California: కాలిఫోర్నియాలో భయపెడుతున్న రాకాసి అలలు

Massive Waves On California Coast Cause Flooding
x

California: కాలిఫోర్నియాలో భయపెడుతున్న రాకాసి అలలు

Highlights

California: ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న కోస్టల్ అధికారులు

California: అమెరికాలోని కాలిఫోర్నియాలో తీర ప్రాంత ప్రజలను సముద్రం భయపెడుతోంది.అలలు పెద్దఎత్తున ఎగసిపడుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాలుగు రోజులుగా తీర ప్రాంతంలోని నివాసాలపై అలలు విరుచుకుపడుతున్నాయి. ఉదృతంగా ఎగసిపడుతున్న అలలతో తీర ప్రాంతంలో పెద్దఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వాహనాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. పలువురికి గాయాలు అయ్యాయి. కోస్ట్ గార్డు సిబ్బంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలలు సుమారు 20 నుంచి 40 అడుగుల ఎత్తులో వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంచురాలో సముద్రపు అలలు దాదాపు 10 మందిని ఈడ్చుకువెళితే తాము కాపాడినట్లు ఫైర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు చెబుతున్నారు. అలల తాకిడి కారణంగా ఎనిమిది మంది ఆస్పత్రి పాలయ్యారు.

భారీ అలల ప్రభావంతో కాలిఫోర్నియాలో చాలా దూరం వరకు తీర ప్రాంతాన్ని మూసివేశారు. సముద్రపు నీరు చొచ్చుకొస్తుండటంతో రెస్టారెంట్లు, హోటళ్లు, సూపర్ మార్కెట్లు నీళ్లలో మునిగిపోయాయి. ముఖ్యంగా వెంచురా కౌంటీ తీర ప్రాంతంలో రక్షణ గోడను దాటి అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో రోడ్లపై నిలిపి ఉంచిన కార్లు కొట్టుకుపోయాయి. ఇక్కడ చాలా ఇళ్ల గ్రౌండ్‌ ఫ్లోర్లలోకి నీరు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. గడిచిన నాలుగు రోజుల నుంచి తీర ప్రాంతాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలానే ఉందని స్థానిక మీడియా చెబుతోంది.

ప్రజలు సముద్రంలోకి వెళ్లొద్దని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. హెర్మోస, మాన్‌హట్టన్‌, పాలోస్‌ వెర్డోస్‌ బీచ్‌ల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కాలిఫోర్నియా తీరప్రాంతంలో తుపాను ప్రభావంతో భారీగా అలలు ఎగసిపడుతున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా, ఓరెగాన్‌ తీర ప్రాంతాల్లోని దాదాపు 60 లక్షల మంది ఈ ఆలల ప్రభావాన్ని చవి చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories