డిఫరెంట్‌గా గంటా పొలిటికల్‌ స్టైల్...కుదిరితే పార్టీని...

డిఫరెంట్‌గా గంటా పొలిటికల్‌ స్టైల్...కుదిరితే పార్టీని...
x
Highlights

రాజకీయ నేతలంతా రాజకీయాలు చేస్తుంటారు. కానీ గంటా మాత్రం రాజకీయాలతో ఆటలాడుకుంటారు. అదేమిటంటారా ఎన్నికలొస్తే చాలు నియోజకవర్గాన్ని మార్చేస్తుంటారు....

రాజకీయ నేతలంతా రాజకీయాలు చేస్తుంటారు. కానీ గంటా మాత్రం రాజకీయాలతో ఆటలాడుకుంటారు. అదేమిటంటారా ఎన్నికలొస్తే చాలు నియోజకవర్గాన్ని మార్చేస్తుంటారు. కుదిరితే పార్టీని కూడా మార్చేస్తుంటారు. కానీ ఈసారి కూడా ఎప్పటిలా సీటు మార్చేసారు. కానీ పార్టీని మాత్రం మార్చలేదు. ఇంతకీ విశాఖలో గంటా నియోజకవర్గాల మార్పుతో సాగిస్తున్న రాజకీయాల గుట్టు ఏమిటో తెలియాలంటే ఒక లుక్ వేయాల్సిందే.

గంటా శ్రీనివాసరావు రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు పోటీ చేసిన స్థానంలో మళ్లీ పోటీ చేసిన దాఖలాలు లేనే లేవు. ఈసారి తప్పితే ఇప్పటివరకు ప్రతీ ఎన్నికకు, ఆయన పార్టీలను కూడా మార్చారు. సాధారణంగా ప్రతీ నాయకుడుకి కూడా సొంత నియోజకవర్గాలుంటుంటాయి. చంద్రబాబుకు కుప్పం, జగన్‌కు పులివెందుల తరహాలో ఏదో ఒక నియోజకవర్గం ఆస్థానంగా ఉంటాయి. కానీ గంటాకు మాత్రం ఎక్కడా ఆ చరిత్ర లేదు. ఎన్నిక వస్తుందంటే చాలు గంటా కొత్త పార్టీ అయినా, కొత్త నియోజకవర్గాన్నయినా వెతుక్కుంటుంటారు. ఇదీ ఆయన పొలిటికల్ స్టైల్.

మంత్రి గంటా శ్రీనివాసరావును రాజకీయాలకు పరిచయం చేసినది తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు. విశాఖలో షిప్పింగ్ బిజినెస్ ఉండే గంటాకు అప్పట్లో రాజకీయాలపై విపరీతమైన ఆసక్తి ఉండటంతో, టీడీపీ అధినేతకు పరిచయం చేశారు. అనకాపల్లి ఎంపీగా సీటు ఇప్పించారు. 1999 ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ తరుఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో గంటా మకాం మార్చేశారు. చోడవరం నియోజకవర్గంలో బస చేసారు. టీడీపీ తరుఫున చోడవరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఇక 2009లో గంటా తనదైన రాజకీయాలకు మరింత పదును పెట్టారు. సరిగ్గా అదే సమయంలో తెలుగుదేశంకు గుడ్ బై చెప్పి, చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరారు. అప్పుడు కూడా పోటీ చేసే స్థానాన్ని మార్చేసారు. ప్రజారాజ్యం తరఫున అనకాపల్లిలో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం కావడంతో గంటా కూడా కాంగ్రెస్‌లో కొనసాగారు. 2014 ఎన్నికల్లో మళ్లీ గంటా పార్టీ మార్చేసారు.

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిని గమనించి మళ్లీ టీడీపీలో చేరిపోయారు. ఈసారి ఆయన విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. భీమిలిలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి సునాయాసంగా గెలిచేశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి. దీంతో గంటా తన సంప్రదాయాన్ని ఏమాత్రం మరిచిపోలేదు. ఎప్పటిలానే నియోజకవర్గాన్ని మార్చేసారు. భీమిలికి గుడ్ బై చెప్పేసి ఈసారి విశాఖ నగరంలోని ఉత్తర నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలవాలన్నది ఆయన ప్లాన్. ఇప్పటివరకు గంటా ఎదురులేకుండా ప్రతీ ఎన్నికల్లో ఆయనే విజేతగా వస్తున్నారు. మరి ఈసారి కూడా ఆయన పొలిటికల్ గేమ్ విన్నర్ అవుతారో లేదో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories