అంధకారం దిశగా శ్రీలంక అడుగులు ? తీవ్రమైన డీజిల్‌ కొరత.. కరెంటు కోతలు

Sri Lanka Economic Crisis No Diesel No Current | Sri Lanka Latest News
x

అంధకారం దిశగా శ్రీలంక అడుగులు ? తీవ్రమైన డీజిల్‌ కొరత.. కరెంటు కోతలు

Highlights

Sri Lanka: *పరిస్థితి ఇలాగే కొనసాగితే అంధకారమే *చీకట్లో మగ్గనున్న లంక ప్రజలు

Sri Lanka: రావణ రాజ్యం శ్రీలంక.. పరిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి. సంక్షోభంలో కూరుకున్న లంకను రోజుకో కష్టం చుట్టుముడుతోంది. అసలే ఆకలితో అలమటిస్తున్న ప్రజలపై రాజపక్సే ప్రభుత్వం మరో బాంబు పేల్చింది. ఇక డీజిల్‌ను అమ్మడం లేదంటూ ప్రభుత్వం ప్రకటించింది. వాహనాలకు పెట్రోలు లభించకపోవడంతో గత్యంతరం లేక ఇన్నాళ్లు అక్కడి ప్రజలు బస్సులకు వెళ్లేవారు.. డీజిల్‌ నిండుకోవడంతో రవాణాలో కీలకమైన బస్సులు ఇక డిపోలకే పరిమితం కానున్నాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే ఇక కాలినడక తప్పదేమో అని.. శ్రీలంక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రావణుడి కాలంలో అష్టైశ్వర్యాలతో తులతూగిన లంక... నేడు దుర్భిక్షం అనుభవిస్తోంది. చేతిలో డబ్బు ఉన్నా.. తినడానికి తిండి దొరకని పరిస్థితి శ్రీలంక ప్రజలది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశంలో తగినన్ని విదేశీ మారక నిల్వలు లేకపోవడంతో ఆహారం, మందులు, ఇంధన దిగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. పెట్రోలు, నిత్యావసర వస్తువుల కోసం దుకాణాలు, పెట్రోలు బంకులకు ప్రజలు పోటెత్తారు. గంటల తరబడి క్యూలో నిల్చుండడంతో ముగ్గురు మృతి చెందారు. పెట్రోలు బంకుల వద్ద ప్రజలు ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దింపింది.

ద్వీప దేశాన్ని ప్రధానంగా ఇంధన కొరత వేధిస్తోంది. 2 కోట్లా 20 లక్షల ప్రజలు ఉన్న ఈ దేశంలో చమురు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఉన్న నిల్వలతో ఇప్పటివరకు నెట్టుకొచ్చిన రాజపక్సే ప్రభుత్వం.. చమురు పూర్తిగా అయిపోవస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధనం కొరత రోజు రోజుకు అధికం కావడంతో ఏడు గంటల పాటు విధిస్తున్న కరెంటు కోతలను 10 గంటలకు పెంచింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రానున్న రోజుల్లో శ్రీలంక అంధకారంలో చిక్కుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. తాజాగా డిజీల్‌ నిల్వలు పూర్తిగా అయిపోయినట్టు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో డీజిల్‌తో నడిచే బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఇక నిలిచిపోనున్నాయి.

విదేశాల నుంచి అప్పుల కోసం ఎంత ప్రయత్నిస్తున్నా.. రాజపక్సే ప్రభుత్వానికి రూపాయి దొరకడం లేదు. భారత్‌ సాయం చేసినా.. లంకలో నెలకొన్న సంక్షోభానికి అది ఏమాత్రం సరిపోదు. దీంతో ప్రపంచ బ్యాంకులు, ఇతర దేశాల సాయం కోసం శ్రీలంక ఎదురుచూస్తోంది. ఏ దేశం నుంచి సాయం అందకపోతే.. రాజపక్సే ప్రభుత్వం చేతులు ఎత్తేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. విదేశీ మారక నిల్వలు ఉన్నప్పుడు ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయడంతోనే తాజా పరిస్థితి తలెత్తిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని తగిన చర్యలు చేపట్టాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories