రాప్తాడు నియోజకవర్గంలో రసవత్తరపోరు...పరిటాల వర్గాన్ని నిలువరించేందుకు వైసీపీ...

రాప్తాడు నియోజకవర్గంలో రసవత్తరపోరు...పరిటాల వర్గాన్ని నిలువరించేందుకు వైసీపీ...
x
Highlights

ఫ్యాక్షన్, ముఠా కక్షలతో రగిలిపోయిన రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీ, వైసీపీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరికి...

ఫ్యాక్షన్, ముఠా కక్షలతో రగిలిపోయిన రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టీడీపీ, వైసీపీలు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎవరికి వారు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడక ముందే నేతలు ఊరూరా తిరుగుతూ ఎన్నికల రణరంగాన్ని హీటెక్కిస్తున్నారు. రాప్తాడు యుద్ధంలో టీడీపీ, వైసీపీల అస్త్రశస్త్రాలేంటి?

అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం. 2009లో ఏర్పడింది. గతంలో పెనుకొండ నియోజకవర్గంలో ఉన్న రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలతో పాటు రాప్తాడు, అనంతపురం, ఆత్మకూరు మండలాలను కలిపి రాప్తాడు నియోకజవర్గంగా ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీత, ఆమెకు ప్రత్యర్థిగా 2009లో కాంగ్రెస్ తరఫున, 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బరిలో నిలిచారు. ప్రస్తుతం 2019 ఎన్నికల్లోనూ మరోమారు వీరే తలపడుతున్నారు.

నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై కేవలం 1700 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో వైఎస్‌ఆర్ పార్టీ తరఫున పోటీ చేసిన ప్రకాష్ రెడ్డిపై 8,500 ఓట్ల మెజారితో విజయం సాధించి పట్టు నిలపుకున్నారు పరిటాల సునీత.

అంతకుముందు సునీత సొంత మండలం రామగిరితో పాటు కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేవి. 1994 నుంచి పరిటాల రవీంద్ర పెనుకొండ ఎమ్మెల్యేగా కొనసాగారు. మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్‌టీఆర్ ప్రభుత్వంలో కార్మికశాఖ మంత్రిగా కొనసాగారు. అనంతరం మారిన పరస్థితుల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. 2005, జనవరి24న పరిటాల రవీంద్రను ప్రత్యర్థులు అనంతపురం పార్టీ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో పరిటాల సునీత తొలిసారి పెనుకొండ ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయ అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకూ మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2014లో గెలుపొందినప్పటి నుంచి మంత్రిగా చేస్తున్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,12,283 మంది. అందులో 1,08, 222 మంది పురుషులు, 1,04,041 మంది స్త్రీలు. 20 మంది ఇతరులు ఉన్నారు. అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని చెబుతున్న సునీత, అవే తనను గెలిపిస్తాయని దీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, గతంలో పరిటాల రవీంద్రకు అత్యంత ఆప్తులుగా ఉన్నవారు, తర్వాతి కాలంలో ఆమెకు దూరమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. బంధుప్రీతి, మంత్రిని ఇబ్బందులకు గురిచేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. మాజీ జడ్పీ ఛైర్మన్ చమన్ ఇటీవల మరణించడం, నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో తమ బంధువులు ఇన్‌చార్జిలుగా కొనసాగడం మంత్రికి ప్రతికూల అంశాలవుతాయని ప్రత్యర్థులు భావిస్తున్నారు. జిల్లాలో పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు లీడర్లతో పరిటాల సునీతకు ఉన్న వైరం ఇప్పటికీ కొనసాగుతూనే ఉండడం క్యాడర్‌ను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇప్పటికే రెండుసార్లు పరిటాల సునీతపై పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రెడ్డి 2019లో ఎలాగైనా గెలిచి తీరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూ క్యాడర్‌లో ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు. పలు దఫాలుగా పాదయాత్రలను నిర్వహించి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు. అదే నియోజకవర్గానికి చెందిన గంగుల భానుమతితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మంత్రి పరిటాల సునీత, రాష్ట్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తూ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వంపైనా, పరిటాల కుటుంబంపైనా ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకోవాలని, అన్ని వర్గాలను కలుపుకుపోయే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పలువరు టీడీపీ నేతలు, పరిటాల వ్యతిరేకులను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ముందే ఆధిపత్యపోరు మొదలైంది. ఇటీవల ప్రకాష్ రెడ్డి సొంత గ్రామం తోపుదుర్తిలో నిర్వహించిన పసుపు కుంకుమ కార్యక్రమానికి మంత్రి పరిటాల సునీత హాజరు కావడం రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. సునీత కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్లు, చీపుర్లు విసిరి నిరసన తెలిపారు. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకోవడానికి పెద్దఎత్తున వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మొత్తానికి అటు టీడీపీ, ఇటు వైసీపీలు, రాప్తాడు కోసం నువ్వానేనా అంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories