టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Turning Point In 2018 Tollywood Drugs Case
x

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు

Highlights

Tollywood Drugs Case: 2018లో నమోదైన ఎక్సైజ్‌ కేసులను కొట్టివేసిన కోర్టు

Tollywood Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నమోదైన కేసుల్లో ఆరింటిని నాంపల్లి కోర్టు కొట్టేసింది. సరైన ఆధారాలు సాక్ష్యాలు లేకపోవడంతో కేసులు కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. డ్రగ్స్ కేసు నమోదులో సరైన ప్రొసీజర్ పాటించలేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

హైదరాబాద్ నగరంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా... సినిమా ఇండస్ట్రీకి లింకులున్నట్లు బయట పడుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. 2018లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ముఠాలో కింగ్ పిన్‌గా ఉన్న కెల్విన్ అరెస్ట్ కావడంతో డ్రగ్స్ తీసుకున్న వారి పేర్లు ఒక్కొక్కరిగా వెలుగులోకి వచ్చాయి. అందులో పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఉండటం అప్పట్లో సంచలనం సృష్టించింది. కెల్విన్ అరెస్ట్ తర్వాత అతని సెల్‌ఫోన్‌, బ్యాంకు ఖాతాల ఆధారంగా దాదాపు 60 మందిని నార్కొటిక్ అధికారులు ప్రశ్నించారు.

హైదరాబాద్ నగరంలో కెల్విన్ కేంద్రంగా డ్రగ్స్ దందా భారీగా జరుగుతుండంటంతో నాటి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.బాలానగర్, సికింద్రాబాద్, గోల్కొండ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసులను సైతం సిట్‌కు బదిలీ చేశారు. సిట్ అధికారులు 30 మందిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. సినీ రంగానికి చెందిన 12 మందిని పిలిచి ప్రశ్నించారు.

డ్రగ్స్ తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన కొందరి నుంచి వెంట్రుకలు, గోర్ల నమూనాలు సేకరించారు. దర్యాప్తు పూర్తైన తర్వాత ఆబ్కారీ అధికారులు 12 ఛార్జ్ షీట్లు వివిధ కోర్టులలో దాఖలు చేశారు. కానీ ఏ ఛార్జ్ షీట్‌లోనూ సినీ రంగానికి చెందిన వాళ్ల పేర్లను పొందుపర్చలేదు. డ్రగ్స్ సరఫరా చేసిన కొంతమందిని ఛార్జ్ షీట్లో నిందితులుగా పేర్కొన్నారు. వాళ్ల పాత్రపైన సరైన ఆధారాలు సమర్పించకపోవడంతో ఇందులో నాంపల్లి కోర్టు 4 కేసులను, రంగారెడ్డి జిల్లా కోర్టు రెండు కేసులను కొట్టేసింది.

ప్రస్తుతం మరో ఆరు కేసులు మల్కాజిగిరి, నాంపల్లి కోర్టులలో విచారణలో ఉన్నాయి. ఇందులో బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కెల్విన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసు మల్కాజ్‌గిరి కోర్టులోనూ విచారణ దశలో ఉంది. కెల్విన్ విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి పలువురికి విక్రయించినట్లు ఆబ్కారీ అధికారులు ఛార్జ్ షీట్లో పొందుపర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories