Donald Trump: ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గని మోడీ.. అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా ?

Donald Trump: ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గని మోడీ.. అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా ?
x
ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గని మోడీ.. అమెరికా డబుల్ గేమ్ ఆడుతోందా ?
Highlights

అమెరికా అధ్యక్షుడు రాజకీయంగా ముందుచూపుతో చేసిన పర్యటన ఫలించినట్లుగానే ఉంది. అదే సమయంలో వాణిజ్య అంశాలపై అమెరికా ఒత్తిళ్ళ ముప్పు ప్రస్తుతానికి...

అమెరికా అధ్యక్షుడు రాజకీయంగా ముందుచూపుతో చేసిన పర్యటన ఫలించినట్లుగానే ఉంది. అదే సమయంలో వాణిజ్య అంశాలపై అమెరికా ఒత్తిళ్ళ ముప్పు ప్రస్తుతానికి తొలగిపోయింది. మొత్తానికి చర్చల ముందున్న హైప్ తో పోలిస్తే కుదిరిన ఒప్పందాల స్థాయి తక్కువే. వాణిజ్య ఒత్తిళ్లు లేకుండా పర్యటన ముగిసిపోయిందని మోడీ, ఎంతో కొంత బిజినెస్ తో పాటుగా ఓట్ల మంత్రం వేశామంటూ ట్రంప్ భావించారు. నిజానికి కథ అక్కడితో ముగిసిపోవడం లేదు. అక్కడే మొదలవుతోంది.

ప్రపంచంలో అమెరికా ఓ మూలన ఉంటే భారత్ మరో మూలన ఉంటుంది. 8 వేల మైళ్ల దూరం 18 గంటల ప్రయాణం చేసి ఒక్క భారత్ ను మాత్రమే సందర్శిస్తే పెద్దగా గిట్టుబాటు కాదని భావిస్తారు అమెరికా అధ్యక్ష స్థానంలో ఉండే వ్యక్తులు. 1959 నుంచి 2006 వరకు అలానే జరిగింది. హోవర్ నుంచి జార్జ్ బుష్ వరకు అంతా భారత్ పర్యటన సమయంలోనే పనిలో పనిగా పాకిస్థాన్ ను సందర్శించడం ఆనవాయితీగా మారింది. రెండు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొల్పి తమ ఆయుధాలు విక్రయించేందుకు ఇలాంటి పర్యటనలు జరిగేవి. బరాక్ ఒబామా హయాం నుంచి పరిస్థితిలో మార్పు వచ్చింది. భారత్ లేదంటే పాకిస్థాన్ ఏదో ఒక దేశాన్నే పర్యటించే సంప్రదాయం మొదలైంది.

ఒక దేశానికి వచ్చి పనిలో పని అంటూ మరో దేశానికి వెళ్ళే అమెరికన్ ప్రెసిడెంట్ సంప్రదాయాన్ని భారత్ వ్యతిరేకించింది. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ సూత్రాన్ని గౌరవిస్తూనే మరో రకంగా ఉల్లంఘించారు. పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు తన మంత్రిని పంపించారు. ఆ మంత్రి కూడా నేరుగా అమెరికా నుంచి పాక్ వెళ్లడం లేదు. ట్రంప్ తో పాటు భారత్ కు వచ్చి భారత్ భూభాగంనుంచే పాక్ కు వెళ్తున్నారు. అక్కడ ఆ మంత్రి బేరం చేసేది కూడా ఆయుధాల గురించే. మొత్తం మీద భారత్, పాక్ ల మధ్య వివాదంతో అమెరికా పండుగు చేసుకుంటోంది.

అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రాస్ బుధవారం పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. కొన్ని గంటల పాటు ఆ దేశంలో పర్యటించే రాస్ వివిధ అంశాలపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో చర్చించనున్నారు. అమెరికా కంపెనీల వ్యాపారాలను పెంచడం ఈ చర్చల్లో కీలకం కానుంది. పాకిస్థాన్ లో ప్రభుత్వ విభాగాలు సైతం పైరేటెడ్ సాఫ్ట్ వేర్ లను వాడుతుంటాయి. ఆ అంశం కూడా చర్చకు రానుంది. దాంతో పాటుగా పాక్ ఆర్థిక ఇబ్బందులు, అమెరికా సైనిక సాయం లాంటి అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

భారత్ తో అమెరికా ఒప్పందాలు ఎలా ఉన్నప్పటికీ శాంతి బహుమతిపై ట్రంప్ మోజు రెండు దేశాల సంబంధాల మధ్య చిచ్చు పెట్టే అవకాశం ఉంది. ఏం చేయకుండానే బరాక్ ఒబామాకు శాంతి బహుమతి వచ్చిందనేది ట్రంప్ ప్రగాఢ విశ్వాసం. సిరియాలో ఉగ్రవాదం అరికట్టేందుకు కృషి చేసినందుకు గాను తనకు ఆ బహుమతి రావాలనేది ట్రంప్ నిశ్చితాభిప్రాయం. సిరియా కాకుంటే కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం చేసైనా నోబుల్ శాంతి బహుమతి దక్కించుకోవాలనేది ట్రంప్ ఆలోచనగా ఉన్నట్లుంది. అందుకే ఇప్పటికే రెండు సార్లు మధ్యవర్తిత్వం విషయంలో చిచ్చురేపారు. అలా చిచ్చు రేపే చాన్స్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఉంటుందంటే అతిశయోక్తి కాదు.

అమెరికాలో 40 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. వారి ఓట్ల అవసరంతోనే ట్రంప్ భారత్ బాట పట్టారంటే అతిశయోక్తి కాదు. మరో వైపున అమెరికాలో కొన్ని లక్షల మంది భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారు. వారంతా కూడా ట్రంప్ నిబంధనల కారణంగా ఎన్నో రకాల చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని మోడీ నేరుగా ట్రంప్ తోనే ప్రస్తావించారు. ఈ విషయంలోనే ట్రంప్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. వాణిజ్య ఒత్తిళ్ళపై కూడా రాజకీయ అవసరాల నేపథ్యంలో ప్రస్తుతానికి ట్రంప్ కాస్తంత వెనుకడుగు వేసే అవకాశం ఉంది.

ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య అనుబంధం పెరగడం ప్రపంచానికి మంచిదే. ఎవరి అవసరాలు, ఉద్దేశాలు ఎలా ఉన్నప్పటికీ ఉభయతారకంగా ఉండే ఒప్పందాలు కుదిరాయి. ఈ అనుబంధం మరింత పటిష్ఠం అయితే రేపటి నాడు పాక్ కు వ్యతిరేకంగా అమెరికా మద్దతును ఎంతో కొంత మేరకు ఉపయోగించుకునే వీలుంది. అమెరికా మాత్రం భారత్ స్నేహహస్తాన్ని అందుకుంటూనే పాక్ తో సైతం బేరసారాలకు దిగుతోంది. చైనా, రష్యాల ప్రాబల్యానికి అడ్డుకట్ట వేయాలంటే పాకిస్థాన్, ఆప్థనిస్థాన్ లాంటి దేశాల అవసరం అమెరికాకు ఉంది. ఉగ్రభూతం పేరు చెప్పి ఇతర దేశాలపై పెత్తనం చేయాలన్నా ఆ దేశాల తోడ్పాటు అమెరికాకు తప్పనిసరి. అమెరికా ఆయుధ వ్యాపారం కొనసాగాలంటే కూడా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగాల్సిందే.

ట్రంప్ తన తాజా పర్యటనలో పాకిస్థాన్ ను ఇరుకున పెట్టే అంశాలను కొన్ని ప్రస్తావించారు. కాకపోతే భారత్ ఆశించిన స్థాయిలో మాత్రం ఆ వ్యాఖ్యలు లేవు. ట్రంప్ ఆశించిన రీతిలో భారత్ లొంగకపోవడం ఆయనకు అసంతృప్తి కలిగించినట్లుగా ఉంది. భారత్ కు నష్టం చేకూర్చేలా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆయన భావించారు. ఆయన ఒత్తిళ్లకు ప్రధాని మోడీ తలవంచలేదు. మొత్తం మీద భారత్ ప్రధాని మోడీ అమెరికా పర్యటించినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటించినా అందులో ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. ప్రభుత్వాల మధ్య మాత్రమే కాకుండా ప్రజల మధ్య సైతం అవగాహన పెరిగేందుకు ఇలాంటి పర్యటనలు తోడ్పడుతున్నాయి. ఈ భాగస్వామ్యమే రేపటి నాడు మరింతగా స్నేహసంబంధాలు పెరిగేందుకు పునాదిగా మారుతుంది.

అమెరికా అధ్యక్షుడి పర్యటన సందర్భంగా భారత్ ను అప్రతిష్ట పాలు చేయాలన్న ఉద్దేశంతో ఢిల్లీలో గొడవలు జరిగాయి. అవేవీ కూడా రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపలేకపోయాయి. ట్రంప్ ప్రసంగాన్ని జన సమ్మోహనంగా రూపొందించిన అమెరికా అధికార యంత్రాగానికి ఆ గొడవలు ఎందుకు జరిగాయో కూడా తెలిసే ఉంటుంది. అవెలా ఉన్నప్పటికీ మోడీ, ట్రంప్ మధ్య స్నేహం మరింతగా పెరిగింది. రేపటి నాడు ట్రంప్ మరోసారి ఎన్నికైతే రెండు దేశాల మధ్య అనుబంధం కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories