చివరి నిమిషంలో చేరిన ముగ్గురికి బీ ఫామ్

చివరి నిమిషంలో చేరిన ముగ్గురికి బీ ఫామ్
x
Highlights

టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులను జాబితా విడుదల చేసింది. మొత్తం 17 సీట్లకు అధినేత కేసీఆర్ పేర్లను ప్రకటించారు. నలుగురు సిట్టింగులకు టీఆర్ఎస్ లిస్టులో చోటు...

టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులను జాబితా విడుదల చేసింది. మొత్తం 17 సీట్లకు అధినేత కేసీఆర్ పేర్లను ప్రకటించారు. నలుగురు సిట్టింగులకు టీఆర్ఎస్ లిస్టులో చోటు దక్కలేదు. అలాగే చివరి నిమిషంలో గులాబీ కండువా కప్పుకున్న ముగ్గురిని కూడా ఎంపీ సీటు వరించింది.

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఒకేసారి 17 మంది అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. వెంటనే బీఫామ్స్ కూడా అందజేశారు. ముందుగా ఊహించినట్లే కొందరికి సీట్లు కేటాయించినా అనేక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేశారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్‌కు , నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితకు మరోసారి అవకాశం ఇచ్చారు. అలాగే భువనగిరి సీటును సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కు, వరంగల్ సీటును సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్‌కే కేటాయించారు. ఇక సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయికిరణ్ యాదవ్‌కు మల్కాజిగిరి సీటు మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి ఇచ్చారు.

మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాం నాయక్‌ , నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డికి సీట్లు దక్కలేదు. మహబూబ్‌నగర్‌లో జితేందర్‌రెడ్డి స్థానంలో మన్నె శ్రీనివాస్‌రెడ్డి, మహబూబాబాద్‌లో సీతారాం నాయక్‌ స్థానంలో మాలోత్ కవితకు చోటు కల్పించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు సమస్వయ సమితి ఛైర్మ‌న్‌గా ఉండడంతో ఆయనను పక్కన పెట్టారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్థానంలో లేటెస్ట్‌గా పార్టీలో చేరిన నామా నాగేశ్వరరావుకు ఖమ్మం సీటు కేటాయించారు. అలాగే చివరి నిమిషంలో కారెక్కిన బోర్లకుంట వెంకటేశ్ నేతకానికి పెద్దపల్లి సీటు, వేమిరెడ్డి నరసింహ రెడ్డికి నల్గొండ సీటు కేటాయించారు.

జహీరాబాద్ సీటును బీబీ పాటిల్‌కు ఇచ్చారు. మెదక్ - కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ - గోడెం నగేశ్, నాగర్ కర్నూల్- పోతుగంటి రాములుకు కేటాయించారు. చేవెళ్ల సీటు తాజాగా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డికి కేటాయిస్తారని అందరూ ఊహించగా ఆ స్థానాన్ని డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి కేటాయించారు. ఇక టీఆర్ఎస్ మిత్రపక్షం ఎంఐఎం ప్రాబల్యం ఎక్కువగా ఉండే హైదరాబాద్ సీటుకు కూడా అభ్యర్ధిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ సీటును పుస్తె శ్రీకాంత్‌‌కు ఇచ్చారు. ఇక పెద్దపల్లి ఎంపీ సీటుపై కన్నేసి తీవ్రంగా యత్నించిన మాజీ ఎంపీ జి.వివేక్‌‌కు కూడా సీటు దక్కలేదు.


Show Full Article
Print Article
Next Story
More Stories