మోడీ తదుపరి లక్ష్యం యూనిఫామ్ సివిల్ కోడ్.. మోడీ టార్గెట్‌ రీచ్‌ అవుతారా?

మోడీ తదుపరి లక్ష్యం యూనిఫామ్ సివిల్ కోడ్.. మోడీ టార్గెట్‌ రీచ్‌ అవుతారా?
x
Highlights

బీజేపీ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత జోష్ లో ఉంది. మోడీ రెండో దఫా అధికారం చేపట్టి 70 రోజులు కూడా కాకముందే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మోడీ ప్రభుత్వం...

బీజేపీ ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంత జోష్ లో ఉంది. మోడీ రెండో దఫా అధికారం చేపట్టి 70 రోజులు కూడా కాకముందే ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దశాబ్దాలుగా కొనసాగిన కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి చరిత్రలో కలసిపోయింది. అసంభవం అనుకున్న దాన్ని అతి తేలిగ్గా జరిగేలా చేసింది బీజేపీ. ఇక నవంబర్ 9న మరో కీలక సంఘటన జరిగింది. సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆలయ నిర్మాణానికి బాట వేసింది. బీజేపీ ఇచ్చిన మూడు ప్రధాన హామీల్లో రెండు నెరవేరాయి. ఇక మిగిలింది యూనిఫాం సివిల్ కోడ్. మోడీ తదుపరి లక్ష్యం ఇదే అనడంలో మాత్రం సందేహం లేదు.

బీజేపీ అనగానే గుర్తుకొచ్చేది ఒకే దేశం- ఒకే చట్టం. బీజేపీ ఆవిర్భావం నుంచి కూడా ఇదే మాట చెబుతూ వచ్చింది. భారతదేశం భిన్నమతాలకు, సంస్కృతులకు నిలయం. అలాంటి చోట ఒక్కో మతానికి ఒక్కో చట్టం అమలు చేయడం సాధ్యమయ్యే అంశం కాదు. భార్య ఒక మతం భర్త ఒక మతం పిల్లలు మరో మతంలో ఉంటున్న రోజులివి. అలాంటప్పుడు అన్ని మతాల వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చేలా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకువస్తామని బీజేపీ అంటోంది. ఇది పైకి చెప్పినంత సులభం మాత్రం కాదు. కాకపోతే అసాధ్యాలను సాధించే తత్వం బీజేపీ నేతలది. తాజాగా కేంద్రమంత్రుల ప్రకటనలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

దేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ఒకటే ఉంది. ఒక్కో మతానికి ఒక్కోలా పీనల్ కోడ్ లేదు. అంటే ఎవరైనా ఒక నేరం చేస్తే విచారణ జరిగే తీరు ఒకే విధంగా ఉంటుంది. పడే శిక్ష కూడా అందరికీ ఒకేలా ఉంటుంది. మతాన్ని బట్టి అది మారదు. ఇక సివిల్ లా కు వచ్చే సరికి మాత్రం పరిస్థితి మారిపోతుంది. పెళ్ళి, విడాకులు, దత్తత లాంటి అంశాలన్నీ దీని పరిధిలోకి వస్తాయి. మత సంబంధమైన, సాంస్కృతిక సంబంధమైన అంశాలు ఇందులో ఉంటాయి. ఒక్కో మతానికి చట్టాలు విభిన్నంగా ఉంటాయి. మతం అనగానే గుర్తుకొచ్చేది మహిళలపై వివక్ష. కారణాలు ఏవైనా దాదాపుగా ప్రతి మతంలోనూ మహిళలు సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరిట అణచివేతకు గురవుతున్నారు. మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించాల్సిందే. కాకపోతే ఇక్కడ కూడా ఎన్నో గమ్మత్తులు ముస్లిం మహిళలకు జరిగే అన్యాయాల పట్ల బీజేపీ గొంతెత్తుతుంటుంది. హిందూ మహిళలకు జరిగే అన్యాయాల పట్ల ముస్లిం నేతలు గొంతు విప్పుతుంటారు. ఈ విధమైన లింగ వివక్షను రూపుమాపేందుకు ఇక మిగిలిన ఏకైక మధ్యే మార్గం యూనిఫామ్ సివిల్ కోడ్. దీంతో అన్ని మతాల్లోనూ మహిళలకు జరిగే అన్యాయాలను అరికట్టవచ్చనే వారూ ఉన్నారు. అదే సమయంలో ఒక మతం నిబంధనలను ఇతర మతాల వారిపై రుద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే వారూ ఉన్నారు.

యూనిఫామ్ సివిల్ కోడ్ అనగానే అది ఇప్పుడు అవసరమా తేనె తుట్టెను కదపడమెందుకు అనే వారే ఎక్కువగా ఉంటారు. అది కూడా నిజమే. బ్రిటిష్ వారు వందల ఏళ్ళ క్రితం భారతీయులను విభజించి పాలించారు. అందులో భాగంగానే ఒక్కో మతానికి ఒక్కో రకం చట్టాలను అమలు చేశారు. 150 ఏళ్ళ క్రితం బ్రిటిష్ వారు అమలు చేసిన చట్టాలే నేటికీ అమల్లో ఉన్నాయి. ఈ 150 ఏళ్ళలో సమాజం ఎంతగానో మారిపోయింది. మతం, సామాజికం, ఆర్థికం కలగలసిపోయాయి. మతపరమైన చట్టాలు మతపరంగా మాత్రమే ఉండడం లేదు. అవి ఆయా వ్యక్తులపై సామాజిక ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. ఆర్థికంగా వారిని ప్రభావితం చేస్తున్నాయి. అనేక మతపరమైన సంప్రదాయాలు, చట్టాలు మహిళల పట్ట వివక్ష కనబరిచేలా ఉన్నాయి. మరో వైపున నేటి సమాజంలో మహిళలు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మత చట్టాలను సామాజిక, ఆర్థికపరమైన అంశాలతో కూడా మేళవించి చూడాల్సి వస్తోంది. అలా చూడాలంటే ముందుగా ప్రజలంతా చట్టం ముందు సమానమే అనే భావన రాజ్యాంగబద్ధంగా ఏర్పడాలి. అందుకు యూనిఫామ్ సివిల్ కోడ్ వీలు కల్పిస్తుంది అనడంలో సందేహం లేదు.

నిజానికి 70 ఏళ్ళ క్రితమే రాజ్యాంగ రూపకర్తలు దేశంలో ఈ తరహా పరిస్థితి వస్తుందని ఊహించారు. అందుకే రాజ్యాంగంలోని 44వ ఆర్టికల్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలనే అంశాన్ని స్పష్టంగా నిర్దేశించారు. సుప్రీం కోర్టు సైతం పలు సందర్భాల్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. అయినా లాభం లేకపోయింది. అందుకు అనేక కారణాలున్నాయి. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ ఇందులో దోషిగా నిలిచింది. కశ్మీర్ అంశంలో మాదిరిగానే యూనిఫాం సివిల్ కోడ్ విషయంలో కూడా నాటి ప్రధాని నెహ్రూ చేసిన తప్పిదాలే అందరికీ గుర్తుకొస్తుంటాయి. నెహ్రూ తప్పిదానికి గుర్తుగా నిలిచిన ఆర్టికల్ 370 తొలగిస్తే కశ్మీర్ ను ముక్కలు చేస్తే దేశం భగ్గుమంటుంది అనే హెచ్చరికలను బీజేపీ బేఖాతరు చేసింది. ఇక తన దృష్టిని యూనిఫాం సివిల్ కోడ్ పై పెట్టింది. నిజానికి బ్రిటిష్ హయాంలోనే మొలకెత్తిన ఈ వివాదం నేడు పెను విషవృక్షంగా మారింది. దాన్ని కూకటివేళ్ళతో పెకలిస్తే తప్ప సమాజంలో శాంతి నెలకొనేలా లేదు.

యూనిఫాం సివిల్ కోడ్ కొత్తదేమీ కాదు. నేడు ఎన్నో దేశాల్లో ఇప్పటికే యూనిఫామ్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. ఎన్నో యురోపియన్ దేశాలు ఆ దిశగా పయనిస్తున్నాయి. మరో వైపున భారతదేశం మాత్రం దశాబ్దాలుగా చట్టాలను ముక్కచెక్కలుగా చేస్తూ ఒక్కో మతానికి ఒక్కో చట్టాన్ని అన్వయిస్తూ వచ్చింది. ఇప్పుడిక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఒక్కటే అంతా భారతీయులే అయితే ఇన్ని విభిన్న చట్టాలు మనకు అవసరమా అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లాంటి చట్టాలు అందరికీ వర్తిస్తున్నప్పుడు మతాల వారీగా పర్సనల్ లాస్ ఎందుకు అని ప్రశ్నించే వారు ఉన్నారు. అదే సమయంలో మతపరమైన స్వేచ్ఛ అంశం తెరపైకి వస్తోంది. మతాన్ని వ్యక్తిగతం చేసి, సామాజిక ప్రభావం కలిగించే అంశాలను యూనిఫామ్ సివిల్ కోడ్ పరిధిలోకి తీసుకురాక తప్పని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది.

చట్టానికి అందరూ సమానమే లాంటి మాటలు తరచూ వింటుంటాం. నిజం మాత్రం అలా ఉండదు. మతాన్ని బట్టి కూడా న్యాయం, ధర్మం మారుతాయి. అలా మారుతున్నందుకే దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం డిమాండ్ అధికమవుతోంది. నిజానికి ఈ భావన కొత్తదేమీ కాదు. బ్రిటిష్ వారి హయాం నుంచీ ఈ సమస్య కొనసాగుతూనే ఉంది.

పద్దెనిమిదో శతాబ్దంలో సతీసహగమనం లాంటి సామాజిక దురాచారాలు భారతదేశాన్ని పట్టిపీడించాయి. వాటిని నిషేధిస్తూ చేసిన చట్టాలకు మొదట్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తరువాత పరిస్థితి సద్దుమణిగింది. ఆధునిక ప్రజాస్వామ్య భారతదేశంలోనూ నేటికీ ఎన్నో మతాచారాలు, సంప్రదాయాలు ప్రజలకు సమాన హక్కులను నిరాకరిస్తున్నాయి. వారి హక్కులను కాలరాస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ తెరపైకి వచ్చింది. ట్రిపుల్ తలాక్ పై ముస్లిం మహిళలు చేసిన పోరాటం మరోసారి ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

ఒకప్పుడు హిందూ కోడ్ విషయంలోనూ తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అప్పుడు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించి బిల్లును నాలుగైదు భాగాలుగా చేసి వ్యతిరేకత తగ్గేలా చేసింది. ఆయా అంశాలపై చర్చించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలోనూ అదే వ్యూహాన్ని అమలు చేయవచ్చు. అంతగా వివాదం లేని అంశాలను మొదటి దశలో చట్టంగా చేయవచ్చు. చర్చల తరువాత అవసరమైతే అతి కొన్ని మినహాయింపులతో మిగితా అంశాలపై కూడా దశలవారీగా చట్టాలు చేయవచ్చు.

నిజానికి యూనిఫామ్ సివిల్ కోడ్ కు, మతాలకు మధ్య సంబంధం లేదు. మనిషి సామాజిక జీవితంలో మతానికి ప్రాధాన్యం పెరగడంతోనే యూనిఫామ్ సివిల్ కోడ్ పై అపోహలు పెరిగాయి. మతతత్వ రాజకీయాల కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ కోసం ప్రయత్నిస్తున్నారనడం సరికాదు. రాజ్యాంగంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రస్తావన ఉంది. ఆ దిశలో ప్రభుత్వం కృషి చేయాలని ఆదేశిక సూత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఒకప్పుడు స్వాతంత్ర్య పోరాటం భారతీయులందరినీ ఒక్కటిగా చేసింది. ఇక ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తో భారతీయులందరినీ ఒక్కటిగా చూసే అవకాశం ఉంది. మతంతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒకే చట్టాన్ని పాటించేందుకు అది వీలు కల్పిస్తుంది. ఇతర ఆర్థిక అంశాలపై నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం మతపరమైన, సామాజికపరమైన అంశాలపై చట్టాలు తీసుకువస్తున్నదన్న విమర్శలు కూడా ఉన్నాయి. అది నిజం అని మాత్రం అనలేం. ఎందుకంటే ఈ సమస్య కొత్తగా వచ్చిందేమీ కాదు. బ్రిటిష్ కాలం నుంచీ కొనసాగుతున్నదే. ఎప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే. ఎంత ఆలస్యం జరిగితే అంతగా వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ దృష్టితో చూసినప్పుడు మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంత త్వరగా వస్తే అంత మంచిదే అవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories