పలుకుతున్నారని గ్యాలప్‌ సర్వేలో వెల్లడైంది. అదే సామాన్య జనంలో ఆయనకు 50శాతం మద్దతు లభించింది. కానీ మోడీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ ఉంది. 2017లో ప్రాథమిక పాఠశాల దాటని వారిలో 66 శాతం మంది మద్దతు మోడీకి లభించింది. అదే సమయంలో ఎంతో కొంత ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో 80శాతం మంది మద్దతు ఆయనకు లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌నీతి జరిపిన సర్వేలో.. డిగ్రీ చదివిన వారిలో 42 శాతం మంది మోడీకి మద్దతుగా నిలిచారు. అదే ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో మద్దతు 35శాతంగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో ఆయనేమీ సామాన్యుల మద్దతును కోల్పోలేదు’ అని ఎకనామిస్ట్‌ వివరించింది.

‘ఆర్థిక వ్యవస్థే మోడీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం. సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలున్నప్పటికీ భారత్‌ ఘనమైన జీడీపీ వృద్ధి రేటు సాధించడం, భారత్‌లోని ఎగువ మధ్య తరగతి వారి సంఖ్య, ఆదాయాలు పెరగడమూ మోడీపై ఆదరణకు కారణాలే. 2000 సంవత్సరం సమయంలో ఎగువ మధ్య తరగతిలో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఆదరణ ఉండేది. ఆ తరువాత చోటుచేసుకున్న కుంభకోణాలతో 2010 వచ్చే సరికి కాంగ్రెస్‌కు వారి నుంచి మద్దతు కరవైంది. మోడీ హయాంలో భారత్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు అంతర్జాతీయంగా రాజనీతి ప్రదర్శించడంలో ఫలితాలు కనిపించాయి. దీంతోపాటు ఆసియాలో టైగర్లుగా పరిగణిస్తున్న చైనా, తూర్పు దేశాలకు గట్టిగా ఎదురు నిలిచి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే మోడీ లాంటి నేత కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం మోడీ రూపంలో అటువంటి స్ట్రాంగ్ లీడర్ వచ్చారని వారంతా భావిస్తున్నారు’ అని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories