King Charles III : నేడు బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకం

The Coronation of King Charles III
x

King Charles III: నేడు బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకం

Highlights

King Charles III : ఛార్లెస్-3 దంపతులకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ

King Charles III: కింగ్‌ చార్లెస్‌-3 పట్టాభిషేకానికి సర్వం సిద్ధమైంది. ఎక్కడ చూసినా.. కింగ్‌ పట్టాభిషేక సంబురాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజకుటుంబికులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుక సందడిగా జరగనుంది. ఈ కార్యక్రమంలో ఛార్లెస్‌తోపాటు ఆయన భార్య రాణి కెమిల్లాకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేస్తారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ లండన్‌కు చేరుకున్నారు. సుమారు 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.

ఛార్లెస్‌-3 పట్టాభిషేకం సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ క్రైస్తవుల పవిత్ర గ్రంథం బైబిల్‌లోని ఎంపిక చేసిన పంక్తులను పఠిస్తారు. ఇతరులకు సేవ, సకల జనులపై క్రీస్తు ప్రేమను తెలియజేసేలా అది ఉండబోతోంది. బ్రిటన్‌ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రధానులు బైబిల్‌ను పఠించడం కొంతకాలంగా ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు సునాక్‌ కూడా దాన్ని పాటించనున్నారు. ఈసారి పట్టాభిషేక వేడుకలో భిన్న మత విశ్వాసాలకు పెద్దపీట వేస్తున్నట్లు కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్‌ కార్యాలయం తెలిపింది. భారతీయ మూలాలున్న తొలి బ్రిటన్‌ ప్రధాని, హిందూ మతస్థుడు అయిన సునాక్‌ క్రైస్తవ మత గ్రంథాన్ని పఠించనుండటం అందుకు అద్దం పడుతుందని తెలిపింది.

రాజుగా తన పట్టాభిషేకం అనంతరం ఛార్లెస్‌ సుమారు 4 లక్షల మందికి కృతజ్ఞతా బహుమతులు అందించనున్నారు. పట్టాభిషేక కార్యక్రమ ఏర్పాట్లలో పాల్గొన్న వివిధ శాఖల సిబ్బందికి, దేశానికి సేవలందిస్తున్న ఆర్మీ, పోలీసు, అత్యవసర సేవల సిబ్బందికి వీటిని అందించనున్నారు. ఇందుకోసం ఛార్లెస్‌, కెమిల్లా ప్రతిమలతో కూడిన పతకాలను తయారు చేశారు.

ఈసారి రాజు హోదాను సూచిస్తూ హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులు బహూకరించే చిహ్నాల్లో తొలిసారిగా హిందూ, జైన, సిక్కు తదితర మతాలకు చెందినవి కూడా ఉండబోతున్నాయి. పట్టాభిషేకం సందర్భంగా ఛార్లెస్‌ అన్ని సమాజాలకు సేవ చేసే సార్వభౌమాధికారం కోసం ప్రార్థించనున్నారు. కార్యక్రమంలో హిందువులు, యూదులు, సిక్కులు, ముస్లింలు, బౌద్ధులు తదితర మత ప్రతినిధుల నుంచి ఛార్లెస్‌ అభినందనలు స్వీకరించనున్నారు.

భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్‌–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్‌–3 బ్రిటన్‌ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్‌–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి వెస్ట్‌మినిస్టర్‌ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్‌ ఎడ్వర్డ్‌ కిరీటాన్ని చార్లెస్‌–3, సెయింట్‌ మేరీస్‌ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు.

ఈసారి కోహినూర్‌ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్‌ ఎలిజబెత్‌–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్‌–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories