Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. మ.12.30కు అభిజిత్‌ లగ్నంలో ముహూర్తం

In Ayodhya for a while Balaram Pran Pratishtha
x

Ayodhya: అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట.. మ.12.30కు అభిజిత్‌ లగ్నంలో ముహూర్తం

Highlights

Ayodhya: 1100 టన్నుల పూలతో సర్వాంగ సుందరంగా అయోధ్య

Ayodhya: బాల రాముని దర్శనం కోసం తపిస్తున్న సమయం ఆసన్నమైంది. ఆదర్శపురుషుడు, అవతారమూర్తి ప్రాణప్రతిష్ట సుముహూర్తానికి ఇంకా కొన్ని గంటలే ఉంది. దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్న భక్తులతో అయోధ్యాపుర వీధులన్నీ నిండిపోయాయి. రామయ్య భజనలతో అయోధ్యాపురి మారుమ్రోగుతుంది. రామనామ సంకీర్తనలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్‌ లగ్నంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం మొదలు కానుంది.

ప్రధాని మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొని రాముడి విగ్రహం కళ్లకు కట్టిన పుసుపు వస్త్రాన్ని తొలగించి తొలి దర్శనం చేసుకుంటారు. అనంతరం స్వామివారికి హారతి ఇస్తారు. మంగళవారం నుంచి భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యం కలగనుంది. రామమందిరం ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో దాదాపు 2 గంటల పాటు మంగళ ధ్వనులు ప్రతిధ్వనించనున్నాయి. దీనికోసం ఏపీ నుంచి ఘటం, మృదంగం, నాదస్వరం తమిళనాడు, వీణ కర్ణాటక... తదితర 50 రకాల సంప్రదాయ సంగీత వాయిద్యాలను సిద్ధం చేశారు. 22న ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

అయోధ్యలో రామమందిరం మొత్తం పూలతో, విద్యుద్దీప కాంతులతో అలంకరించారు. అయోధ్య వీధులను సుందరంగా తీర్చిదిద్దారు. దేశంలోని 14 జంటలు ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నాయి. ఇప్పటికే ఈ నెల 16 నుంచి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మంగళ ధ్వని తో శ్రీకారం చుడతారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయిద్యాలను తీసుకొచ్చారు. అయోధ్యకు చెందిన యతీంద్ర మిశ్రా సారథ్యంలో నిర్వహించే ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించనుంది.

అయోధ్య వీధులు కాషాయ రంగు పులుముకున్నాయి. నగరంలో అన్ని వీధులను కాషాయ జెండా, తోరణాలతోపాటు విద్యుత్‌ దీపాలు, పూలమాలలతో అలంకరించారు. నివాస భవనాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, దుకాణాలపైనా పెద్ద సంఖ్యలో జెండాలు దర్శనమిస్తున్నాయి. దుకాణాల్లో వీటి అమ్మకాలు విరివిగా సాగుతున్నాయి. శ్రీరాముడు, హనుమంతుడు, నూతన రామాలయ చిత్రాలు, జైశ్రీరామ్‌ నినాదంతో కూడిన ఈ జెండాలు, తోరణాలు చూపరులకు ఆధ్యాత్మిక భావనలు పంచుతున్నాయి.

కొన్ని స్వచ్ఛంద సంస్థలతోపాటు దాతలు శ్రీరాముడి జెండాలను ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. అయోధ్యలోని రామ్‌పథ్, ధర్మపథ్‌ను జెండాలతో ప్రత్యేకంగా ఆలంకరించారు. అయోధ్యలో రామచరిత మానస్, రామాయణం పుస్తకాల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. వీధుల్లో శ్రీరాముడి పాటలు మార్మోగుతున్నాయి.

రామమందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో అయోధ్యలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 13 వేల మంది పోలీస్‌ సిబ్బందితో బహుళ అంచెల బందోబస్తు కల్పించారు. నిరంతర నిఘా కోసం 10 వేల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. డ్రోన్లనూ రంగంలోకి దించారు. రామ్‌లల్లా ప్రాణప్రతిష్టను పురస్కరించుకొని భారత్‌లోనే కాకుండా విదేశాల్లోని పలు ఆలయాల్లోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడుతున్నారు. వాషింగ్టన్‌ డీసీ మొదలుకొని.. పారిస్‌, సిడ్నీ వరకు దాదాపు 60 దేశాల్లో హిందూ సంఘాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories