కోటికి సై... ఆ పంచాయతీల్లో పోటాపోటీ

Nizamabad
x
Nizamabad
Highlights

పంచాయతీ ఎన్నికల ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. హాట్ కేకుల్లా ఉన్న ఆ సర్పంచ్ పీఠాలను చేజిక్కించుకునేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు...

పంచాయతీ ఎన్నికల ఖర్చు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తోంది. హాట్ కేకుల్లా ఉన్న ఆ సర్పంచ్ పీఠాలను చేజిక్కించుకునేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు అభ్యర్ధులు. కోటి ఖర్చు పెట్టేందుకైనా డోంట్ కేర్ అంటూ డబ్బునే నమ్ముకుని ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. మందు, విందుతో పాటు కుల సంఘాలకు సపరేటుగా ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. దాంతో ఆ పంచాయతీల్లో ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని అంకాపూర్ గ్రామానికి దేశ స్థాయిలో గుర్తింపు ఉంది. అలాగే నందిపేట, ఆలూరు గ్రామ పంచాయతీలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు ఉంది. ఈ మూడు మేజర్ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పీఠం హాట్ కేకులా మారింది. సర్పంచ్ పీఠం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆయా అభ్యర్ధులు ఎంతటి ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దాంతో అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా నగదు, మద్యం పంపిణీకి పోటీపడుతున్నారు. వార్డు సభ్యుల వ్యయాన్ని సైతం సర్పంచ్ అభ్యర్ధులే పెట్టుకుంటున్నారు.

ఆర్మూరు మండలంలోని అంకాపూర్‌లో ఒక్కో అభ్యర్ధి 50లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు సై అంటున్నారు. ఆర్మూరు మున్సిపాలిటీని ఆనుకొని ఉన్న ఈ గ్రామంలో 50 సీడ్స్ కంపెనీలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో ఆదర్శ గ్రామ పంచాయతీగా, ఆదర్శ గ్రామంగా పేరు పొందింది. ఇక్కడ వ్యవసాయం లాభసాటిగా జరుగుతుండటంతో అంకాపూర్‌కు దేశంలోనే గుర్తింపు లభించింది. దాంతో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా వెనుకాడటం లేదు. పైగా ఈసారి జనరల్ మహిళకు కేటాయించడంతో పోటీ మరింత తీవ్రంగా ఉంది. అయితే డబ్బుకు కాకుండా మంచి వ్యక్తులకే ఓటేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు.

నందిపేట, ఆలూరు పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. ఈ రెండు గ్రామాల్లోనూ అభ్యర్ధులు భారీ నజరానాలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. లక్కంపల్లి గ్రామంలో సైతం సర్పంచ్ పీఠానికి భారీ పోటీ నడుస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలోనే ఈ మూడు గ్రామ పంచాయతీలు కాస్లీ లిస్టులో చేరిపోయాయి. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఒకరిని మించి మరొకరు ఖర్చు పెడుతున్నారు. అయితే పోటీ తీవ్రంగా ఉండటంతో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఉత్కంఠ రేపుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories