మానవతాదృక్పధం చాటుకున్న డాక్టర్‌ లలిత...దట్టమైన అడవుల్లో...

మానవతాదృక్పధం చాటుకున్న డాక్టర్‌ లలిత...దట్టమైన అడవుల్లో...
x
Highlights

వైద్యులంటే ప్రాణం పోసేవారు. అందుకే ఆ వృత్తిలో ఉన్న వారిని దేవునితో పోలుస్తుంటారు. అలాంటి ఓ ప్రాణదేవత మండుటెండలో పూరిపాకకు నాలుగు కిలోమీటర్లు...

వైద్యులంటే ప్రాణం పోసేవారు. అందుకే ఆ వృత్తిలో ఉన్న వారిని దేవునితో పోలుస్తుంటారు. అలాంటి ఓ ప్రాణదేవత మండుటెండలో పూరిపాకకు నాలుగు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లింది. సకాంలో వైద్య సేవలు అందించి ప్రసవం చేసింది ఓ వైద్యురాలు. తల్లిబిడ్డ ప్రాణాలను కాపాడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పాలవాగులో ఈ మానవత్వం చాటే దృశ్యాలు చోటు చేసుకున్నాయి.

దట్టమైన అడవుల్లోని మారుమూర గిరిజన గ్రామాలకు వెళ్లాలంటే త్వరగా ఎవరూ సాహసం చేయరు. కానీ పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణికి నేనున్నానంటూ ఆసరాగా నిలిచింది ఓ ప్రభుత్వ వైద్యురాలు. మానవతా దృక్పధంతో వైద్యురాలు లలిత చేసిన ప్రయత్నానికి ప్రశంసల వర్షం కురుస్తోంది. గిరిజన కుటుంబంలో పుట్టి ఉన్నత చదువులు చదివినా సామాన్యులకు సేవ చేయాలనే తలంపుతో వైద్య వృత్తినే దైవంగా భావిస్తూ విధులు నిర్వహిస్తోంది డాక్టర్‌ లలిత.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ ప్రాంతంలో నివాసముండే డాక్టర్ లలిత భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ప్రసూతి వైద్యురాలిగా పనిచేస్తోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు పౌష్టికాహారం విషయంలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన బృందంలో డాక్టర్‌ లలిత సభ్యురాలిగా ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తూ గిరిజనుల్లో అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

విధి నిర్వహణలో భాగంగా రెండు రోజుల క్రితం ములకలపల్లి ఏజెన్సీ ప్రాంతంలో తన బృందంతో కలిసి పర్యటించారు డాక్టర్‌ లలిత. ఈ క్రమంలో సమీప అటవీ ప్రాంతంలో ఉన్న ఓ గుట్టపై పూరిపాకలో ఆదివాసి మహిళ పురుటి నొప్పులతో బాధ పడుతున్న సమాచారం తెలిసింది. దాంతో కొండపై నాలుగు కిలోమీటర్ల దూరంలో మండుటెండలో నడిచి పాలవాగు అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పూరిపాకలో గిరిజన మహిళ పురిటి నొప్పులతో బాధపడుతుండడం, వెంటనే ఆస్పత్రికి తరలించే పరిస్థితులు లేకపోవడంతో అక్కడిక్కడే వైద్య సేవలను ప్రారంభించారు. ప్రసవం చేయడానికి అవసరమైన పరికరాలు, అనువైన పరిస్థితులు లేకపోయినా గర్భిణి ఆరోగ్య పరిస్థితి విషమించకుండా తన వద్ద ఉన్న మందులతోనే వైద్యం అందిస్తూ రెండు గంటల పాటు శ్రమించి సాధారణ ప్రసవం చేశారు డాక్టర్‌ లలిత.

డాక్టర్‌ లలిత చేసిన ప్రసవంలో పండంటి మగబిడ్డ పుట్టాడు. దీంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. డెలివరీ తర్వాత మెరుగైన వైద్యం కోసం తల్లీబిడ్డని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మారుమూల అటవీ ప్రాంతంలో అత్యవసర పరిస్థితుల్లో వైద్యురాలు లలిత స్పందించిన విధానం అందరి అభినందనలు అందుకుంటోంది. ఆదివాసి మహిళకు పురుటి నొప్పుల సమయంలో వైద్యసేవలు అందకపోతే తల్లిబిడ్డ పరిస్థితి విషమంగా ఉండేదని, డాక్టర్‌ లలిత అందించిన స్పూర్తితో సామాన్యులకు వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories