Congress VS Left Parties: కేరళలో పరస్పరం తలపడుతున్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌.. వయనాడ్‌లో రాహుల్‌పై సీపీఐ పోటీ

Congress VS Left Parties In Kerala
x

Congress VS Left Parties: కేరళలో పరస్పరం తలపడుతున్న కాంగ్రెస్‌, లెఫ్ట్‌.. వయనాడ్‌లో రాహుల్‌పై సీపీఐ పోటీ 

Highlights

Congress VS Left Parties: వయనాడ్‌లో సురేంద్రన్‌‌ను పోటీకి దింపిన బీజేపీ

Congress VS Left Parties: దక్షిణాది రాష్ట్రాల్లో కేరళలో కాంగ్రెస్‌ పార్టీకి బలముందనేది అందరికీ తెలిసిన విషయమే.... ఇక్కడ లెఫ్ట్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ఎప్పుడూ ప్రధాన పోటీ ఉంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేరళ నుంచి పోటీ చేయడంతో... ఆ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్‌ దాదాపుగా క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 20 లోక్‌సభ స్థానాల్లో 19 గెలుచుకుని చరిత్ర సృష్టించిందప్పడు... దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచినా... కేరళలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సత్ఫలితాలను సాధించింది.

మరోసారి రాష్ట్రంలో క్లీన్‌ స్వీప్‌ చేయాలని భావిస్తున్న పార్టీ... రాహుల్‌ గాంధీని మళ్లీ వయనాడ్‌ నుంచే పోటీకి దింపింది. సాధారణంగా అయితే ఆయన విజయం నల్లేరుపై నడకే.... కానీ ఈసారి ఇండియా కూటమి భాగస్వామి అయిన సీపీఐ బరిలోకి దిగుతుండడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. అదీ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అన్నీ రాజా బరిలోకి దిగడంతో గట్టి పోటీ ఉండే అవకాశముంది. దీంతోపాటు బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ వయనాడ్‌లోనే పోటీ చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ ఉన్నాయి. కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నాయి. సీపీఎంతో సీపీఐ జట్టు కట్టి.. అన్నీ రాజాను రంగంలోకి దింపింది. దీంతో ఇండియా కూటమిలోనే ఇద్దరు గట్టి అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ పడుతున్నట్లయింది. వయనాడ్‌లో రాహుల్‌ పోటీ చేయడమంటే పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించినట్లేనని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన కేరళలో లెఫ్ట్‌ కూటమితో పోటీ చేయడానికే వస్తున్నారని విమర్శించారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌ నుంచి పోటీ చేసిన రాహుల్‌ గాంధీ భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు 4 లక్షల 31 వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. కేరళలోనే ఇది అత్యధికం కావడం విశేషం... రాహుల్‌కు 64.94 శాతం ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో లెఫ్ట్‌ నుంచి పీపీ సునీర్‌, ఎన్డీయే భాగస్వామి భారత్‌ ధర్మ జనసేన నుంచి తుషార్‌ వెల్లపల్లి పోటీ చేశారు. తుషార్‌కు కేవలం 78 వేల ఓట్లే వచ్చాయి. కేవలం 7.25 శాతం మాత్రమే రాబట్టగలిగారన్నమాట....

గతేడాది సెప్టెంబరులోనే వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీ చేయొద్దని లెఫ్ట్‌ ప్రతిపాదించింది. ఈ సీటును సీపీఐకి కేటాయించడంతో ఎల్‌డీఎఫ్‌ ఈ ప్రతిపాదన చేసింది. కాంగ్రెస్‌ దీన్ని తిరస్కరించింది. బీజేపీను నేరుగా ఎదుర్కొనే సీటులో రాహుల్‌ పోటీ చేయాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా గతంలోనే సూచించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రాహుల్‌.. భాగస్వాములైన తమపై పోరాడటంతో అర్థం లేదని వాదిస్తున్నారు.

వయనాడ్‌లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్‌ను బరిలోకి దించి ఆ పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. సురేంద్రన్ కరూడా రాహుల్‌కు గట్టి ప్రత్యర్థే..... దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ నెలకొంది. స్వయంగా ప్రధాని మోడీయే సురేంద్రన్‌ను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 50 శాతం ఓట్లను సాధించే ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ కీలక నేతలను ఎన్నికల బరిలోకి దింపింది. తద్వారా అన్ని చోట్లా విజయం సాధించకపోయినా ఓట్ల శాతాన్ని గణనీయంగా పెంచుకోవాలనేది ఆ పార్టీ లక్ష్యం.... రాహుల్‌ గాంధీ మెజారిటీని తగ్గించాలనే లక్ష్యమూ ఉంది.

ఒకప్పటి కాంగ్రెస్‌ కంచుకోట అయిన అమేథీలో గాంధీ కుటుంబం నుంచి ఎవరు బరిలో దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. రాహుల్‌ మరోసారి బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీని ఢీ కొంటారా.. లేదంటే తన సోదరి ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా పోటీ చేస్తారా..? అనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ‘ఇండియా’ కూటమితో సీట్ల సర్దుబాటులో భాగంగా అమేథీ కాంగ్రెస్‌కే దక్కింది. ఏప్రిల్‌ 26న వయనాడ్‌లో పోలింగ్‌ పూర్తయిన తర్వాతే.. అమేథీలో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

ఐదో విడతలో భాగంగా మే 20న అమేథీలో ఓటింగ్‌ జరగనుంది. మే 3 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్‌ వయనాడ్‌ మీదే దృష్టి పెట్టింది. మరోపక్క.. అమేథీలో రాహుల్‌ పోటీ చేస్తే, హస్తానికి అనుకూలంగా పరిస్థితి మారుతుందని పార్టీ అంతర్గత సర్వేలు వెల్లడించాయి. ఇప్పటికే గాంధీ కుటుంబంతో భావోద్వేగ పరంగా ముడిపడి ఉన్న ఆ ప్రాంతంలో.... ఇతర నేతలు బరిలో దిగితే.. అంతర్గత వైరానికి దారి తీయొచ్చని కార్యకర్తల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల మధ్య రాహుల్‌ పోటీపై స్పష్టత రావాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories