ఎన్టీఆర్, చరణ్ స్నేహంతో చెరిగిపోయిన హద్దులు.. RRRతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..!

New Trend in Tollywood‌ Industry With RRR Movie
x

ఎన్టీఆర్, చరణ్ స్నేహంతో చెరిగిపోయిన హద్దులు.. RRRతో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..!

Highlights

RRR Movie: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ మేనియానే కనిపిస్తోంది.

RRR Movie: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ ఎక్కడ చూసినా త్రిబుల్ ఆర్ మేనియానే కనిపిస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌‌స్టార్ రామ్‌చరణ్ నట విశ్వరూపానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు కూడా. అయితే, టాలీవుడ్‌ ఇండస్ట్రీలో త్రిబుల్ ఆర్ ప్రభంజనం ఎలాంటి సంచలన మార్పులకు దారి తీస్తుంది..? మరిన్ని క్రేజీ మల్టీస్టారర్‌లకు ఇదో టార్చ్‌ బేరర్‌గా నిలిచిపోనుందా..? టాలీవుడ్ హిస్టరీలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌ లాంటి కాంబోలు ఇకపై మళ్లీ మళ్లీ రిపీట్ కానున్నాయా..? అన్నింటికీ మించి చరణ్, తారక్‌ల దోస్తీతో ఫ్యాన్స్‌ మధ్య విభేదాలు, వివాదాలకు పుల్‌స్టాప్ పడినట్టేనా..?

ఇద్దరు టాప్ హీరోలు.. ఒకరు మెగా కాంపౌండ్‌ నుంచి వస్తే.. మరోకరు నందమూరి వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరిలో ఎవరి స్టైల్ వారిది, ఎవరి టాలెంట్ వారిది. ఎవరి ఫ్యాన్‌ బేస్ వారిది. తమ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయినా, ఎలాంటి ఇగోలకూ పోకుండా హెల్దీ కాంపిటీషన్‌తో సై అంటే సై అన్నట్టుగా నటించి, కాదు కాదు జీవించి ఇద్దరికిద్దరూ శెభాష్ అనిపించుకుంటున్నారు. అయితే, ఇద్దరు టాప్‌ హీరోలు ఒకే సినిమాలో సిల్వర్‌ స్క్రీన్‌ను షేర్ చేసుకుంటే అభిమానులు రచ్చ చేయకుండా ఉంటారా..? త్రిబుల్ ఆర్‌ ప్రకటన తర్వాత ఇండస్ట్రీ ఇంటా బయటా అందరికీ ఎదురైన ప్రశ్న ఇదే. ఇందుకు కారణం గతంలో జరిగిన వివాదాలనే చెప్పాలి. అయితే, ఈ అనుమానాలను తలకిందులు చేస్తూ తమలానే తమ ఫ్యాన్స్‌ను కూడా ఒకట్టిగా చేయడంలో చెర్రీ, తారక్ సక్సెస్ అయ్యారు. దీంతో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అన్న వివాదాలు చెరిగిపోయి.. ఒకే స్క్రీన్‌పై సినిమాను సినిమాగా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇంతకూ చరణ్‌, తారక్ ఫ్రెండ్‌షిప్ ఎప్పుడు, ఎలా మొదలైంది..?

ఎన్టీఆర్, చరణ్‌ల స్నేహం RRRతో మొదలైంది అనుకుంటే పొరపాటే.. ఈ ఇద్దరు టాప్ హీరోల ఫ్రెండ్‌షిప్.. స్టార్లుగా ఎదగక ముందునుంచే ఉంది. ఈ విషయం ఫ్యాన్స్‌కు కూడా RRRముందు వరకూ తెలీదు. మూవీ ప్రమోషన్స్‌లో తమ అభిమాన హీరోలు సొంత అన్నదమ్ములకంటే అన్యోన్యంగా మెలగడం చూసి అభిమానులే షాకయ్యారు. సిల్వర్‌ స్క్రీన్‌పై విశ్వరూపం చూపించే తమ హీరోలేనా వీళ్లు అని ఫీలయ్యేలా చేయడంలో చరణ్‌, తారక్ సక్సెస్ అయ్యారు. నిజజీవితంలో తమ దోస్తీ ద్వారా తమ మధ్య ఎలాంటి వివాదాలు ఉండవనీ.. సోషల్ మీడియాలో వచ్చేవన్నీ గాసిప్పులే అని తేల్చి చెప్పారు.

సరిగ్గా ఈ మాటలే తారక్, చరణ్ ఫ్యాన్స్‌ని ప్రభావితం చేశాయి. ఇంతకు ముందు ఇలాంటి ఇద్దరు హీరోల సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ చేసేందుకే భయపడాల్సిన పరిస్థితులు ఉండేవంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ అగ్ర హీరోల ఫ్యాన్స్‌ మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతుంది. తమిళ ఇండస్ట్రీలో అయితే, ఈ రచ్చ అంతా ఇంతా కాదు. అజిత్, విజయ్ ఫ్యాన్స్‌ మధ్య సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్‌ వార్ నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్, చరణ్‌ల ఫ్రెండ్‌షిప్ ఫ్యాన్స్ మధ్య వివాదాలను దూరం చేసి.. ఆరోగ్యకర వాతావరణం ఏర్పడేలా చేసింది. RRR విషయంలో ఎక్కడో ఒకటి రెండు చోట్ల మినహా ఈ ఇద్దరు అగ్ర హీరోల నటనను ఫ్యాన్స్‌ ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పాలి.

త్రిబుల్ ఆర్‌ లాంటి పాన్ ఇండియా సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంత హెల్దీ కాంపిటీషన్ ఉందో యావత్ దేశానికీ తెలిసొచ్చింది. మూవీ ప్రమోషన్స్‌ కోసం దేశం బయటా లోపలా నిర్వహించిన ఎన్నో ఈవెంట్లలో ఒకరంటే ఒకరికి ఎంత అభిమానమో చాటుకోవడం ద్వారా ఎన్టీఆర్, చరణ్‌లు.. ఫ్యాన్స్‌ను ప్రిపేర్ చేశారు. ప్రతి సందర్భంలోనూ వారిమధ్య ప్రేమను బయటపెడుతూ వచ్చారు. పలు సందర్భాల్లో కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి హీరోల భావోద్వేగాలు కనిపించాయి. దీంతో అభిమానుల్లోనూ మీరూ, మేము అన్న భేదాలు తొలగిపోయాయి. థియేటర్లలో సీట్ల మధ్య ఉండే దూరం కూడా తమ మధ్య లేదని నిరూపిస్తున్నారు ఎన్టీఆర్, చరణ్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్.

నిజానికి త్రిబుల్ ఆర్ సినిమా పట్టాలెక్కడానికి కారణమే చరణ్, తారక్‌ల స్నేహం అని దర్శక ధీరుడు రాజమౌళి సైతం ప్రకటించారు. ఒకే ఏజ్‌ గ్రూప్‌లో ఉండే ఇద్దరు రియల్ హీరోల కథ అనుకున్న వెంటనే చరణ్‌, తారక్‌లే గుర్తొచ్చారట. ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ గురించీ ముందే తెలిసిన రాజమౌళి మరో ఆలోచనే లేకుండా చెర్రీ, తారక్‌లకు కథ చెప్పడం ఆ కథను ఓకే చేయడం ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం చకచకా జరిగిపోయాయి. ఆరోజు నుంచి ఈ క్షణం వరకూ RRRకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ ఓ ప్రకంపనే సృష్టించింది. అన్నింటీ మించి ఈ ఇద్దరి స్నేహాన్నీ సినీ ప్రపంచానికి పరిచయం చేసిన సినిమాగా RRR పిలిచిపోతుంది.

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమానా..? అన్న స్థాయి నుంచి ఇక నుంచి అన్నీ భారీ మల్టీస్టారర్‌లే ఉంటాయి అనే స్థాయికి RRR పునాది వేసినట్టయింది. ఇద్దరు పాన్ ఇండియా స్థాయి నటులు ఒకే ఒక్క సినిమాతో యావత్ దేశాన్నీ షేక్ చేయడం ఇందుకు కారణంగా చెప్పాలి. తెలుగు సినిమా హిస్టరీలో ఎన్టీఆర్-ఏఎన్నార్, కృష్ణ-కృష్ణంరాజు, చిరంజీవి-కృష్ణంరాజు ఇలా అగ్రహీరోలు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేశారు. ఆ తర్వాత ఇద్దరు హీరోలు కలిసి నటిస్తూ చూడాలన్న అభిమానుల కోరిక కలగానే మిగిలిపోయింది. ఇందుకు కారణాలు ఏవైనా టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ అంటే ఆనాటి సినిమాలే గుర్తొచ్చేవి. అయితే, మళ్లీ ఇన్నాళ్లకు ఒకే స్థాయి క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు కలిసి నటించడం అది కూడా పాన్ ఇండియా స్థాయి సినిమా కావడంతో మళ్లీ మల్టీస్టారర్‌లకు ప్రాణం వచ్చినట్టయింది. అంతేనా ఈ ఇద్దరు హీరోలు మళ్లీ మళ్లీ కలిసి నటించడానికి కూడా రెడీ అని ప్రకటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ గుండమ్మ కథ లాంటి సినిమా కలిసి చేయాలనుందని మనసులో మాట బయటపెట్టారు.

అయితే, రీసెంట్‌ టైమ్‌లోనూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గోపాల గోపాల, భీమ్లానాయక్ లాంటి సినిమాల్లో ఇద్దరు హీరోలు నటించి మెప్పించినా.. RRR ఆ స్థాయిని మరింత పెంచేలా చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సమయంలో ఫ్యాన్స్‌ మధ్య హెల్దీ వాతావరణం కూడా ఇకపై టాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మరిన్ని భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు వేయడానికి బాటలు పరిచినట్టయింది. ఇందుకు తగ్గట్టే పలు మల్టీస్టారర్‌ మూవీల ప్రకటనలు కూడా ఆశక్తి రేపుతున్నాయి. ఇప్పటికే.. చిరు, చెర్రీ ఆచార్య కూడా విడుదలకు సిద్ధం కాగా.. మెగాస్టార్ అప్‌కమింగి మూవీ గాడ్‌ఫాదర్‌లో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు కూడా. ఇదే సమయంలో ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె'లో అమితాబ్, సలార్‌లో మలయాళ స్టార్ పృథ్వీరాజ్, ఆదిపురుష్‌లో సైఫ్ అలీఖాన్ నటించడం ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతోంది.

ఇదంతా ఒకెత్తయితే.. మరో భారీ మల్టీస్టారర్‌పై జక్కన్న తమ మనసులో మాటను బయటపెట్టారు. దేశంలోనే విలక్షణ నటుడైన కమల్‌ హాసన్, ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌లతో సినిమా చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. అది కూడా కమల్ విలన్‌గా రజనీకాంత్ హీరోగా సినిమా చేయాలనుందన్నారు. నిజానికి జక్కన్న అడిగితే ఈ ఇద్దరు హీరోలూ నో చెప్పే ఛాన్స్‌ ఉండకపోవచ్చు. తారక్‌, చెర్రీలతోనే ఈ స్థాయి సినిమా తీసిన జక్కన్న చేతికి కమల్, రజనీ దొరికితే ఆ సినిమా ఇంకెన్ని సంచలనాలకు కారణమవుతుందో ఊహకు అందడం కూడా కష్టమే. దీంతోపాటు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహా భారతంలోనూ ఇండియాలో ఉన్న టాప్ హీరోలందరినీ రంగంలోకి దించే ఆలోచనలో జక్కన్న ఉన్నారట. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే సినీ ప్రపంచం షేక్ అయిపోవడం ఖాయం.

మొత్తంగా టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా సిల్వర్‌ స్క్రీన్‌లపై మరిన్ని మల్టీస్టారర్‌లకు RRR ప్రాణం పోసిందని చెప్పాలి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో చరణ్, తారక్‌లు నటిస్తున్నారని ప్రకటించిన వెంటనే ఇదో సంచలనం కావడం ఖాయం అని ఇండస్ట్రీతో పాటు అభిమానులు డిసైడ్ అయిపోయారు. ఇందుకు తగ్గట్టుగానే ఫ్యాన్స్‌ను ఒక్కటి చేయడంలో ఇద్దరికి ఇద్దరు హీరోలు సక్సెస్ అయ్యారు. దీంతో ఇకముందు టాలీవుడ్‌లో మరిన్ని భారీ మల్టీస్టారర్‌లు పక్కా అన్న సంకేతాలు ఇచ్చినట్టయింది. అన్నింటికీ మించి హీరోల అభిమానుల మధ్య ఉన్న సన్నని వివాద గీతను చెరిపేయడంలో త్రిబుల్ ఆర్‌ మూవీదే ప్రధాన పాత్రయింది. మొత్తంగా RRR ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలాంటి సంచలన మల్టీస్టారర్‌ సినిమాలు వస్తాయో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories