Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే

Mallikarjun Kharge is the President of the Congress Party
x

Mallikarjun Kharge: ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే

Highlights

Mallikarjun Kharge: ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరణ

Mallikarjun Kharge: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ నుంచి ఖర్గే సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఖర్గేకు పుష్పగుచ్ఛం ఇచ్చి సోనియా, రాహుల్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ ఎంపీలు, పీసీసీ, సీఎల్పీ నేతలు కూడా హాజరయ్యారు. అంతకుముందు ఢిల్లీలోని రాజ్ ఘాట్ లో మహాత్మాగాంధీ సమాధి దగ్గర ఖర్గే నివాళులర్పించారు. ఆ తర్వాత శక్తిస్థల్ , శాంతివన్ ను సందర్శించిన ఖర్గే... దివంగత ప్రధానులు ఇందిరాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ సమాధుల దగ్గర శ్రద్ధాంజలి ఘటించారు. ఖర్గే వెంట ఏఐసీసీ నేతలతోపాటు ఇతర సీనియర్ నాయకులు, నేతలు ఉన్నారు.

అనుభవజ్ఞుడైన నేతను ఎన్నుకోవడం సంతోషంగా ఉందని అన్నారు సోనియా. కార్యకర్త స్థాయి నుంచి ఖర్గే అధ్యక్షుడిగా ఎదిగారని.. ఖర్గే ప్రస్థానం అందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్‌ ముందుకెళ్తుందని భావిస్తున్నామన్నారు. ఇక.. ఇన్నాళ్లు తన పట్ల చూపిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తన తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌ కోసం పనిచేస్తానన్నారు సోనియా. తనకు ఉన్న అధికారాలు, పరిధిలకు లోబడి పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎదుర్కోవడం సర్వసాధారణమని, తమ పార్టీ ముందు కూడా అనేక ఎన్నికల సవాళ్లు ఉన్నాయని చెప్పారు సోనియా గాంధీ.

కాంగ్రెస్‌ బలోపేతానికి శాయశక్తులా పనిచేస్తానని అన్నారు కాంగ్రెస్‌ కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఇందుకోసం ప్రతిఒక్కరూ తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోనియా నేతృత్వంలో రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిందని, అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశామని అన్నారు. ఆహార భద్రత, ఉపాధి హామీ వంటి చట్టాలు తీసుకువచ్చామని, సమాచార హక్కు, అటవీ హక్కుల చట్టాలను అమలు చేశామని గుర్తుచేశారు ఖర్గే. సోనియా, మన్మోహన్‌ నేతృత్వంలోని యూపీఏ పాలన.. దేశప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి చురకలు అంటించారు ఖర్గే. అబద్ధాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, అబద్ధాలు, విద్వేష రాజకీయాలను పటాపంచలు చేస్తామని అన్నారు. దేశంలో యువత ఉద్యోగం, ఉపాధి కావాలంటున్నారని.. యువతకు ఉపాధి లేని దేశం ఎటువైపు వెళ్తోందని ప్రశ్నించారు. రాహుల్‌ జోడోయాత్రకు విశేష స్పందన వస్తోందని, రాహుల్‌ పోరాటానికి ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని చెప్పారు. రాహుల్‌ పోరాటాన్ని వృధా కానివ్వమన్నారు ఖర్గే.


Show Full Article
Print Article
Next Story
More Stories