మండపేటలో వైసీపీ సోషల్‌ స్ట్రాటజీ..ఫలితమిస్తుందా..తుస్సుమంటుందా?

మండపేటలో వైసీపీ సోషల్‌ స్ట్రాటజీ..ఫలితమిస్తుందా..తుస్సుమంటుందా?
x
Highlights

తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో, ఈసారి ట్రయాంగిల్‌ వార్‌ ఇంట్రెస్టింగ్‌‌గా సాగింది. అయితే మండపేటలో ప్రతి ఎన్నికల్లోనూ అటూ ఇటూ...

తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో, ఈసారి ట్రయాంగిల్‌ వార్‌ ఇంట్రెస్టింగ్‌‌గా సాగింది. అయితే మండపేటలో ప్రతి ఎన్నికల్లోనూ అటూ ఇటూ ప్రధాన రాజకీయ పక్షాలు కమ్మసామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులకే టిక్కెట్లు ఖరారు చేస్తుంటాయి. అటు అనపర్తి అసెంబ్లీ రెడ్డి సామాజికవర్గానికి చెందిన నియోజకవర్గంగా, మండపేట కమ్మసామాజికవర్గానికి చెందిన నియోజకవర్గంగా రాష్ర్టంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు వుంది. అయితే వైసీపీ ఈసారి సరికొత్త వ్యూహం వేసింది. అదే ఇప్పుడు మండపేటలో ఉత్కంఠ కలిగిస్తోంది ఇంతకీ ఏటా వ్యూహం?

తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎక్కువ పర్యాయాలు తెలుగు తమ్ముళ్లే విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో బిసీ, కాపు సామాజికవర్డాల ఓటు బ్యాంకు అధికంగానే వున్నప్పటికీ, ఆర్ధికపరంగా స్ధిరపడిన కమ్మ సామాజికవర్గమే రాజకీయంగా పలుకుబడి పెంచుకుంది. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం హయాంలలో, ఇపుడు జనసేన పార్టీలు కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులకే టిక్కెట్టు ఖరారు చేశారు. అయితే వైసీపీ మాత్రం అందుకు భిన్నంగా గత ఎన్నికల్లోనూ ఇపుడు కూడా వేరొక సామాజికవర్గాలకు టిక్కెట్లు ప్రయోగాత్మకంగా కేటాయించింది.

2014లో కాపు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడుకు వైసీపీ టిక్కెట్ ఇచ్చినా 36 వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం 2019 మండపేట బరిలో ఈ నియోజకవర్గంలో వైసీపీ బిసీ సామాజికవర్గానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను నిలిపింది. చంద్రబోస్ సొంత నియోజకవర్గం రామచంద్రపురం అయినప్పటికీ, వైసీపీ నేత జగన్ వ్యూహం ప్రకారం ఈసారైనా సుభాష్ చంద్రబోస్‌ను మండపేటలో నిలపడం ద్వారా మండపేటలో గెలుపొందాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు.

1978 నుంచి ఆలమూరు అసెంబ్లీ నియోజకవర్గంగా వున్న మండపేట అంతకుముందు, పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంగా వుండేది. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009 నాటికి మండపేట కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడి ఈ నియోజకవర్గంలోని ఆలమూరు మండలాన్ని కొత్తపేట సెగ్మెంట్‌లో కలిపారు. మండపేట కేంద్రంగా నియోకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009 , ఆ తర్వాత 2014 ఎన్నికలలో కూడా తెలుగుదేశం అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వరరావు అత్యధిక మెజారిటీతో రెండు పర్యాయాలు విజయం సాధించారు. ఇపుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా, వ్యాపారవేత్తగా వున్న వేగుళ్ల జోగేశ్వరరావు తిరిగి హ్యాట్రిక్ సాధించే దిశగా తన పోలింగ్ సరళి వుందని గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ అభ్యర్ధి మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తన సామాజికవర్గానికి చెందిన ఓట్లతో పాటు ఇతర బీసీ వర్గాల ఓట్లు కలిపి దాదాపుగా లక్ష ఓట్లు వుండటంతో, వైసీపీ ఓటు బ్యాంకుతో తనదే గెలుపు అని భావిస్తున్నారు. వైసీపీకి దళిత సామాజికవర్గాల ఓటు బ్యాంకు ఎక్కువగా పోలవ్వడంతో దానికి బిసీలు తోడైతే గెలుపు ఈజీ అవుతుందన్న లెక్కలు వైసీపీ నేతలు వేసుకుంటున్నారు.

రామచంద్రాపురం సొంత నియోజకవర్గం అయినప్పటికీ, అక్కడ నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా బోసు ప్రాతినిథ్యం వహించినప్పటికీ మండపేటలో గెలుపు కోసం వైసీపీ ఒక వ్యూహం ప్రకారం మండపేట బరిలోకి దింపింది. 2014లో కూడా కాపు సామాజికవర్గం ఓట్లు అధికంగా వుండటంతో మాజీ ఎంపీ గిరిజాల వెంకటస్వామినాయుడుకు మండపేట సీటిచ్చిన వైసీపీకి, గట్టి ఎదురు దెబ్బే తగిలింది. అప్పట్లో గిరిజాలకు 64వేలకు పైగా ఓట్లు పోలయ్యాయి. వైసీపీ అభ్యర్ధి గిరిజాలపై తెలుగుదేశం అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వరరావు 36వేల ఓట్ల మెజారిటీతో 2014లో విజయం సాధించారు.

ఇపుడు త్రిముఖ పోటీలో జనసేన అభ్యర్దిగా వేగుళ్ల లీలాకృష్ణ పోటీపడ్డారు. తెలుగుదేశం, వైసీపీలతో పోటీపడి మరీ జోరుగా ప్రచారం నిర్వహించారు. అయితే వైసీపీ, తెలుగుదేశం అభ్యర్ధులు ఓటర్లను ఆకట్టుకోవడంలో ఎవరి ఎత్తుగడలు వారు వేశారు. వాటితో జనసేన అభ్యర్ధి లీలాకృష్ణ పోటీపడలేకపోయారు. అయితే ఓట్లు చీలిక భారీగానే వుంటుందని, దానివల్ల తమకే మేలు జరుగుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఆ ఓట్లు చీలిక వల్లే తన విజయం తధ్యమని, గతంలో వచ్చిన మెజారిటీ రాకపోయినా గెలుపు మాత్రం తమదేనంటూ తెలుగుదేశం నాయకులు లెక్కలు వేస్తున్నారు.

అప్పటికీ, ఇప్పటికీ మండపేటలో ఓట్లు పెరిగాయి, కానీ పోలింగ్ శాతం గత ఎన్నికలకంటే 2శాతం తగ్గింది. అలాగే త్రిముఖ పోటీ సాగింది. మొత్తం 2లక్షల 14వేల ఓట్లలో లక్షా 83వేలకు పైగా పోలయ్యాయి. పైగా 2వేల 600 వరకూ అదనంగా మహిళా ఓట్లు పోలయ్యాయి. ఇలాంటి పరిణామాల్లో మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అనే లెక్కలు బెట్టింగ్ రాయుళ్లకు మరింత జోష్‌నిస్తున్నాయి.

తెలుగుదేశమే తిరిగి గెలుస్తుందని కొందరు, వైసీపీ విజయం సాధిస్తుందని మరికొందరు పోటాపోటీగా బెట్టింగులు భారీగా కాస్తున్నారు. టీడీపీ అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వరరావు కూడా గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మండపేటలో గెలుపెవరిది అనే అంశంపై తీవ్ర ఉత్కంఠే కొనసాగుతోంది. ఏదిఏమైనా ఈ నియోజకవర్గంలో పోలింగ్ సరళి చూస్తుంటే రాజకీయవర్గాలలో ఆసక్తి కలుగుతోంది. 2009 నాటి పోలింగ్ సరళిని దృష్టిలో పెట్టుకుని అంచనాలు వేస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. ఏది ఏమైనా ఈనెల 23న బ్యాలెట్ బాక్సులు తెరిచేవరకూ ఈ ఉత్కంఠ తప్పదు.

Show Full Article
Print Article
Next Story
More Stories