Dubai: దుబాయ్ నగరాన్ని ముంచెత్తిన వర్షాలు

Heavy Rains In Dubai
x

Dubai: దుబాయ్ నగరాన్ని ముంచెత్తిన వర్షాలు 

Highlights

Dubai: తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని అమెరికా వెల్లడి

Dubai: దుబాయ్‌ నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఇక్కడి ఎడారి దేశంలో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. మంగళవారం బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోతతో వర్షాలు కుమ్మరించాయి. దాంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అకాల వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. దుబాయ్‌లో రెండేళ్లలో నమోదయ్యే వర్షపాతం.. ఒక్కరోజులోనే కొన్ని గంటల్లోనే నమోదైంది. వర్షాలు, వరదలతో భారీ వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఈ నెల 15 తరవాత మొదలు కాగా ఆ రోజు వర్షపాతం 20 మిల్లీమీటర్లుగా నమోదైంది. మరుసటి రోజు మరింత ఉద్ధృతమైంది. దాదాపు 142 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

ఇప్పటికే యూఏఈ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని తేల్చి చెప్పింది. ఉద్యోగులందరూ ఎవరి ఇళ్లలో వాళ్లు పని చేసుకోవాలని సూచించింది. అయితే...అసలు వర్షం జాడే ఉండని దుబాయ్‌లో ఈస్థాయిలో వానలు ఎందుకు కురిశాయనేదే ఆసక్తికరంగా మారింది. తుఫాను కారణంగానే ఇక్కడ ఇంత భారీ వర్షాలు పడుతున్నాయని అమెరికా అంచనా వేస్తోంది. అరేబియన్ భూభాగం మీదుగా గల్ఫ్‌ వైపుగా ఈ తుఫాన్ దూసుకొస్తోంది. అటు ఒమన్‌లోనూ తేమ వాతావరణం కనిపిస్తోంది. ఇరాన్‌లోనూ స్వల్ప ప్రభావం కనిపిస్తోంది. ఒమన్‌లో వరదల కారణంగా ఇప్పటి వరకూ 18 మంది ప్రాణాలు కోల్పోయారు.

వాతావరణ మార్పులు ఇలా ప్రభావం చూపిస్తున్నాయని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. భూతాపమూ ఈ అసాధారణ వర్షాలకు కారణమని వివరిస్తున్నారు. ఇది కచ్చితంగా మానవ తప్పిదం వల్ల కురుస్తున్న భారీ వర్షాలే అని స్పష్టం చేస్తున్నారు. అయితే UAE ఎప్పటి నుంచో క్లౌడ్ సీడింగ్ చేస్తుందని... ఆ ఫలితమే ఇప్పుడు ఇలా కనిపిస్తోందని అమెరికా అంచనా వేస్తోంది. 2022 నుంచే యూఏఈ ఈ క్లౌడ్ సీడింగ్ చేపడుతోంది.

నీటిని కాపాడుకునేందుకు ఇలా చేస్తోంది. వాతావరణంలోకి పొటాషియం క్లోరైడ్ లాంటి నాచురల్ సాల్ట్‌ని పెద్ద మొత్తంలో ఇంప్లాంట్ చేస్తారు. ఈ కారణంగా మేఘాలు కరిగిపోయి భారీ వర్షాలు కురుస్తాయి. 1982లోనే యూఏఈ ఈ క్లౌడ్ సీడింగ్‌ని ప్రయోగించింది. ఆ తరవాత గల్ఫ్ దేశాలు ఈ కృత్రిమ వర్షాల కాన్సెప్ట్‌పై దృష్టి పెట్టాయి. ఇందుకోసం యూఏఈలో వాతావరణ పరిస్థితులను అవగాహన చేసుకున్నారు అక్కడి సైంటిస్ట్‌లు. మేఘాల పరిమాణాన్ని పెంచడంతో పాటు వాటిని కరిగిపోయేలా ఎలా చేయొచ్చో అధ్యయనం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా విమానాల ద్వారా కెమికల్స్ పంపారు.

కొన్ని మేఘాల వరకూ వెళ్లి అక్కడ ఆ కెమికల్స్‌ని చల్లేవారు. అయితే...ఇలాంటి కృత్రిమ వర్షాల వల్ల నష్టం తప్పదని కొందరు పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందులో సేఫ్‌టీ ఎంత ఉందో కూడా చూసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి దుబాయ్‌లో మాత్రం వరదలు ముంచెత్తి అందరినీ భయపెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories