'యాత్ర' ఎందుకింత కఠినం.. 12 రోజుల్లో 30కి పైగా మరణాలు..! చార్‌ధామ్ యాత్రలో ఏం జరుగుతోంది?

30 Char Dham Pilgrims Have Died Since Yatra Began 2 Weeks
x

'యాత్ర' ఎందుకింత కఠినం.. 12 రోజుల్లో 30కి పైగా మరణాలు..! చార్‌ధామ్ యాత్రలో ఏం జరుగుతోంది?

Highlights

Chardham Yatra: చార్‌ ధామ్... ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలనుకునే యాత్ర.

Chardham Yatra: చార్‌ ధామ్... ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా చేసి తీరాలనుకునే యాత్ర. అయితే, ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అంత సులువేం కాదు. ప్రతికూల వాతావరణం, ఊహించని పరిస్థితులు, అన్నింటికీ మించి పూర్తిగా ఆరోగ్యం సహకరిస్తేనే గమ్యాన్ని చేరుకునేది కూడా. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా మరణమే శరణమవుతుంది. తాజాగా, ఈ ఆధ్యాత్మిక, సాహస యాత్రలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇంతకూ, చార్ ధామ్ యాత్రలో ఈ స్థాయి విషాదాలకు కారణాలేంటి..? తాజా మరణాలపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏం చెబుతోంది..? చార్ ధామ్ యాత్ర ఎందుకింత కఠినం..?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే చార్ ధామ్ యాత్ర వరుస విషాదాలకు వేదికవుతోంది. పదుల సంఖ్యలో పెరుగుతున్న మరణాలు యాత్రికులను టెన్షన్ పెడుతున్నాయి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాల సందర్శన పూర్తి కాకుండానే పలువురు భక్తులు నేలకూలిపోతున్నారు. దీంతో ఒక్కసారిగా చార్ ధామ్ యాత్రలో ఏం జరుగుతుందన్న చర్చ జోరందుకుంది. నిజానికి, ఇది ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు సాహస యాత్ర కూడా ఉత్తరాఖండ్‌లోని హిమగిరుల్లో కొండకోనలు, వాగులు వంకల గుండా సాగుతూ ఏ క్షణం ఎటు నుంచి ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయో ఊహకందకూడా ఉంటుంది. చార్ ధామ్‌ పర్యటన సాగించాలంటే పూర్తి ఆరోగ్య వంతులకు మాత్రమే సాధ్యం. అందుకే ఉత్తరాఖండ్ ప్రభుత్వం సైతం భక్తులకు అన్ని ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే భక్తులకు అనుమతిస్తుంది. కానీ, ఇంత పర్యవేక్షిస్తున్నా సరే ఎందుకిన్ని మరణాలు సంభవిస్తున్నాయన్నదే అసలు ప్రశ్నంతా. అసలు చార్ ధామ్ యాత్ర ఎందుకింత కఠినం..?

సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తు అత్యంత క్లిష్టమైన మార్గాల్లో నడక అన్నింటికీ మించి ఎముకలు కొరికేసే చలి. ఇవీ చార్ ధామ్ యాత్రీకులు ఎదుర్కొనే ప్రతికూల అంశాలు. ఇలాంటి కఠిన పరిస్థితులు దాటుకొని వెళితేనే గమ్యాన్ని చేరుకోగలుగుతారు. కొన్ని సార్లు యాత్రకు ముందు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా సరే ప్రారంభమైన తర్వాత మాత్రం పరిస్థితులు మారిపోతాయి. ఈ నాలుగు ప్రాంతాల్లో ఒకచోట నుంచి మరోచోటకు చేరుకోవడం చాలా కష్టమైన పని. హిమాలయ శిఖరాల్లో అత్యంత ఎథ్తయిన ఘాట్ మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. రోడ్డు మార్గం సైతం చాలా భయానకంగా ఉంటుంది. చాలా వరకూ రోడ్లు మట్టిరోడ్లే, అవి కూడా దెబ్బతిని ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కమాటలో అదుపు తప్పితే మృత్యువు ఒడికి చేరుకోవడమే అన్నంతగా పరిస్థితులుంటాయి. ఇప్పుడు చార్‌ ధామ్‌లో జరుగుతున్న మరణాలకు మాత్రం ప్రతికూల వాతావరణం ఒక్కటే కారణం కాదు.

చార్ ధామ్ యాత్రలో మరణాలకు ఊహించని భక్తుల తాకిడి కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 2019లో అంటే కరోనా కాలానికి ముందు 6 నెలల్లో 9 లక్షల 26 వేల మంది చార్ ధామ్‌ను సందర్శించారు. 2020లో మాత్రం భక్తుల సంఖ్య తగ్గింది. మొత్తం సీజన్‌లో 2 లక్షల 20 వేల మంది మాత్రమే సందర్శించారు. ఆ తర్వాత 2021లో 2 లక్షల 42 వేల మంది చార్ ధామ్ యాత్ర చేశారు. ఇక ఈసారి యాత్ర ప్రారంభమైన మొదటి వారంలోనే కేదార్‌నాథ్‌ను అక్షరాలా లక్ష 32 వేల మంది సందర్శించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుండడంతో గందరగోళం నెలకొంది. కొందరు భక్తుల యాత్ర మధ్యలో చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. చార్ ధామ్ యాత్ర మార్గాల్లో సరైన ఏర్పాట్లు చేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే ఇప్పటి వరకు మరణించిన వారంతా ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారేనని అధికారులు చెబుతున్నారు. అయితే, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఎలా అనుమతించారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మౌంటైన్ సిక్‌నెస్ ప్రస్తుతం చార్ ధామ్ యాత్రికులను వెంటాడుతున్న మరణం ఇదే. చార్ ధామ్ యాత్రలోనే సముద్ర మట్టానికి ఎత్తైన ప్రయాణం 11వేల 700 అడుగులు. ఈ ప్రయాణమే అత్యంత కీలకం. ఈ జర్నీలో కనుక ఆల్టిట్యూడ్ సిక్‌నెస్‌కి గురైతే ఒక్కోసారి ఊపిరాగిపోతుంది. ప్రధానంగా గాలి ఒత్తిడి ప్రభావం యాత్రికులపై పడుతుంది. ఎత్తుకు చేరుకొనే కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. దీంతో ఒక్కసారిగా ఆందోళనకు గురవుతారు. 8వేల అడుగులకు మించి ప్రయాణించినప్పుడు ఎవరికైనా ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆ సమయంలో తీవ్రమైన తలనొప్పి. మైకం కమ్మడం, వికారం, వాంతులు, అలసట, ఊపిరి అందకపోవడం లాంటి లక్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ప్రతికూలతలే తాజా మరణాలకు కారణమవుతున్నట్టు కనిపిస్తోంది.

మరోవైపు ఎత్తుకు చేరుకునే కొద్దీ క్షీణించే ఆక్సిజన్ లెవెల్స్‌కు అలవాటు పడేందుకు సమయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆల్టిట్యూడ్ లక్షణాలు కనిపించినప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉంటేనే కోలుకునే అవకాశముంటుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు. అయితే, కోవిడ్ బారిన పడి కోలుకున్న వారు చార్ ధామ్ యాత్రకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే, గుండె సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, బీపీ, షుగర్ ఉన్న పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం అనుకోని ఉపద్రవం ముంచుకురావడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం వైద్య పరీక్షల అంశంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ మౌంటైన్ సిక్‌నెస్ కారణంగానే మరణాలు సంభవిస్తున్నట్టు కనిపిస్తోంది.

చార్ ధామ్ యాత్రలో మరణాలు కొత్తేం కాదు. దాదాపు ప్రతి సంవత్సరంలోనూ ఎన్నోకన్ని మరణాలు జరుగుతూనే ఉంటాయి. 2017లో 112 మంది, 2018లో 102 మంది యాత్రికులు మరణించగా 2019లో 90 మంది అనంతలోకాలకు వెళ్లిపోయారు. అయితే, ఈ ఏడాది మాత్రం ఆ లెక్కలు మారిపోయేలా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా పూర్తి ఆరోగ్యంతో పాటు మౌంటైన్ సిక్‌నెస్ లాంటి ప్రతికూలతలను ఎదుర్కోగలిగితేనే చార్ ధామ్ యాత్రను విజయ వంతంగా పూర్తి చేయగలరని వైద్యులు చెబుతున్నారు. ఒక్కమాటలో పర్వతాధిరోహకులు సైతం ఈ అద్భుత ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమయ్యే ముందే ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories