పోరాడి ప్రేమను గెలిపించుకున్న ప్రియురాలు

పోరాడి ప్రేమను గెలిపించుకున్న ప్రియురాలు
x
Highlights

మాటలు కలిపారు చేయి చేయి కలిపి తిరిగారు కడదాకా ప్రయాణం చేయాలనుకున్నారు. ఆమె మాత్రం అది ప్రేమ అనుకుంది. కానీ అతడు మాత్రం ఆమెను దూరం చేశాడు. మరి ప్రేమలో...

మాటలు కలిపారు చేయి చేయి కలిపి తిరిగారు కడదాకా ప్రయాణం చేయాలనుకున్నారు. ఆమె మాత్రం అది ప్రేమ అనుకుంది. కానీ అతడు మాత్రం ఆమెను దూరం చేశాడు. మరి ప్రేమలో మోసపోతే..? ఆ నమ్మినవాడే నయవంచనకు గురిచేస్తే..? ఆత్మహత్య చేసుకోవాల్సిందేనా..? నిజమైన ప్రేమకు అపజయం లేదు. దాన్నే నమ్ముకుంది. ఆ నమ్మకాన్ని నిజం చేసిందో ప్రేమికురాలు.

ఈ అమ్మాయి పేరు స్వప్న. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పుల్లగామ గ్రామానికి చెందిన స్వప్న అదే గ్రామానికి సమ్మయ్యతో ప్రేమలో పడింది. నాలుగేళ్లుగా వారి ప్రేమాయణం సాఫీగానే సాగింది. అయితే పెళ్లి విషయానికి వచ్చే సరికి కులాలు అడ్డొచ్చాయి. కామన్‌గానే సమ్మయ్య కుటుంబం పెళ్లికి నో చెప్పింది. అప్పుడు మొదలైంది హైడ్రామా.

తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెళ్లి చేసుకునేది లేదంటూ స్వప్నతో తేల్చిచెప్పాడు సమ్మయ్య. నాలుగేళ్లుగా నమ్మిన ప్రేమికుడు చేసిన మోసానికి కుంగిపోయి కూర్చోలేదు స్వప్న. తనవారితో కలిసి పోరాటానికి దిగింది. న్యాయం చేయాలంటూ సమ్మయ్య ఇంటిముందే భైఠాయించింది.

దీంతో విషయం పోలీస్‌స్టేషన్‌ మెట్లెక్కింది. సమ్మయ్యకు, ఆయన కుటుంబ సభ్యులకు ఖాకీలు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. మొత్తానికి స్వప్నతో ఏడడుగులు నడిచేందుకు సమ్మయ్య ఒప్పుకున్నాడు. చివరకు ఇరు కుటుంబాలు, గ్రామపెద్దల సమక్షంలో మూడు ముళ్లు వేశాడు.

మొత్తానికి పుల్లగామ ప్రేమ పంచాయితీ ఫలప్రదమైంది. స్వప్న నాలుగేళ్ల స్వప్నం నెరవేరింది. ప్రేమించివాడే మనువాడటం ప్రేమపోరాటంలో విజయం సాధించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రేమలో విఫలమైన వారికి స్వప్న ప్రేమకథ స్ఫూర్తినిచ్చింది.


Show Full Article
Print Article
Next Story
More Stories