తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిపై ఆసక్తికరమైన చర్చ...మరో ఐదుగురు కూడా...

తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిపై ఆసక్తికరమైన చర్చ...మరో ఐదుగురు కూడా...
x
Highlights

కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటనే దానిపైనే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఓ వైపు ఎమ్మెల్యేల వలసలు ఆగకపోవడం మరోవైపు ఉన్నవాళ్లలో ఇంకెంత మంది...

కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటనే దానిపైనే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఓ వైపు ఎమ్మెల్యేల వలసలు ఆగకపోవడం మరోవైపు ఉన్నవాళ్లలో ఇంకెంత మంది కారెక్కుతారో అర్థం కాకపోవడం ఆ పార్టీ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక పరిస్థితి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉంటుందా అనే చర్చ నుంచి కాంగ్రెస్‌ శాసనసభా పక్షం టీఆర్ఎస్‌లో విలీనం అవుతుందా అనే వరకు వెళ్తోంది.

ఇంకెవరు హ్యాండిస్తారు..?

ఎంతమంది కారెక్కుతారు..?

ప్రతిపక్ష హోదా గల్లంతయినట్టేనా..?

మరి కాంగ్రెస్‌ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం అవుతుందా..?

టీఆర్ఎస్‌ టార్గెట్‌ కూడా అదేనా..?

ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితిపై జరుగుతున్న చర్చ ఇది. ఎప్పుడు ఎవరు కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతారో అర్థం కాని పరిస్థితి ఆ పార్టీలో నెలకొంది. ఇప్పటికే 8 మంది హస్తం ఎమ్మెల్యేలు తాము కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తామంటూ బహిరంగ ప్రకటనలు చేశారు. మరింత మంది కూడా అదే దారిలో వెళ్తారంటూ ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. దీంతో తర్వాతి రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి ఏంటనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన టీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 16 సీట్లు సాధించాలని టార్గెట్‌ పెట్టుకుంది. అందులో భాగంగానే ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ముమ్మరం చేసింది. ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు బహిరంగ మద్దతు ప్రకటించారు. వీరి దారిలోనే మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేజారుతుండటంతో కాంగ్రెస్ సంకట స్థితిలో పడింది. 8 మంది ఎమ్మెల్యేలు దూరం కావడంతో ప్రతిపక్ష హోదా గల్లంతైనట్లే. ఇక మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా కారెక్కేస్తే టూ బై థర్డ్‌ మెజార్టీ ఉండదు కాబట్టి శాసనసభా పక్షం కూడా గల్లంతవుతుందనే ప్రచారం సాగుతోంది.

గతంలో అసెంబ్లీలో టీడీపీ శాసనసభా పక్షాన్ని, ఇటీవల మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని ఏవిధంగానైతే టీఆర్ఎస్‌లో విలీనం చేశారో 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌ కు మారితే సీఎల్పీ టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారని చెబుతున్నారు. అయితే పార్టీ మారుతున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యేలంతా సాంకేతికంగా కాంగ్రెస్‌‌లోనే ఉన్నా తర్వాత జరిగే పరిణామాలపైనే ఆ పార్టీ తలపట్టుకుంది. సీఎల్పీని విలీనం చేయాలంటూ స్పీకర్‌కు లేఖ ఇవ్వడం ద్వారా ఆ తంతు కూడా కానిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో కాంగ్రెస్‌కు ఎన్నికలకు ముందు తిప్పలు తప్పవనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories